కందిపప్పు ఎంతకు కొన్నారు?!

ABN , First Publish Date - 2022-05-22T08:48:24+05:30 IST

కందిపప్పు ఎంతకు కొన్నారు?!

కందిపప్పు ఎంతకు కొన్నారు?!

రూ.106 అంటున్న పౌరసరఫరాల కార్పొరేషన్‌

రూ.112కి కొనుగోలు చేసినట్లు ఎండీ ప్రకటన

రెండింటి మధ్య వ్యత్యాసం రూ.15కోట్లు

కందిపప్పు కొనుగోళ్లపై కొత్త అనుమానాలు


(అమరావతి- ఆంధ్రజ్యోతి)

పౌరసరఫరాల శాఖ కందిపప్పు కొనుగోళ్లపై కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. నాఫెడ్‌ వద్ద సరిపడ నిల్వలు లేకపోవడంతో పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఏప్రిల్‌లో టెండర్లు పిలిచి కందిపప్పు కొనుగోలు చేసింది. రెండు నెలల పంపిణీ కోసం 25వేల టన్నుల కందిపప్పును టెండర్ల ద్వారా తీసుకుంది. కిలో రూ.106 చొప్పున కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల శాఖ ఇప్పటివరకూ చెబుతూ వ చ్చింది. అయితే, గురువారం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో దీనిపై వచ్చిన ప్రశ్న కు పౌరసరఫరాల కార్పొరేషన్‌ ఎండీ వీరపాండియన్‌ సమాధానమిస్తూ ‘‘మార్కెట్‌ రేటు చూసుకోండి. టెండర్‌ రూ.112 వరకూ వచ్చింది. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు రేటు రూ.120గా ఉంటే రూ.112కే ఒకే చేశాం’’ అని వివరణ ఇచ్చారు. దీంతో అసలు కందిపప్పు ఎంతకు కొనుగోలు చేశారనే దానిపై కొత్త అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటివరకూ పౌరసరఫరాలశాఖ చెప్పిన రేటుకు, కొత్తగా ఎండీ చెప్పిన రేటును తేడా చూస్తే 25వేల టన్నులకుగాను రూ.15కోట్లు తేడా కనిపిస్తోంది. కాగా ఈ విషయంపై ఎండీ వివరణ కోరే ప్రయత్నం చేయగా ఆయన అందుబాటులోకి రాలే దు. పౌరసరఫరాల కార్పొరేషన్‌ అధికారులను మరోసారి సంప్రదిస్తే.. రూ.106కే కొనుగోలు చేసినట్లు స్పష్టం చేస్తున్నారు. నాఫెడ్‌ గతంలో ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్‌కు సరఫరా చేసిన కందిపప్పునకు బిల్లులు చెల్లించలేదని, అందువల్లే నాఫెడ్‌ ఏపీకి కందిపప్పు ఇవ్వడం లేదని తెలిసిం ది. అయితే బయట టెండర్లు పిలిచే ఉద్దేశంతోనే కావాలని నాఫెడ్‌కు బిల్లులు చెల్లించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తా జాగా.. కార్పొరేషన్‌ కార్యాలయంలో కందిపప్పు టెం డర్ల వ్యవహారాలు చూసే అధికారిని మార్చారు.


అంతా రహస్యమే

పౌరసరఫరాలశాఖ గతంలో సమాచారం విషయంలో పారదర్శకత పాటించేది. కానీ గత ఏడాది కాలంగా పౌరసరఫరాలశాఖ, కార్పొరేషన్‌ మితిమీరిన గోప్యత పాటిస్తున్నాయి. ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని కూడా ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకూ దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిదీ రహస్యంగా ఉంచాలని తమకు ఆదేశాలున్నాయని మధ్యస్థాయి అధికారులు చెబుతున్నారు. కార్పొరేషన్‌ అప్పులు, కందిపప్పు, పంచదార టెండర్లు, రైతులకు ధాన్యం చెల్లింపులు, రైతులకు రవాణా ఖర్చుల చెల్లింపులు ఇలా ప్రతి విషయాన్నీ రహస్యంగా ఉంచుతున్నారు. దీంతో కార్పొరేషన్‌ వ్యవహారాలపై మరిన్ని అనుమానాలు ముసురుతున్నాయి.

Updated Date - 2022-05-22T08:48:24+05:30 IST