పాదయాత్రకు పల్లె వందనం

ABN , First Publish Date - 2021-11-15T08:31:15+05:30 IST

పాదయాత్రకు పల్లె వందనం

పాదయాత్రకు పల్లె వందనం

రైతులకు ప్రకాశం వాసుల సంఘీభావం 

ఊళ్లకు ఊళ్లు తరలివస్తున్న వైనం 

ప్రతిచోటా ఘన స్వాగతం, ఆదరణ 

14వ రోజు 13 కి.మీ. సాగిన యాత్ర 

టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల మద్దతు 


ఒంగోలు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ప్రకాశం జిల్లా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. ఊళ్లకు ఊళ్లు తరలివచ్చి సంఘీభావం తెలిపి పాదయాత్ర బృందంతో కలసి నడుస్తున్నారు. పలు గ్రామాల్లో యాత్రకు ఎదురేగి హారతులిచ్చి, కొబ్బరి కాయలు కొట్టి, గుమ్మడి కాయలతో దిష్టి తీసి ఆహ్వానం పలకడంతో పాటు పూల వర్షం కురిపిస్తూ ఆదరిస్తున్నారు. ఈ నెల 1న తుళ్లూరు నుంచి ప్రారంభమైన మహాపాదయాత్ర 14వ రోజైన ఆదివారం ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో 13 కి.మీ. సాగింది. ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే డీఎ్‌సబీవీ స్వామి నేతృత్వంలో వేలమంది ప్రజలు యాత్రలో పాల్గొన్నారు. ఒంగోలు రూరల్‌ మండలం యరజర్లలో రాత్రి బస చేసిన శిబిరం వద్ద నుంచి పాదయాత్ర బృందం ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో వేంకటేశ్వర స్వామికి పూజలు చేసి ముందుకు కదిలింది. జేఏసీ నేతలు శివారెడ్డి, గద్దే తిరుపతిరావు, కొలికపూడి శ్రీనివాసరావు, ఇతర నేతలతో ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ కలసి నడిచారు.కందులూరుకు చేరుకున్న బృందానికి ఎమ్మెల్యే  స్వామి, టీడీపీ యువనేత దామచర్ల సత్య ఆధ్వర్యంలో గ్రామస్థులు ఎదురేగి హారతులు ఇచ్చి, గుమ్మడికాయతో దిష్టి తీసి గ్రామంలోకి ఆహ్వానించారు. దాదాపు కిలోమీటరుకు పైగా రోడ్డుపై పూలు పరిచి వాటిపై నడిపించటంతో పాటు, పాదయాత్ర బృందంపై పూల వర్షం కురిపించారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో మర్లపాడు చేరుకొన్న బృందానికి వారుపోసి, హారతులిచ్చి స్వాగతం పలికారు. కందులూరు నుంచి మర్లపాడు వరకు ఎమ్మెల్యే స్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, ఉగ్రనరసింహారెడ్డి, సాయికల్పనారెడ్డి రైతులతో కలసి నడిచారు. మర్లపాడులో పాదయాత్ర బృందాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తదితరులు కలసి మద్దతు తెలిపారు. మర్లపాడులో మధ్యాహ్న భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకున్న బృందం 4 గంటల ప్రాంతంలో బయల్దేరి రాత్రికి ఎం.నిడమాలూరు చేరుకుని అక్కడ బస చేసింది. 


దారిపొడవునా పచ్చదనం

పాదయాత్ర సాగిన ప్రాంతమంతా గ్రామీణమే కావడంతో ఒకవైపు పచ్చని పొలాలు.. మరోవైపు యాత్రలో పాల్గొన్న వేలాది మంది చేతిలో ఆకుపచ్చజెండాలు, మెడలో పచ్చని కండువాలతో మరింత పచ్చదనంగా యాత్ర సాగింది. డప్పుల నృత్యాలు, జై అమరావతి నినాదాలతో పాదయాత్ర ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఒంగోలు జేఏసీ నేతలు చుంచు శేషయ్య, యు.ప్రకాశరావు, టీడీపీ జిల్లా నేతలు నూకసాని బాలాజీ, ఎరిక్షన్‌బాబు, పమిడి రమే్‌షతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనను చూసైనా అమరావతి రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-11-15T08:31:15+05:30 IST