సీఎం వద్దా వాయిదా దరువే

ABN , First Publish Date - 2022-01-07T08:57:26+05:30 IST

సీఎం వద్దా వాయిదా దరువే

సీఎం వద్దా వాయిదా దరువే

పీఆర్సీ కొలిక్కివస్తుందని ఆశపడ్డ ఉద్యోగులు

విసుగు రేపిన వరుస చర్చలు, సాగ..దీతలు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం గురువారం ప్రకటిస్తుందని ఎదురుచూసిన ఉద్యోగులకు మళ్లీ నిరాశే ఎదురైంది. వరుస చర్చలు, వాయిదాలతో ఇప్పటికే ఉద్యోగులు విసిగిపోయారు. ఎన్నో నెలలుగా అధికారులు పీఆర్సీ అంశాన్ని నాన్చుతుండడంతో సీఎం వద్ద అయినా పీటముడి వీడుతుందని ఉద్యోగ సంఘాలు విశ్వసించాయి. మరో రెండు, మూడు రోజుల్లో పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా అనడంతో సమావేశంలోని ఉద్యోగ నేతలంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ‘సీఎం పిలిపించినా మళ్లీ వాయిదానేనా?’ అంటూ ఉద్యోగ నేతలు పెదవి విరిశారు. వెరసి..ప్రభుత్వం మళ్లీ పిల్లిమొగ్గ వేసింది. సీఎం వద్ద గురువారం జరిగిన జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో గత టీడీపీ ప్రభుత్వం 10వ పీఆర్సీలో ఇచ్చిన ఫిట్‌మెంట్‌ అంశాన్ని పలువురు ఉద్యోగ సంఘా ల నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. గత ప్రభుత్వం 43 శాతం ఇచ్చిందని, గత 10 సంవత్సరాల క్రితమే 39 శాతం ఫిట్‌మెంట్‌ గత ప్రభుత్వాలు ఇచ్చాయని.. తెలంగాణ ప్రభుత్వం 11వ పీఆర్సీని 30 శాతంగా ప్రకటించిందని.. దానికి తగ్గకుండా ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ఈ సమావేశంలో కోరాయి. వాళ్ల ఆదాయం... మన ఆదాయం కంటే ఎక్కువ అని ఈ సందర్భంలో ముఖ్యమంత్రి అన్నారు. దీంతో ఉద్యోగులు భయపడుతున్నట్టే పీఆర్సీ 30 శాతం కన్నా తక్కువే ఇస్తారేమోననే అనుమానాలు బలపడుతున్నాయి. 


సీపీఎస్‌పై సీఎం మౌనం

సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ తదితర అంశాలు ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావించినా సీఎం స్పందించలేదని తెలిసింది. రాష్ట్రంలో 2 లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులు ఉన్నారు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్‌ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి సుమారు రెండున్న సంవత్సరాలు దాటింది. ఉద్యోగ సంఘాల నేతలతో జరిగిన జాయింట్‌స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినప్పుడు కూడా జగన్‌ స్పందించకపోవడం ఉద్యోగ నేతలను విస్మయానికి గురిచేసింది. కేవలం పీఆర్సీ ఫిట్‌మెంట్‌పైనే చర్చ జరిగింది. పోనీ, ఆ ఒక్క అంశమైనా సీఎం సమీక్షంలో కొలిక్కి వచ్చిందా అంటే అదీ లేదు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ ఎంత శాతం అనే పీటముడి వీడనే లేదు.


తేల్చిందేమిటి..?

ఉద్యోగ సంఘాలు 55శాతం ఫిట్‌మెంట్‌పై వాస్తవిక దృష్టితో ఆలోచించాలని, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొంచెం తగ్గాలని సీఎం సూచించినట్లు తెలిసింది. ఆర్థిక శాఖాధికారులు కూడా  ఫిట్‌మెంట్‌ 14.29పైనే ఉండకుండా కొంచెం  గణాంకాలను పెంచాలని ఆయన కోరినట్టు సమాచారం. ఆర్థికశాఖ అధికారులను పెంచమనడం.. ఉద్యోగ సంఘాలను తగ్గమనడం తప్పించి సమావేశంలో తేల్చింది ఏమిటో తెలియని పరిస్థితి! కనీసం తెలంగాణ ఇచ్చినదానికి తగ్గకుండా పీఆర్సీ ప్రకటించాలని పలు ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. రాష్ట్ర విభజన అనంతరం  తెలంగాణ రాష్ట్రం 10వ పీఆర్సీ 42 శాతం ఇస్తే, ఏపీలోని అప్పటి టీడీపీ ప్రభుత్వం 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ఇదే అంశాన్ని ఉద్యోగ సంఘాల నేతలు సీఎంతో జరిగిన సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. 

Updated Date - 2022-01-07T08:57:26+05:30 IST