జెన్కో అమ్మకం దిశగా తొలి అడుగు

ABN , First Publish Date - 2022-01-23T08:26:42+05:30 IST

జెన్కో అమ్మకం దిశగా తొలి అడుగు

జెన్కో అమ్మకం దిశగా తొలి అడుగు

కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్కేంద్రం ప్రైవేటుపరం

ముందు లీజుకు... ఆ తర్వాత ఏం చేస్తారో?

నెల్లూరు ప్లాంట్‌ లీజుపై కేబినెట్‌ తీర్మానం

‘సమర్థత’ పేరిట అదానీకే సమర్పయామి!

ఆర్‌టీపీపీ, నార్ల తాతారావు ప్లాంట్లనూ

జెన్కో నుంచి లాగేసేందుకు గతంలో ప్రయత్నం

ముందు నుంచే హెచ్చరిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’ 

భగ్గుమంటున్న విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు

జెన్కో ప్లాంట్ల వద్దకు చేరుకుని నిరసనలు

ప్లాంటు లీజు, ఉద్యోగులకు రివర్స్‌ పీఆర్సీపై 

మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరిక


ఏపీ జెన్కో కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని ప్రైవేటుకు ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంటులోని రెండు థర్మల్‌ యూనిట్లనూ ‘సమర్థుల’కు 25 ఏళ్లపాటు ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ కింద (ఓఅండ్‌ ఎమ్‌) లీజుకు ఇవ్వాలని శుక్రవారంనాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. జెన్కోను అప్పుల్లోకి నెట్టి... ఆ తర్వాత పవర్‌ ప్లాంట్లను అమ్మేసే వ్యూహం రచించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడు అదే నిజమవుతోంది! 


అమరావతి, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): నష్టాల్లోకి నెట్టడం... కష్టాలు సృష్టించడం... ఆ తర్వాత అమ్మేయడం! ‘జెన్కో’పై సర్కారు ఈ వ్యూహాన్ని రచిస్తోందనే అనుమానాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. జెన్కో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల అమ్మకం దిశగా తొలి అడుగు పడుతోంది. అమ్మకాల నాటకంలో తొలి అంకం... లీజు రూపంలో మొదలవుతోంది. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ తంతును అదానీ గ్రూపు కోసమే నడిపిస్తున్నదన్న అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. కేబినెట్‌ తీర్మానంలో పేర్కొన్న ‘సమర్థులు’ అనే మాటకు అర్థం ఏమిటనే అంశం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నిజానికి, కృష్ణపట్నం పోర్టు ఇప్పటికే అదానీ గ్రూపు చేతుల్లో ఉంది. ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో అదానీకి బొగ్గు గనులు ఉన్నాయి. దీంతో సమర్థత పేరిట జెన్కో నిర్వహణలోని కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని (దామోదరం సంజీవయ్య ధర్మల్‌ విద్యుత్కేంద్రం) అదానీకి కట్టబెట్టనున్నారా అనే అనుమానాలు ఉద్యోగ వర్గాల్లో మొదలయ్యాయి. నష్టాల పేరిట కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్కేంద్రం బాధ్యతలు అదానీకి అప్పగిస్తే, భవిష్యత్తులో జెన్కో ఉనికికే ప్రమాదం ముంచుకు రావచ్చునని నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


తొలి నుంచీ ఇదే వరుస 

కృష్ణపట్నం ప్లాంటు అదానీ చేతికి వెళితే జెన్కోకు ఇక మిగిలేవి రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు (ఆర్‌టీపీపీ), విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (వీటీపీఎస్‌) మాత్రమే. వాస్తవానికి వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ జెన్కో థర్మల్‌ యూనిట్లను వదిలించుకోవాలనే చూస్తోంది. తొలుత రాయలసీమ థర్మల్‌ విద్యుత్కేంద్రాన్ని (ఆర్‌టీపీపీ) ప్రైవేటుకు తరలించే ప్రయత్నంచేశారు. దీనిపై ..ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచే వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్కేంద్రంపై గురిపెట్టినా.. ఉద్యోగుల వ్యతిరేకతతో అదీ ఫలించలేదు. తాజా, కృష్ణపట్నం విద్యుత్‌ ప్లాంటుపై పడ్డారని ఉద్యోగులు చెబుతున్నారు.   


ఎందుకిలా..?

