వామ్మో.. బాదుడు

ABN , First Publish Date - 2022-08-13T07:55:16+05:30 IST

వామ్మో.. బాదుడు

వామ్మో.. బాదుడు

ఒక్కో కుటుంబానికి రూ.పది వేలు షాక్‌

ఈ ఏడాదిలోనే పదివేల కోట్ల అదనపు వడ్డన!

శ్లాబులు మార్చి.. డిపాజిట్ల పేరిట ఏమార్చి 

విద్యుత్‌లోనూ చూపించిన రాజకీయ బుద్ధి

గొప్పలకోసం సామాన్యుడి నడ్డి విరుస్తున్న వైనం

వినియోగదారుపై గుదిబండల్లా డిస్కమ్‌లు

అధిక ధరలకు కరెంటు కొంటున్న విద్యుత్‌ సంస్థలు 

నష్టాల పేరిట ముక్కుపిండి భారీగా వసూళ్లు

ఇప్పటికే రూ.2,910 కోట్ల ట్రూ అప్‌ భారం

మళ్లీ రూ.637 కోట్లకు ఈఆర్‌సీకి ప్రతిపాదనలు


ముఖ్యమంత్రి జగన్‌ రాజకీయకాంక్షకు విద్యుత్తు వినియోగదారులు బలైపోతున్నారు. రోజంతా విద్యుత్తు ఇస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధిని పొందటానికి సగటు మధ్యతరగతి ప్రజలకు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ‘బాదుడే.. బాదుడు..’ అంటూ గత ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆయన.. అధికారంలోకి రాగానే ‘అంతకు మించి..’ అన్నట్టు దంచేస్తున్నారు. ఈ ఏడాదిలోనే పది వేల కోట్లు సామాన్యుడిపై భారం పడగా, సగటున ఒక్కో కుటుంబం రూ.పది వేలు వరకు అదనంగా మోయాల్సి వస్తోంది. అత్యధికంగా యూనిట్‌కు రూ.22 వరకు డిస్కమ్‌లకు చెల్లిస్తూ.. నష్టాల పేరిట చార్జీల మోత, ట్రూఅప్‌ల వాతలు, లోడ్‌, కాషన్‌ డిపాజిట్లతో ప్రజలను అల్లాడిస్తున్నారు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వైసీపీ సర్కారు అమలు చేస్తున్న విద్యుత్తు విధానం కరెంటు వాడకందారులపై మోయలేని భారంగా మారింది. గతంలో ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్‌ ఒకటోతేదీ నుంచి కొత్త విద్యుత్తు టారిఫ్‌ విధానం అమలులోకి వచ్చేది. ఏప్రిల్‌ వస్తుందంటే .. చార్జీల షాక్‌ ఎక్కడ కొడుతుందోనన్న భయం అందరిలోనూ కనిపించేది. రాజకీయపక్షాలు కూడా ప్రభుత్వాన్ని నియంత్రించడంలో భాగంగా అప్రమత్తంగా ఉండేవి. ధరలు పెరిగితే .. ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచేలా ఆందోళనలు చేసేవి. కానీ .. ఇప్పుడు.. ఈ విధానం పోయింది. విద్యుత్‌ వినియోగదారుకు నెల నెలా గండంగానే గడుస్తోంది. వాస్తవ వ్యయ విధానం పేరిట .. ఒక కాలపరిమితి లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు విద్యుత్తు చార్జీలు పెంచుకుంటూ పోయే ధోరణే ఇందుకు కారణం. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పెంచిన విద్యుత్తు చార్జీలతో..వినియోగదారులపై దాదాపు రూ.3300 కోట్ల మేర భారం పడిందని విద్యుత్తురంగ నిపుణులు చెబుతున్నారు. వీటికితోడు 2014-15 నుంచి 2020-21 దాకా విద్యుత్తు కొనుగోళ్లు .. అమ్మకాలకూ మధ్య అనంతరం రూ.7224 కోట్లను వినియోగదారుల నుంచి వసూలు చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపాయి. అయితే.. కేవలం రూ.3669 కోట్లను మాత్రమే ట్రూఅప్‌ కింద వసూలు చేయాలని డిస్కమ్‌లను ఈఆర్‌సీ ఆదేశించింది. దీనిపై .. వినియోగదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ట్రూఅప్‌ భారం రూ.2910కోట్లకు తగ్గించారు. ఈ చార్జీలను ఇప్పటికే డిస్కమ్‌లు వసూలు చేస్తున్నాయి. ఇది చాలదన్నట్లుగా ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ విద్యుత్తు కొనుగోలు భారం సర్దుబాటు కింద .. మరో రూ.637 కోట్లు వసూలు చేసేందుకు తాజాగా డిస్కమ్‌లు సిద్ధమవుతున్నాయి. ట్రూఅ్‌పలు కాకుండా.. విద్యుత్తు వాస్తవ వాడకానికీ .. దరఖాస్తుకూ మధ్య ఉన్న అదనపు లోడ్‌ చార్జీలు రూ. 1800 కోట్ల దాకా వసూలు చేశారని చెబుతున్నారు. అంతేకాకుండా .. నెలకు 500 యూనిట్లు దాటిన వినియోగదారుల నుంచి కాషన్‌ డిపాజిట్‌ పేరిట దాదాపు రూ.1856 కోట్ల దాకా వసూలు చేశారని విద్యుత్తురంగ నిపుణులు వివరిస్తున్నారు. ఇవన్నీ కలిపితే .. మొత్తంగా రూ.10,503 కోట్లవుతోందని విద్యుత్తురంగ నిపుణులు పేర్కొంటున్నారు.


