ఎంతమందికి బోర్లు వేయాలో ఎంతలోతు వేయాలో తెలియట్లేదు!
వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వ్యాఖ్యలు
అనంతపురం, మే 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘జలకళ’ పథకంపై అధికార పార్టీ.. వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘గుడ్‌మార్నింగ్ ధర్మవరం’ పేరుతో శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ప్రతిరోజూ తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. శనివారం సుబ్బారావుపేటలో పర్యటించగా.. ఓ మహిళా రైతు ఎదురుపడి.. ‘సార్.. జలకళ పథకం కింద బోరు వేశారు. కరెంటు ఇవ్వలేదు. బియ్యం కార్డు కూడా రాలేదు’ అని వివరించారు. దీంతో ఎమ్మెల్యే స్పందిస్తూ.. ‘జలకళ బోరు ఎంతమందికి వెయ్యాలో, ఎంతలోతు వెయ్యాలో మాక్కూడా అర్థం కావడం లేదు. బోర్లేసిన తర్వాత ఆటోమేటిక్‌గా కరెంటు ఇస్తార్లేమ్మా’ అని అన్నారు. అదేసమయంలో ‘అసలు ఈ స్కీమే తప్పుడు స్కీమ్. ఒకరికి వేసి, మరొకరికి వేయడం లేదు’ అని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.