థర్మల్‌ కేంద్రాలు వ్యయంతో కూడినవని ప్రభుత్వం వాదిస్తోంది. వాటిని నిర్వహించడం కంటే పవర్‌ ఎక్ఛ్సేంజీలో తక్కువ ధరకు కరెంటు పొందడమే మేలు అని చెబుతోంది. ఈ కారణమే చూపించి రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్కేంద్రాలను ఒకదశలో దాదాపు మూసివేసింది. అయితే, ఇది పైకి చెబుతున్న కారణం మాత్రమే. చెప్పకుండా లోపల మరో ఎజెండాతో ఇంధన శాఖ ముందుకు వెళుతున్నట్టు ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. కావాలనే నష్టాల్లోకి నెట్టి అంతిమంగా జెన్కో చేతిలోని థర్మల్‌ ప్లాంట్లను చంపేయడమే ఈచర్యల పరమార్థమని ఈ కథనాల్లో హెచ్చరించింది. అందుకే జాతీయ సంస్థలకు కట్టాల్సిన అప్పులను ఎగవేస్తూ జెన్కోను ‘దివాలా’ సంస్థగా చిత్రీకరించేందుకూ వెనుకాడటం లేదని పేర్కొంది. జెన్కో కృష్ణపట్నం లీజు నిర్ణయం నేపథ్యంలో ఉద్యోగులు ‘ఆంధ్రజ్యోతి’ కథనాలను గుర్తు చేసుకుంటున్నారు.


వదిలించుకునేందుకేనా..!

కృష్ణపట్నం విద్యుత్కేంద్రం కోసం కేంద్ర ఆర్థిక సంస్థలైన రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ (ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎ్‌ఫసీ) నుంచి దాదాపు రూ.16వేల కోట్ల మేర జెన్కో రుణాలు తెచ్చింది. ఈ అప్పులకు వడ్డీలు సకాలంలో చెల్లించకపోవడంతో, ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీలు జెన్కోను దివాలా సంస్థగా ప్రకటిస్తామంటూ నోటీసులు జారీ చేశాయి. ఈ నోటీసులు అందుకున్ననాటి నుంచి అప్పులు తీర్చడంపై కంటే, దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని వదిలించుకోవడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సంస్థ ఆస్తిని మదింపుజేసేందుకు సిద్ధమైంది. ఈ విద్యుత్కేంద్రంపై మొత్తం అప్పులు రూ.20 వేల కోట్లు ఉంటే...స్థిరాస్తి విలువ (యంత్రాలతో కలుపుకొని) రూ.17వేల కోట్లుగా నిర్ధారించినట్లుగా ఇంధన శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వమే ఇలా వరుసగా నష్టాలు వస్తున్నాయని చెబుతుంటే .. ప్రైవేటు సంస్థలు మాత్రం వాటిని భరించేందుకు ఎందుకు ముందుకు వస్తాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తీసుకుంటే నష్టపోతామనే ఆలోచనలతో బిడ్డింగ్‌లో ఎవరూ పాల్గొనడం లేదన్న సాకును చూపుతూ....ప్లాంటును ప్రైవేటు వ్యక్తులకు కారుచౌకగా లీజుకు ఇచ్చే యోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. 


ఏకపక్షం.. అంగీకరించం : విద్యుత్‌ జేఏసీ

సర్కారు నిర్ణయంపై విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఏపీ రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌ పి.చంద్రశేఖర్‌, కన్వీనర్‌ బి.సాయికృష్ణ ఆధ్వర్యంలో శనివారం కడపలో జరిగిన జిల్లా విద్యుత్‌ ఉద్యోగుల సదస్సు కృష్ణపట్నం ప్లాంటు లీజు వ్యవహారాన్ని ఖండించింది. ప్లాంట్ల ప్రైవేటీకరణను నిలిపివేయడంతో పాటుగా.. విద్యుత్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి డిసెంబరు 22న చర్చల్లో చేసుకున్న ఒప్పందం మేరకు తక్షణం పరిష్కరించాలని, లేదంటే ఏ క్షణమేనా మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. ఈ సదస్సులో ఏపీ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ, డిస్కం జేఏసీ నాయకులు పాల్గొని.. సర్కారు తీరును గర్హించారు. కృష్ణపట్నంపై ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నట్టు రాష్ట్ర పవర్‌ ఎంప్లాయీస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ సెక్రటరీ జనరల్‌ పి. ప్రతాపరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్లాంటును సమర్థులకు అప్పగించాలంటూ మంత్రివర్గం నిర్ణయించడంలోని అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. 


