అప్పన్న భూమిలో దందా!

Nov 29 2021 @ 03:19AM

ఆక్రమణల క్రమబద్ధీకరణకు ప్రయత్నాలు 

నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్ల మార్పిడి 

రహదారి కోసం పోర్టు నుంచి భూమి లీజు 

పది అంతస్థుల నిర్మాణానికి ప్రణాళిక 

అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన


సింహాచలం దేవస్థానం భూముల్లో భారీ దందాకు తెరలేచింది. ఆలయ భూములు కాపాడతామంటూనే... అక్కడ బహుళ అంతస్థుల భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా దేవస్థానం అధికారులు భూ మార్పిడికి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థలానికి మూడు వైపులా రహదారి కూడా ఇవ్వడంతో దాని ఆధారంగా కొందరు అక్కడ ఏకంగా పది అంతస్థుల భవన నిర్మాణం చేపట్టారు.


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

విశాఖపట్నం పోర్టు స్టేడియం వెనుక సింహాచలం దేవస్థానానికి భూములు ఉన్నాయి. పేదలతో పాటు కొందరు ‘పెద్దలు’ కూడా వాటిని ఆక్రమించారు. వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి ఇప్పుడు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతమంతా సర్వే నం.275లోకి వస్తుంది. స్టేడియం వెనుక 60 అడుగుల రహదారి ఉంది. దానిని ఆనుకొని పోర్టుకు ఉన్న భూముల్లో ఓ భవనం నిర్మించారు. పక్కన గ్యాస్‌ గోడౌన్‌ ఉంది. ఆ వెనుక సర్వే నం.275 భూములు ఉన్నాయి. వాటిలో పాతికేళ్ల క్రితం కొంతమంది అనధికారికంగా లేఅవుట్‌ వేశారు. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్‌... అంటూ బ్లాకులుగా విభజించి 167గజాల నుంచి 300గజాల వరకు ప్లాట్లు వేసి విక్రయించారు. దేవస్థానం ఆక్రమిత భూములను క్రమబద్ధీకరిస్తామని 1998లో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం జీఓ 508 ఇవ్వగా కొంతమంది ప్రభుత్వం చెప్పిన మొ త్తం కట్టేశారు. అలాంటివారికి ఎల్‌ఆర్‌ఎస్‌ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఈ లేవుట్‌లో కూడా కొందరు అప్పట్లో ఎల్‌ఆర్‌ఎస్‌ పత్రాలు తీసుకున్నారు. 


నాలుగేళ్ల క్రితం కొత్త ప్రణాళిక 

ఆ లేవుట్‌లో ప్లాట్లు కొన్నవారిలో కొందరు దేవదాయ శాఖలో పైరవీలు చేసి ఎక్కడా లేని కొత్త విధానానికి తెరతీశారు. తాము దేవస్థానం నుంచి 12 ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ తీసుకున్నామని, వివిధ బ్లాకుల్లో తమ ప్లాట్లు ఉన్నాయని, అందరికీ కలిపి ‘బి’ బ్లాకులో ఒకే దగ్గర కావాలని, భూ మార్పిడి(ల్యాండ్‌ ఎక్స్చేంజ్‌)కి అనుమతించాలని కోరారు. వారిలో ముగ్గురికి బీ-బ్లాకులోనే ప్లాట్లు ఉండగా, మిగిలిన 9మంది వేర్వేరు బ్లాకుల్లో ఉన్నారు. ఇది నిబంధనలకు వ్యతిరేకమైనా నాటి ఉన్నతాధికారి వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని ప్రత్యేక మెమో ద్వారా వారి నుంచి 2,928.77 గజాలు తీసుకొని, బీ-బ్లాకులో 2,919.20 గజాలు కేటాయిస్తున్నట్టు 2017 ఫిబ్రవరి 22న ఉత్తర్వులు ఇచ్చారు. అలా మూడో కంటికి తెలియకుండా భూ మార్పిడి జరిగిపోయింది. 


ఆ 9 ప్లాట్ల ఓనర్ల సంగతి ఏమిటి?

వేరే బ్లాకుల నుంచి తొమ్మిది మందిని తెచ్చి బీ-బ్లాకులో ఒకే దగ్గర పక్కపక్కన భూమి కేటాయించారు. అయితే అప్పటికే ఆ ప్లాట్లలో వేరే వారు ఉన్నారు. వారికి ఇంకా ఎల్‌ఆర్‌ఎస్‌ సర్టిఫికెట్లు రాలేదు. పొజిషన్‌లో అయితే ఉన్నారు. ఇప్పుడు వారిలో కొందరికి ఈ భూ మార్పిడి విషయం తెలియడంతో అదెలా చేస్తారని నిలదీస్తున్నారు. తాము అక్కడ 25ఏళ్ల నుంచి ఉన్నామని, రేపు న్యాయస్థానం అనుమతిస్తే ఎల్‌ఆర్‌ఎస్‌ వస్తుందని, అప్పుడు తమకు ఆ స్థలం లేకపోతే ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని యోచిస్తున్నారు. 