వదిలేదే లే...

గత మూడేళ్లుగా విద్యుత్తు భారాన్ని ప్రభుత్వం పెంచుతూపోతోంది. గతంలో పేద తరగతి వర్గాలకు కరెంటు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో రూ.45కే 75 యూనిట్లను ఇచ్చేవారు. ఇప్పుడు ఆ శ్లాబును ఉన్నపళంగా 30 యూనిట్లకు కుదించేశారు. ఈ 30 యూనిట్లకూ యూనిట్‌కు రూ.1.90 చొప్పన వసూలు చేయాలని నిర్ణయించేశారు. 31 నుంచి 73 యూనిట్ల దాకా యూనిట్‌కు మూడు రూపాయల చొప్పన వసూలు చేస్తున్నారు. గతంలో పేదవాడికి విద్యుత్తును చౌకగా ఇవ్వాలన్న నిర్ణయం అమలైతే .. ఇప్పుడు అందరినీ ఒకేవిధంగా గుంజేస్తున్నారు. నెలలో 76 నుంచి 125 యూనిట్లను వాడే మధ్యతరగతి వర్గాలు అత్యధికంగా ఉంటాయి. ఈ వర్గాల నుంచి యూనిట్‌కు నాలుగున్నర చొప్పున వసూలు చేస్తున్నారు. అదేవిధంగా నెలకు 225 యూనిట్లను వాడే మధ్యతరగతి వర్గాలపై యూనిట్‌కు ఆరు రూపాయల చొప్పన వసూలు చేస్తున్నారు. ఇలా చార్జీల పెంపు భారం మధ్య,ఎగువ మధ్యతరగతి వర్గాలపై .. సగటున రూ.400 నుంచి 2500 దాకా పడుతోంది. అదేవిధంగా లోడ్‌ డిపాజిట్‌ మొత్తం కింద ..రూ.6000 మొదలుకొని రూ.25000దాకా వసూలు చేశారు. ఇక .. 500 యూనిట్లు దాటిన విద్యుత్తు వినియోగదారుల నుంచి ప్రస్తుత ధరల మేరకు రెండు నెలల బిల్లులను అడ్వాన్సు కింద వసూలు చేశారు. ఇలా ఒక్కో వినియోగదారుడి నుంచి యూనిట్‌కు రూ.9.70 చొప్పున రూ.9700 వసూలు చేశారు. ఇలా విద్యుత్తు సంస్థలు వినియోగదారుల నుంచి వివిధ పేర్లతో వసూలు చేసిన మొత్తాలు ఒక్కో ఇంటిపై ఈ ఏడాదిలో సగటున రూ.10,000 వరకు ఉంటుందని విద్యుత్తురంగ నిపుణులు చెబుతున్నారు. ఇలా మూడేళ్లలో వసూలు చేసిన మొత్తాలను లెక్కేస్తే .. ఒక్కో కుటుంబానికి ఏటా రూ.50000 నుంచి రూ.100000 దాకా ఉంటుందని చెబుతున్నారు. 


బహిర్గతపరచరెందుకు?