మొదలైన నిరసనలు.. 

సర్కారు నిర్ణయంపై విద్యుత్‌ ఉద్యోగులు ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. శనివారం నెల్లూరుజిల్లా నేలటూరులోని కృష్ణపట్నం ప్లాంటు ప్రధాన ముఖద్వారం వద్ద బైఠాయించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం ఆర్టీపీపీలోని మెయిన్‌ గేటు వద్ద విద్యుత్‌ జేఏసీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యోగులు నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కొన్నిగంటలపాటు ధర్నా చేపట్టారు. ఈ నిరసనల్లో ఆర్టీపీపీ జేఏసీ, యూనియన్‌ నాయకులు మహేశ్వరరెడ్డి, భానుమాధవరావు తదితరులు పాల్గొన్నారు.


ఇది సర్కారు లెక్క

పొరుగునే ఉన్న విద్యుదుత్పత్తి సంస్థల్లో కృష్ణపట్నం ప్లాంటుతో పోల్చితే తక్కువ ధరకే విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఈ కేంద్రంలో కిలో వాట్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రూ.3.14 ఖర్చవుతుంటే.. దాని పక్కనే ఉన్న మరో పవర్‌ ప్లాంట్‌లో కిలోవాట్‌ ఉత్పత్తి ఖర్చు కేవలం రూ.2.34 మాత్రమే. 


ఇదీ సంఘాల వాదన.. 

ఉత్పత్తి వ్యయం కిలోవాట్‌కు రూ.3.14 ఉన్నట్టు చెబుతున్న ప్రభుత్వ వాదన సరికాదు. కిలోవాట్‌కు వస్తున్న ఖర్చు రూ.2.99 మాత్రమే. స్థిరచార్జీలు రూ.1.50 నుంచి 1.65. ఈ రెండింటిని కలిపితే అవుతున్న వ్యయం రూ.349 మాత్రమే. పొరుగున ఉన్న ప్రైవేటు సంస్థల్లో యూనిట్‌కు వస్తున్న ఖర్చు రూ.2.34. వస్తే స్థిర చార్జీ రూ.2.01. అంటే కిలోవాట్‌కు అవి చేస్తున్న ఖర్చు రూ.4.35. దానితో పోల్చితే కృష్ణపట్నం విద్యుత్కేంద్రం వ్యయమే తక్కువ. ఇదీ సంఘాల వాదన.. 

ఉత్పత్తి వ్యయం కిలోవాట్‌కు రూ.3.14 ఉన్నట్టు చెబుతున్న ప్రభుత్వ వాదన సరికాదు. కిలోవాట్‌కు వస్తున్న ఖర్చు రూ.2.99 మాత్రమే. స్థిరచార్జీలు రూ.1.50 నుంచి 1.65. ఈ రెండింటిని కలిపితే అవుతున్న వ్యయం రూ.349 మాత్రమే. పొరుగున ఉన్న ప్రైవేటు సంస్థల్లో యూనిట్‌కు వస్తున్న ఖర్చు రూ.2.34. వస్తే స్థిర చార్జీ రూ.2.01. అంటే కిలోవాట్‌కు అవి చేస్తున్న ఖర్చు రూ.4.35. దానితో పోల్చితే కృష్ణపట్నం విద్యుత్కేంద్రం వ్యయమే తక్కువ. 


ఇదీ సంఘాల వాదన.. 

ఉత్పత్తి వ్యయం కిలోవాట్‌కు రూ.3.14 ఉన్నట్టు చెబుతున్న ప్రభుత్వ వాదన సరికాదు. కిలోవాట్‌కు వస్తున్న ఖర్చు రూ.2.99 మాత్రమే. స్థిరచార్జీలు రూ.1.50 నుంచి 1.65. ఈ రెండింటిని కలిపితే అవుతున్న వ్యయం రూ.349 మాత్రమే. పొరుగున ఉన్న ప్రైవేటు సంస్థల్లో యూనిట్‌కు వస్తున్న ఖర్చు రూ.2.34. వస్తే స్థిర చార్జీ రూ.2.01. అంటే కిలోవాట్‌కు అవి చేస్తున్న ఖర్చు రూ.4.35. దానితో పోల్చితే కృష్ణపట్నం విద్యుత్కేంద్రం వ్యయమే తక్కువ. 

Updated Date - 2022-01-23T08:26:42+05:30 IST