అసలు విషయం మరుగున

ఎల్‌ఆర్‌ఎస్‌ సర్టిఫికెట్లు తీసుకున్నవారు మాత్రమే అక్కడ పొజిషన్‌లో ఉన్నారని, మిగిలిన భూమి అంతా దేవస్థానానిదే కాబట్టి... అప్పటికే అక్కడ వివిధ బ్లాకుల్లో ఉన్నవారిని గుర్తించడం లేదన్నట్టుగా భావిస్తూ... బీ-బ్లాకులో ఖాళీ స్థలాన్ని కోరినవారికి ఎక్స్చేంజ్‌ కింద ఇస్తున్నట్టు దేవదాయ శాఖ అధికారులు డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు. ఒక బ్లాకు నుంచి మరొక బ్లాకులో వెళతామని వారు కోరినప్పుడు అక్కడ కూడా వేరేవారు ఉంటారనే విషయాన్ని తొక్కిపెట్టారు. ఇందులో ట్విస్ట్‌ ఏమిటంటే... సర్వే నం.275లోని బి-బ్లాకుకు వెళ్లడానికి మార్గం లేదు. అసలు వెళ్లడానికి వీలులేని చోట దాదాపుగా 3,000 గజాలు వారికి కేటాయించారు. అందులో భారీ భవన నిర్మాణం చేపట్టాలని ప్లాన్‌ చేసుకున్నారు. దీనికి రహదారి అవసరం కాబట్టి... భూమికి ముందున్న పోర్టు యాజమాన్యాన్ని సంప్రదించారు. అప్పట్లో పోర్టు చైర్మన్‌గా ఉన్న కృష్ణబాబు ఒప్పుకోకపోవడంతో రూటు మార్చి ఢిల్లీ వెళ్లారు. పోర్టు భూమి కనీసం లీజుకైనా ఇవ్వాలని ఒత్తిడి తెచ్చి కొంత స్థలాన్ని తీసుకున్నారు. దానికి అడ్డంగా ఉన్న గ్యాస్‌ గోదామును వ్యూహాత్మకంగా తొలగించారు. పోర్టు నుంచి లీజుకు తీసుకున్న స్థలంలో రహదారి వేయడంతో దానికి 60అడుగుల రోడ్డుతో కనెక్టివిటీ వచ్చింది. ఆ స్థలానికి మూడు వైపులా మార్గం ఇస్తూ దేవస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అదెలా చెల్లుబాటవుతుందో అర్థంకాక ఆ పత్రాలను రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు పక్కనపెట్టారు. 


జీవీఎంసీలో ప్లాన్‌కు దరఖాస్తు 

భూ మార్పిడి ద్వారా వచ్చిన 3వేల గజాల భూమిని ఓ బిల్డర్‌కు డెవల్‌పమెంట్‌కు ఇచ్చి అందులో పది అంతస్థుల భవనం నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా ఆన్‌లైన్‌లో సర్వేయర్‌ ద్వారా దరఖాస్తు చేయించారు. ఇది భారీ భవంతి కావడంతో అమరావతి నుంచి అనుమతి రావాల్సి ఉంది. అందుకని ఆ దరఖాస్తును అక్కడికే పంపుతామని జీవీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అక్కడ అనుమతులు ఎలా ఇస్తారంటూ కొందరు ఫోన్లు చేసి ప్రశ్నిస్తున్నారని ఓ అధికారి పేర్కొన్నారు. 


ఇంతకు ముందే ఇచ్చారు

ఆక్రమణదారులు అక్కడ వేర్వేరు చోట్ల ఉన్నామని, ఒక్కచోట భూమి ఇవ్వాలని కోరితే 2017లో ఉన్నతాధికారులు వారికి అక్కడ కేటాయించారు. ఇటీవల అక్కడ మట్టి తవ్వుతున్నారని ఫిర్యాదు వస్తే స్వయంగా వెళ్లి పరిశీలించాం. వారి పత్రాలు చూసి, విస్తీర్ణానికి మించి మట్టి తవ్వకుండా సరిహద్దులు నిర్ణయించాం. దేవస్థానంలో ఇలా ఒకచోట అందరికీ భూమి ఇవ్వడం ఇదే తొలిసారి. 

- సూర్యకళ, ఈఓ, సింహాచలం దేవస్థానం


ఇవన్నీ నిబంధనల ఉల్లంఘనలే

*ఆక్రమణదారులకు ఒకేచోట 3వేల గజాలిచ్చి, దానికి చుట్టూ రహదారులు కేటాయించడం నిబంధనల ఉల్లంఘనే. 

*ఏదైనా భవనం నిర్మించాలంటే దానికి పక్కా రహదారి ఉండాలి. లీజుకు తీసుకున్న భూమిలో రోడ్డు చూపిస్తే భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వకూడదు. లీజు కాలం ముగిశాక పోర్టు ఆ స్థలాన్ని వెనక్కు తీసుకుంటే... ఆ భవనానికి రహదారి లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ భవనానికి అనుమతి ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.