వినియోగదారుల నుంచి ప్రతిపైసా వసూలు చేయాలని నిర్ణయించిన డిస్కమ్‌లు .. తాము కొంటున్న కరెంటు ధరలను ఎందుకు బహిర్గతపరచడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. రోజువారీ ఉత్పత్తి, డిమాండ్‌, విద్యుత్తు కొనుగోళ్ల సమాచారాన్ని కేంద్ర విద్యుత్తు సంస్థ తరహాలో ఎందుకు వెల్లడించడం లేదని నిలదీస్తున్నారు. విద్యుత్తు రంగ సంస్థలు అనుసరించే విధానాలు ప్రైవేటు అంశాల తరహాలో ఎందుకు గోప్యంగా ఉంచుతున్నాయని అడుగుతున్నారు. గతంలో యూనిట్‌ రూ.6.50కు కొనుగోలు చేస్తేనే అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసిన జగన్‌ .. ఇప్పుడు ఏకంగా రూ.22 చెల్లించడాన్ని ఎలా సమర్ధించుకుంటారని నిలదీస్తున్నారు. నియంత్రణ లేకుండా విచ్చలవిడిగా కొనుగోలు చేయడాన్ని ఈఆర్‌సీ కూడా తప్పుబట్టింది. యూనిట్‌ ధర రూ.12కు మించేందుకు వీలులేదని నియంత్రణ విధించింది.  తనది కాకుంటే .. కాశీ దాకా .. అన్నట్లుగా డిస్కమ్‌లు అధిక ధరకు విద్యుత్తు కొనుగోలు చేస్తూ .. వినియోగదారుల నుంచి దానిని పిండేయడం మామూలైపోయిందని రాజకీయపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే .. విద్యుత్తు పంపిణీ సంస్థలు ప్రైవేటు ఫైనాన్స్‌ మాఫియాలా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్తు పంపిణీ సంస్థలు వినియోగదారుల సేవ కోసం కాకుండా వ్యాపార ధోరణితో వ్యవహరిస్తుండటమే ఈ విమర్శలకు కారణం. వినియోగదారుల కోణంలో కాకుండా .. ఇష్టారీతిన విద్యుత్తు కొనుగోళ్లను నిర్వహించి .. దానికి యాజమాన్య నిర్వహణ చార్జీలనూ అదనంగా కలిపి .. వినియోగదారుల నుంచి వసూలు చేయడం డిస్కమ్‌లకు ప్రహసనంగా మారిందని విద్యుత్తురంగ నిపుణులు అంటున్నారు. విద్యుత్తు పంపిణీ సంస్థలు ఇదే తరహాలో వ్యవహరిస్తే .. ప్రభుత్వరంగం కంటే.. ప్రైవేటు రంగమే మేలన్న అభిప్రాయం బలంగా ఏర్పడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. టెలికాం రంగం తరహాలోనే విద్యుత్తు ప్రసారాల్లోనూ ప్రైవేటు సంస్థలు వచ్చేస్తే .. నచ్చితే కొనుక్కోవచ్చని లేదంటే .. మానుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


అలక్ష్య భారమూ వినియోగదారుపైనా..?

ప్రాజెక్టులను చేపట్టడడం.. వాటిని సకాలంలో పూర్తిచేయకుండా జాప్యం చేస్తూ నిర్మాణ వ్యయాన్ని పెంచేయడం ఏపీజెన్కోకు అలవాటుగా మారిం ది. విజయవాడ థర్మల్‌ విద్యుత్కేంద్రంలో అదనంగా 800 మెగావాట్ల విద్యుత్కేంద్రాన్ని 2019లో ట్రయల్‌రన్‌ చేయాల్సి ఉంది. సన్నాహాల దశ వరకు గత ప్రభుత్వం తీసుకువచ్చింది. అయితే.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తే ‘మేమే చేశాం’ అనే క్రెడిట్‌ దక్కదని అనుకున్నారో ఏమోగానీ దాన్ని ప్రారంభించనేలేదు. మూడేళ్ల జాప్యంతో వాస్తవ అంచనా వ్యయం రూ.5286 కోట్ల నుంచి రూ.7866 కోట్లకు పెరిగింది. అంటే రూ.2580 కోట్లు అదనంగా చెల్లించాల్సి పరిస్థితి ఏర్పడింది. కృష్ణపట్నం ధర్మల్‌ విద్యుత్కేంద్రం దుస్థితీ ఇలాగే ఉంది. ఇక్కడ అదనంగా 800మెగావాట్ల ప్లాంటును స్థాపించాలని నిర్ణయించారు. ఈ ప్లాంటు కూడా ప్రారంభానికి సిద్ధమయ్యే పరిస్థితిఉంది. కానీ మూడేళ్ల జాప్యం వల్ల అంచనా వ్యయం రూ.4276కోట్ల నుంచి రూ.8069కోట్లకు పెరిగింది. ఈ ప్రాజెక్టుల జాప్యం కారణంగా రూ.6373కోట్ల మేర భారం పడిందన్నమాట. ప్లాంట్ల నిర్మాణంకోసం రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, వాణిజ్య సంస్థల నుంచి అధికవడ్డీలకు రుణాలు తెస్తారు. పెరిగిన వ్యయాలకు తోడు పదుల కోట్లలో వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా జెన్కో నష్టాల ఖాతాల్లోకి వెళ్లి.. అది విద్యుత్తు ఉత్పత్తి వ్యయంపై భారమంతా పడుతుంది. ఇదంతా .. వినియోగదారులపైనే మోపుతున్నారు.

Updated Date - 2022-08-13T07:55:16+05:30 IST