మళ్లీ ముసురు!...అన్నదాత గుండెల్లో గుబులు

ABN , First Publish Date - 2021-11-29T08:03:49+05:30 IST

మళ్లీ ముసురు!...అన్నదాత గుండెల్లో గుబులు

మళ్లీ ముసురు!...అన్నదాత గుండెల్లో గుబులు

నెల్లూరు, చిత్తూరు, కడపల్లో అతిభారీ వర్షాలు

మిగతా జిల్లాల్లోనూ వాన జల్లులు

నెల్లూరులో రోజంతా ఎడతెరిపి లేని వాన 

నిండిన చెరువులు, పొంగుతున్న వాగులు

పెన్నాకు మళ్లీ వరదతో ప్రజల ఆందోళన 

కడపలో ‘గుంజన’ ఒడ్డున కుప్పకూలిన ఇళ్లు 

నేడు దక్షిణ కోస్తా, సీమలో భారీ వర్షాలు 

ఈ వర్షాలతో వరికంకులు మొలకెత్తే ప్రమాదం

2-3 తీత దశల్లో పత్తి.. రంగు మారే ముప్పు

మొన్నటి వర్షాలకే భారీ నష్టం.. ఇక మునగడమే 

కంట తడి పెడుతున్న అన్నదాతలు

 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ముసురేసింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లో వాన జల్లులు పడుతున్నాయి. రానున్న 48గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో నెల్లూరు జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయానికి జిల్లాలో సరాసరి 56.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులన్నీ నిండుగా ఉండటంతో వర్షపు నీరు రోడ్లపై పారుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పెన్నా పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు ఇన్‌ఫ్లో పెరుగుతోంది. ఆదివారం ఉదయం 6గంటలకు 45వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా రాత్రికి 96,107 క్యూసెక్కులకు పెరిగింది. దిగువకు 87 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పెన్నాకు మళ్లీ వరద పోటెత్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 


వణుకుతున్న కడప 

కడప జిల్లాలో ఆదివారం కురిసిన భారీవర్షాలతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగడంతో పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. శేషాచలం అడవుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వేకోడూరు చెంతనే గుంజన నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కోడూరు పట్టణ శివారులోని ఒడ్డున ఉన్న రెండు ఇళ్లు కుప్పకూలి నదిలో కలిసిపోయిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. ఇల్లంతా పగుళ్లు ఇవ్వడంతో ఇంట్లోని వారందరూ బయటకి రావడంతో ప్రాణనష్టం జరగలేదు. రైల్వేకోడూరు, నెల్లూరు వయా చిట్వేలు మధ్యలో యల్లమరాజు చెరువు పొంగిపొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట వాగులో గిరిజన కాలనీకి చెందిన నీలావతమ్మ అనే మహిళ చిక్కుకోగా, స్థానికులు, పోలీసులు తాడు సాయంతో ఆమెను కాపాడారు. రాజంపేట సమీపంలోని ఊటుకూరు చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఊటుకూరు హరిజనవాడ, అరుంధతివాడ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భారీవర్షాల నేపథ్యంలో కడప జిల్లాలో పాఠశాలలకు జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు సోమవారం సెలవు ప్రకటించారు. 


చిత్తూరులో భారీ వర్షాలు 

చిత్తూరు జిల్లా నగరి మండలం తెరణి గ్రామం వద్ద బ్రిడ్జి తెగిపోయింది. శ్రీకాళహస్తి మండలంలో కాండ్రగుంట చెరువు తెగింది. తిరుమలలోనూ ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. సాయంత్రం 4గంటలకు అలిపిరి కాలినడక మార్గాన్ని మూసివేశారు. కాగా, ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, రాళ్లపాడు ప్రాజెక్టులకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. 


రేపు అల్పపీడనం 

కొమెరిన్‌, శ్రీలంక పరిసరాల్లో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు తమిళనాడు, దక్షిణ కోస్తా, రాయలసీమ పైకి వీస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఆదివారం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మేఘాలు ఆవరించాయి. కాగా సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేకచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని స్పష్టంచేసింది. కాగా, 30న దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడి తరువాత 48గంటల్లో పశ్చిమ వాయవ్యంగా పయనిస్తోందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే నెల 3నుంచి 5వరకు ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, గాలుల తీవ్రత పెరుగుతుందని ఐఎండీ హెచ్చరించింది. 


వరద బాధితులకు ‘సోనూసూద్‌’ సాయం 

చిత్తూరు జిల్లాలోని వరద బాధితులకు సినీ నటుడు సోనూసూద్‌ సాయం అందజేశారు. సోనూసూద్‌ చారిటీ ఫౌండేషన్‌ తరపున నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, చీరలతో కూడిన 50వేల కిట్లను జిల్లాకు పంపించినట్లు ఆయన మిత్రుడు, తిరుపతికి చెందిన మించల ప్రదీప్‌ తెలిపారు. తిరుపతిలో బాధితులకు శనివారం 3వేల కిట్లు, ఆదివారం 4వేల కిట్లను ఎస్టీవీ నగర్‌, ఎంఆర్‌ పల్లి, పరసాలవీధి, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో పంపిణీ చేశామని చెప్పారు. సోమవారం కూడా తిరుపతి నగరంలో కిట్లు పంపిణీ చేస్తావని, ఇతర ప్రాంతాల్లోనూ వరద బాధితులకు సాయం అందజేస్తామని ప్రదీప్‌ పేర్కొన్నారు.


అన్నదాతకు వాన గండం వరికంకులు మొలకెత్తే ప్రమాదం

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు అన్నదాత కంట నీరు తెప్పిస్తున్నాయి. వారం క్రితం కురిసిన వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని, ప్రస్తుత వర్షాలతో నిండా మునిగిపోయినట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో వరి, పత్తి, మిర్చి, శనగ, వేరుశనగ, టమాటా, ఉల్లి, ఇతర ఉద్యాన పంటలకు తీరని నష్టం వాటిల్లుతోంది. మరో రెండ్రోజులు వర్షం కొనసాగితే కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలి కంకులు మొలకెత్తుతాయని రైతు లు వాపోతున్నారు. కృష్ణా జిల్లాలో పత్తి రెండు, మూడు తీత దశల్లోఉంది. వర్షానికి నడివిరుపు తీతదశలో ఉన్న పత్తి తడిసి రంగు మారిపోతుందని ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-11-29T08:03:49+05:30 IST