‘సైబర్‌’ కోరల్లో...!

ABN , First Publish Date - 2022-08-13T08:59:39+05:30 IST

‘సైబర్‌’ కోరల్లో...!

‘సైబర్‌’ కోరల్లో...!

నిరక్షరాస్యుల నుంచి ఉన్నత విద్యావంతుల వరకూ వల

సామాన్యులు, ప్రజా ప్రతినిధులు ఎవరినీ వదలని కేటుగాళ్లు 

లాక్‌డౌన్‌ తర్వాత మూడింతలు పెరిగిపోయిన సైబర్‌ నేరాలు 

బాధితుల్ని ఓదార్చి వెనక్కు పంపడానికే ఖాకీలు పరిమితం 

కేసు నమోదు చేసినా ఉపయోగం ఉండదంటూ బుజ్జగింపు 

సిబ్బంది కొరత, పని ఒత్తిడి, బందోబస్తు డ్యూటీలతో సతమతం 


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సైబర్‌ కేటుగాళ్లు వల విసురుతున్నారు. మొబైల్‌ ఫోన్ల వినియోగం, డిజిటల్‌ లావాదేవీలు పెరగడంతో ప్రజలను సునాయాసంగా బురిడీ కొట్టిస్తున్నారు. కన్నుమూసి తెరిచేలోగా బ్యాంకు ఖాతా ఖాళీ చేసేస్తున్నారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ.... కానిస్టేబుల్‌ నుంచి రాష్ట్ర డీజీసీ స్థాయి వరకూ ఎవరినీ వదలడం లేదు. విద్యావంతులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా నిత్యం ఏదో ప్రాంతంలో సైబర్‌ నేరాల బారిన పడుతూనే ఉన్నారు. కట్టడి చేయాల్సిన పోలీసులు కేసు నమోదు చేసినా దర్యాప్తు చేయలేని స్థితిలో ఉన్నారు. కొత్త జిల్లాలను ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం వాటిలో సైబర్‌ పోలీసు స్టేషన్ల ఏర్పాటు మాత్రం వైర్‌సకు వదిలేసింది. లాక్‌డౌన్‌ తర్వాత దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాలు మూడింతలు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న సైబర్‌ నేరాల్లో కొన్ని ఇవీ... 


జామీను ఉన్నారంటూ బెదిరింపులు 

ఉత్తరాంధ్రకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలికి ఇటీవల ఒక ఫోన్‌ వచ్చింది. ‘‘మీవాళ్లు తీసుకున్న అప్పు చెల్లించలేదు.. మీరు జామీను ఉన్నారు.. ఆ డబ్బు మీరే చెల్లించాలి.. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం..’’ అని బెదిరించారు. తాను ఎవరికీ జామీను సంతకం చేయలేదని ఆమె బదులిచ్చినా ఊరుకోని సైబర్‌ నేరగాళ్లు తమ లాయర్‌తో మాట్లాడాలంటూ ఒక నంబరు పంపారు. భయపడిన ఆ ఆమె దానికి ఫోన్‌చేసి అప్పు తీసుకున్న వ్యక్తులెవరో తనకు తెలీదని, తాను ఎవ్వరికీ జామీను ఇవ్వలేదని, ఎక్కడా సంతకం పెట్టలేదని వివరించారు. తర్వాత కాసేపటికే ఆమెకు మరో ఫోన్‌ వచ్చింది. తక్షణమే రూ.25 వేలు చెల్లించకుంటే మీ ఫొటోలు బూతు బొమ్మలకు అతికించి నెట్టింట్లో పెడతామని బెదిరించారు. ఆమె ఫోన్‌ గ్యాలరీలో అప్పటికే నిక్షిప్తమై ఉన్న ఫొటోలు కొన్ని ఆమెకు వాట్సప్‌ ద్వారా పంపారు. అంత ఇచ్చుకోలేనంటూ బతిమాలడంతో చివరికి రూ.6వేలకు బేరం మాట్లాడుతున్నారు. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించిన ఆమె అంతటితో సమస్య తీరిందని ఊపిరిపీల్చుకున్నారు. అయితే రెండు రోజులు తిరక్కుండానే మళ్లీ కొత్త నంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. ఇదే బెదిరింపులు మొదలుపెట్టడంతో తెలిసిన పోలీసు అధికారికి సమాచారమిచ్చారు. అది సైబర్‌ నేరస్థుల పని, పట్టించుకోవద్దు.. అంటూ ఆయన ధైర్యం చెప్పారు. పదేపదే ఫోన్లు చేసి విసిగించిన సైబర్‌ నేరగాళ్ల దెబ్బకు ఆమె తన మొబైల్‌ నంబరు మార్చేయాల్సి వచ్చింది. 


అశ్లీల వీడియోలు పంపుతామని... 

