అక్కడా అదే భజన!

ABN , First Publish Date - 2022-05-23T08:02:04+05:30 IST

వ్యవస్థలన్నీ నాశనమైపోయి.. పారిశ్రామికవేత్తలెవరూ ఆంధ్ర వైపు చూడకపోయినా.. తామొచ్చాకే అన్ని వ్యవస్థలూ బాగున్నాయంటూ

అక్కడా అదే భజన!

అమరావతి వద్దన్న బోస్టన్‌ గ్రూప్‌ చైర్మన్‌తో దావోస్‌లో జగన్‌ భేటీ

పొగిడించుకుని.. ఎడిట్‌ చేసిన వీడియో మీడియాకు విడుదల

సీఎంతో ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడి భేటీ.. గౌతమ్‌ అదానీతోనూ సమావేశం


అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): వ్యవస్థలన్నీ నాశనమైపోయి.. పారిశ్రామికవేత్తలెవరూ ఆంధ్ర వైపు చూడకపోయినా.. తామొచ్చాకే అన్ని వ్యవస్థలూ బాగున్నాయంటూ జగన్‌ ప్రభుత్వం భజన చేసుకుంటోంది. ఈ భజనను రాష్ట్రానికే పరిమితం చేయకుండా దావో్‌సలో కూడా కొనసాగిస్తోంది. అక్కడ జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొంటున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి.. తమకు అనుకూలంగా ఉండే గ్రూపులు, సంస్థలతో నాలుగు ముక్కలు మాట్లాడించి.. దానిని కూడా ఎడిట్‌ చేసి తమకు కావలసిన రెండు ముక్కలను మాత్రం మీడియాకు విడుదల చేస్తుండడం గమనార్హం. దావో్‌సలో తొలిరోజు ఆదివారం జగన్‌రెడ్డి బృందం బోస్టన్‌ కన్సెల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) గ్లోబల్‌ చైర్మన్‌ హన్స్‌పాల్‌ బక్నర్‌తో భేటీ అయింది. బీసీజీ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ..! జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానుల ఆటకు ఈ గ్రూపే కీలకం. అమరావతి రాజధాని నిర్మాణంపై ఇదే సంస్థను సమతుల-సమగ్ర వృద్ధిపై జగన్‌ అప్పట్లో ఒక నివేదిక కోరారు. ఆ రిపోర్టు రాకముందే ఆయన అసెంబ్లీలో మూడు రాజధానులు ఉండాలని ప్రకటించారు. బీసీజీ కూడా ఆ దిశగానే నివేదిక ఇచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం, రాజ్‌భవన్‌ విశాఖపట్నంలో ఉండాలని.. అసెంబ్లీ అమరావతిలో గానీ, విజయవాడలో గానీ పెట్టాలని.. హైకోర్టు కర్నూలులో ఉండాలన్న ఆయన పలుకులనే అందులో పొందుపరిచింది. ఇందుకోసం అనేక అబద్ధాలను ఈ గ్రూపు వండివార్చిందనే విమర్శలు వెల్లువెత్తాయి.


సదరు బీసీజీపై కొందరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. ఇప్పుడు దావో్‌సలో ఆ పాత సంబంధాలతో అదే బీసీజీ గ్లోబల్‌ చైర్మన్‌ బక్నర్‌తో జగన్‌ చర్చించారు. ఆ తర్వాత బక్నర్‌తో సీఎం వెంట వెళ్లిన బృందం మాట్లాడించింది. ‘విద్య, వైద్య రంగాలు, తగిన మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చూపుతున్న చొరవ సానుకూల ఫలితాలను ఇస్తుంది. రాబోయే రోజుల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాదు, పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలను కూడా కల్పిస్తుంది.. విద్య, వైద్యం, ఆహారభద్రత ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. అవి లేకపోతే ఏమీ సాధించలేం. గొప్ప గొప్ప రోడ్లు, గొప్ప పోర్టులు, గొప్ప విమానాశ్రయాలు ఎన్ని ఉన్నా.. వాటిని నిర్వహించే, వ్యాపారాన్ని నడిపించే మంచి విద్యావంతులు, ఆరోగ్యవంతులు లేకుంటే ఎలాంటి ఉపయోగం ఉండదు..’ అని బక్నర్‌ అంటున్న ఓ వీడియో బైట్‌ను ఆ తర్వాత విడుదల చేసింది.


డబ్ల్యూఈఎఫ్‌ ప్లాట్‌ఫాం భాగస్వామ్యంపై ఒప్పందం

మరోవైపు.. దావో్‌సలో ఏర్పాటుచేసిన ఏపీ పెవిలియన్‌ను జగన్‌ ప్రారంభించారు. డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ ష్వాప్‌, వేదిక మొబిలిటీ, సుస్థిరత విభాగాధిపతి పెట్రో గోమెజ్‌లతో విడివిడిగా భేటీ అయ్యారు. డబ్ల్యూఈఎఫ్‌ ప్లాట్‌ఫాం భాగస్వామ్యంపై ఒప్పందం కుదుర్చుకున్నారు. మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు, ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి ఆదిత్య ఠాక్రే సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ కూడా జగన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

Updated Date - 2022-05-23T08:02:04+05:30 IST