కొడాలి కోతలతో దాగని కేసినో!

ABN , First Publish Date - 2022-01-23T09:05:23+05:30 IST

కొడాలి కోతలతో దాగని కేసినో!

కొడాలి కోతలతో దాగని కేసినో!

జంకు లేకుండా మంత్రి నాని బుకాయింపు

గుడివాడలో కేసినో జరిపామన్న ఏసెస్‌ సంస్థ

తమ ఫేస్‌బుక్‌ పేజీలో ఫొటోలతో సహా పోస్టులు

అయినా సవాల్‌ చేసి అడ్డంగా దొరికిన మంత్రి

వైరల్‌ కావడంతో శనివారం పోస్టులన్నీ డిలీట్‌


(విజయవాడ - ఆంధ్రజ్యోతి)

గుడివాడలో కేసినో నిర్వహించింది నూటికి నూరు శాతం వాస్తవం. ఈ కేసినోకు సాక్షాత్తు మంత్రి కొడాలి నాని కే కన్వెన్షన్‌ వేదికగా నిలవడం అంతకన్నా వాస్తవం. గుడివాడలో కేసినో నిర్వహించిన ఏసెస్‌ కేసినో సంస్థ తన ఫేస్‌బుక్‌ పేజీల్లో ఫొటోలతో సహా ఇదే విషయం పేర్కొంది. ఇన్ని ఆధారాలు నాని మాటలను తప్పని నిరూపిస్తుంటే మంత్రి మాత్రం తన అనుచరులతో.. ఎడ్ల పందేలు నిర్వహించుకుంటే కేసినో నిర్వహించారని దుష్ప్రచారం చేస్తారా అంటూ ప్రెస్‌మీట్లు పెట్టిస్తుండటంపై గుడివాడ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గుడివాడకు కేసినో సంస్కృతిని తీసుకురావడంతో ఒక్క ఆ ప్రాంతంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా మంత్రి కొడాలి నాని తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీంతో గుడివాడలో తన కన్వెన్షన్‌లో ఎలాంటి కేసినోలు నిర్వహించలేదని మంత్రి బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ గుడివాడలో కేసినో నిర్వహించినట్టు సాక్షాత్తు కేసినో సంస్థ తన ఫేస్‌బుక్‌ పేజీలో ఫొటోలతో సహా పోస్టులు పెట్టడంతో మంత్రి అడ్డంగా బుక్కయ్యారు. 


గుడివాడకు ముంబై కేసినో..

ముంబైకి చెందిన ఏసెస్‌ సంస్థ కేసినోలు ఏర్పాటు చేయడంలో పేరొందింది. ఈ సంస్థను ప్రేమల్‌ టోపీవాలా అనే వ్య క్తి నిర్వహిస్తున్నాడు. గుడివాడలో కేసినో నిర్వహించిన ప్రవీణ్‌ చికోటికి ప్రేమల్‌తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఏసెస్‌ సంస్థ సహకారంతో ప్రవీణ్‌ గుడివాడలో కే కన్వెన్షన్‌ వేదికగా కేసినో ఏర్పాటు చేశాడు. ప్రవీణ్‌ చికోటి.. కేసినో వేదికపై నుం చి మాట్లాడుతున్న ఫొటోలనూ ప్రేమల్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేయడం గమనార్హం. ఈ ఫొటోలన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఏసెస్‌ సంస్థ, ప్రేమల్‌ వాటిని తమ ఫేస్‌బుక్‌ పేజీల నుంచి శనివారం మధ్యాహ్నం తొలగించేశా రు. అయితే అప్పటికే అవి వైరల్‌ అయ్యాయి. కేసినో నిర్వహించిన జనవరి 14న ప్రవీణ్‌తోపాటు ప్రేమల్‌ కూడా గుడివాడలోనే ఉన్నారు. ఈ మేరకు ప్రేమల్‌ తన పోస్టులో తాను గుడివాడలో ఉన్నట్లు పేర్కొన్నారు. కేసినోతోపాటు అశ్లీల నృత్యాల నూ ప్రదర్శించారు. ఆ సమయంలో మహిళలపై కేసినో నిర్వాహకులు డబ్బులు చల్లుతూ చిందులు వేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయినా మంత్రి బుకాయింపునకు దిగడం ప్రజలను నివ్వెరపరుస్తోంది.


జూదాలపై ముందే ఆదేశాలు..

కే కన్వెన్షన్‌లో కేసినో నిర్వహించలేదని మంత్రి నాని పేర్కొంటున్నారు. అక్కడ ఎడ్ల పందేలు మాత్రమే నిర్వహించామని చెబుతున్నారు. అది నిజమే అనుకుందాం. కే కన్వెన్షన్‌కు ఓ వైపు గుడివాడ - పోలుకొండకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు ఉంటుంది. మరోవైపు కన్వెన్షన్‌ ప్రవేశమార్గం ఉండగా, దాని ఎదురుగా నాని సొంతంగా రోడ్డు వదులుకున్నారు. ఆ స్థలంతోపాటు దాని చుట్టుపక్కల స్థలాలన్నీ నాని, ఆయన బినామీలవే. కన్వెన్షన్‌ నిర్మించినప్పటినుంచి ఏటా సంక్రాంతికి నాని.. తన తమ్ముడు చిన్ని ఆధ్వర్యంలో ఇక్కడ ఎడ్ల పందేలు, కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తుంటారు. ఇవన్నీ కే కన్వెన్షన్‌ వేదికగా నాని, ఆయన అనుచరుల కనుసన్నల్లోనే నడుస్తుంటా యి. ఈసారి అదే విధంగా కన్వెన్షన్‌ చుట్టూ ఉన్న ప్రాంతంలో కోడి పందేల నిర్వహణకు భారీగా పందిళ్లు వేశారు. కన్వెన్షన్‌ను ఆనుకుని కేసినో కోసం భారీ ఎత్తున సెట్టింగ్‌లు వేసి ఏర్పాట్లు చేశారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం గతంలోలా కోడి పందేలు నిర్వహించే ప్రాంతంలో ఎక్కడా జూదాల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. కేవలం కేసినోలో మాత్రమే జూదాలు నిర్వహించారు. బయట అనుమతిస్తే లోపలకు ఎవ్వరూ రారన్న ఉద్దేశంతో ఈ విధంగా కట్టడి చేశారు.

Updated Date - 2022-01-23T09:05:23+05:30 IST