ఏలూరుకు చెందిన ఓ వ్యక్తికి గతనెలలో వాట్సప్‌ ద్వారా వీడియో కాల్‌ వచ్చింది. అటువైపు నుంచి ఒక యువతి మాట్లాడుతూ తాను ఒంటరిగా ఉన్నానని, భర్త గల్ఫ్‌లో ఉంటారంటూ మాటలు కలిపింది. ఎందుకొచ్చిన సమస్య అనుకుని ఆ వ్యక్తి ఫోన్‌ కట్‌ చేశాడు. కొన్ని గంటల తర్వాత ఆయన ఫేస్‌బుక్‌లో ఉన్న ఫొటోలు వాట్సప్‌ ద్వారా ఆయనకే పంపారు. న్యూడ్‌ వీడియో కాల్‌ మాట్లాడావని, నీ ఫోన్‌ గ్యాలరీలో అశ్లీల వీడియోలు ఉన్నాయంటూ బెదిరించారు. రూ.25వేలు ఇవ్వకపోతే మీ స్నేహితులందరికీ నీ న్యూడ్‌ వీడియో పంపుతామని బెదిరించడంతో చివరకు రూ.7వేలు వదిలించుకున్నారు. పరిచయం ఉన్న ఒక పోలీసు అధికారికి విషయం చెప్పడంతో ఆ ఫోన్‌ నంబరు రాజస్థాన్‌ అడ్ర్‌సతో ఉందని, మీరు కట్టిన రూ.7వేల కోసం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అంతదూరం వెళ్లి నేరస్థులను అరెస్టు చేసి తీసుకురావడం సాధ్యం కాదని తేల్చేశారు. ఇకపై జాగ్రత్తగా ఉండాలంటూ హితబోధ చేయడంతో బాధితుడు ఉసూరుమన్నాడు. 


ఖాతాలో 98వేలు మాయం 

కర్నూలుకు చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధికి బ్యాంకు పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ చేశారు. కార్డు వివరాలతో పాటు ఓటీపీ అడగడంతో ఆయన ఏ మాత్రం అనుమానించకుండా చెప్పేశారు. వెంటనే రెండు విడతలుగా రూ.98వేలు ఆయన ఖాతా నుంచి మాయమయ్యాయి. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 


సీఐకే టోకరా

విజయవాడకు చెందిన ఒక సీఐ పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ తెరిచి ఆయన యూనిఫామ్‌తో ఉన్న ఫొటో ప్రొఫైల్‌గా పెట్టిన సైబర్‌ నేరగాళ్లు ఆయన మిత్రులకు సందేశాలు పంపారు. ఒక వ్యక్తి జబ్బుతో బాధ పడుతున్నారని, తాను సాయం చేయాలనుకొంటున్నానని, మీరూ 2వేలో, 3వేలో ఫోన్‌ పే చేయాలంటూ ఒక నంబరు పంపారు. స్పందించిన పలువురు సైబర్‌ నేరగాడి ఉచ్చులో పడగా మరికొందరు సీఐకి ఫోన్‌ చేసి అభినందించారు. ఆరా తీస్తే అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయిన సీఐ... అది తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కాదని, ఎవరూ డబ్బులు పంపొద్దని మిత్రులకు చెప్పారు. ఇదే తరహాలో ఏపీ మాజీ డీజీపీ పేరు, ఫొటోను వాడుకుని పలువురిని బుట్టలో పడేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ ఇలాంటి నేరాలు ఎక్కడో ఒకచోట నమోదవుతూనే ఉన్నాయి. 


నేరగాళ్లకు వరం 

ఆన్‌లైన్‌ మోసగాళ్లు ఎక్కువమంది నుంచి తక్కువ మొత్తంలో వసూళ్లు చేస్తుండటంతో పోలీసులు సీరియ్‌సగా తీసుకోవడం లేదు. కేసు కూడా నమోదు చేయకుండా బాధితులకు సర్దిచెప్పి పంపేస్తున్నారు. మూడేళ్ల వరకూ శిక్ష, రూ.లక్ష జరిమానా విధించే సైబర్‌ నేరాల్లో శిక్షల శాతం పెంచడం వారికి కష్టమేమీ కాదు. కానీ రాష్ట్రాల సరిహద్దులు దాటి నేరస్థులను అరెస్టు చేసి తీసుకు రావడమే అతిపెద్ద సవాలుగా మారింది. సిబ్బంది కొరత, పని ఒత్తిడి, శాంతి భద్రతల నిర్వహణ, బందోబస్తు డ్యూటీలు, రెగ్యులర్‌ కేసుల దర్యాప్తునకే 24గంటలూ సరిపోవడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇదే సైబర్‌ నేరగాళ్లకు వరంగా మారింది. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే ఈ తరహా నేరాల కట్టడిలో ఏపీ వెనుకబడి ఉందనే వాదన ఉంది. వీటి కట్టడికి కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు తమ పరిధిలో ఎంతో కొంత చర్యలు తీసుకొంటున్నాయి. ఏపీలో మాత్రం అధికార పార్టీ నేతలను ప్రశ్నిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిని అరెస్టు చేయడానికే పోలీసులు పరిమితవయ్యారన్న విమర్శలు వెల్తువెత్తుతున్నాయి.

Updated Date - 2022-08-13T08:59:39+05:30 IST