పథకమేదైనా ఆర్నెల్లు ఆగాల్సిందే!

ABN , First Publish Date - 2022-01-28T09:21:24+05:30 IST

పథకమేదైనా ఆర్నెల్లు ఆగాల్సిందే!

పథకమేదైనా ఆర్నెల్లు ఆగాల్సిందే!

వారంలోనే ఇస్తామని గతంలో ప్రకటన

ఇకపై ఏడాదిలో రెండు సార్లే మంజూరు?

వలంటీర్ల గ్రూపుల్లో జోరుగా ప్రచారం

ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డు, పెన్షన్‌, ఇళ్ల పట్టాలు..

ఏదైనా దరఖాస్తు చేసుకున్న వెంటనే దొరకవు 

కొంతైనా భారం తప్పించుకునేలా సర్కారు నిర్ణయం

మరి అలాంటప్పుడు సచివాలయ వ్యవస్థ ఎందుకో?!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఇప్పటి వరకు మీకు రేషన్‌ కార్డు లేదా? ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోలేదా?.. పోనీ ఆరోగ్యశ్రీ?.. లేదా.. కొత్తగా పెళ్లి చేసుకుని ఉమ్మడి కుంటుంబం నుంచి విడిపోయి వేరు కాపురం పెడుతున్నారా?.. మీ సమస్య ఏదైనా.. ప్రభుత్వ పథకం పొందాలంటే కనీసం ఆర్నెల్లు ఆగాల్సిందే!. మీరు పేదలైనప్పటికీ.. అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ.. అగచాట్లు తప్పవు మరి! పథకాల భారం తగ్గించుకునేందుకు వైసీపీ ప్రభుత్వం కొత్తగా అమలుచేయబోతున్న కొత్త విధానం ఇది!. ఇప్పటి వరకు అధికారికంగా దీనిపై ఉత్తర్వులేవీ విడుదల కాకున్నా.. ప్రభుత్వ ప్రకటనలు, వలంటీర్ల గ్రూపుల్లో జరుగుతున్న ప్రచారంతో సర్కారు నిర్ణయం ఇదేనని తెలుస్తోంది. ఇదే నిజమైతే కొత్త లబ్ధిదారులకు ప్రయోజనాలు ఆలస్యం చేయడమే కాకుండా, ప్రస్తుత లబ్ధిదారులనూ ఇబ్బంది పెట్టడం దీని వెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది. ఆరోగ్యశ్రీ, బియ్యం కార్డు, పెన్షన్‌, ఇళ్ల పట్టాలు ఏది కావాలన్నా ఇకపై నిర్దేశిత సమయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కొన్ని పోస్టర్ల ద్వారా ప్రచారం చేసుకుంటోంది. ‘డిసెంబరు 1 నుంచి మే 31 వరకు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి. మే 31 నాటికి దరఖాస్తు చేసుకుని అర్హత సాధించిన వారికి జూన్‌ నెలలో ఫలాలు అందుతాయి’ లేదా ‘జూన్‌ 1 నుంచి నవంబరు 30 వరకు పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి. నవంబరు 30 నాటికి దరఖాస్తు చేసుకుని అర్హత సాధించినవారికి డిసెంబరు నెలలో ఫలాలు అందుతాయి’ అంటూ మార్గదర్శకాలు సూచిస్తోంది.  ‘ఇకపై ఏడాదిలో రెండుసార్లు’ అనే పేరు పెట్టి, పేదలకు ఏదో మేలు చేయబోతున్నట్లు కలరింగ్‌ ఇస్తోంది కానీ..  అసలు విషయాన్ని గమనిస్తే కొత్త లబ్ధిదారులకు ఆరు నెలల నుంచి ఏడాది పాటు పథకాలకు కోత పెట్టడమే దీని ఉద్దేశం అని ఇట్టే అర్థమవుతుంది. 


పీకేస్తే అంతే సంగతులు

వైపీపీ ప్రభుత్వం వచ్చాక పలు దఫాల్లో రేషన్‌ కార్డులు, పెన్షన్లు తొలగించారు. ఇకపై ఒకసారి పీకేస్తే 6 నెలలు చేసేదేమీ ఉండదు.. ఆ మధ్యకాలంలో జరిగే నష్టం ప్రభుత్వానికి ఆదా అవుతుంది. ఇప్పటికే పెన్షన్లు కోల్పోయినవారు స్థానికంగా సచివాలయాల్లో సిబ్బందిపై ఒత్తిడి చేస్తున్నారు. ఆ సమస్య అలా ఉండగానే.. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ప్లాన్‌తో అందరూ ఆరు నెలలు ఆగకతప్పని పరిస్థితి తీసుకొచ్చారు.


మరి సచివాలయ వ్యవస్థ ఎందుకో?

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయాల వ్యవస్థలో భాగంగా ఉద్యోగులు, వలంటీర్లు మొత్తం కలిపి దాదాపు 4లక్షల మంది పనిచేస్తున్నారు. వీరితో ఆరోగ్యశ్రీ, రేషన్‌కార్డు, పెన్షన్లు అందించేందుకు మెరుపు వేగంతో సర్వే చేయించి వెంటనే కార్డులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆరు నెలల కాలం ఎందుకు తీసుకుంటుందనేది సందేహాస్పదంగా మారింది. అసలు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చిందే వేగంగా సత్వర సేవలందించడానికి అని చెప్పుకొన్న ప్రభుత్వం.. ఇప్పుడు అవే సేవలను అవకాశమున్నంతమేర జాప్యం చేయడాన్ని చూస్తుంటే.. పేదల సంక్షేమంపై పాలకుల చిత్తశుద్ది ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు!. ప్రభుత్వం అంత సమయం తీసుకునేలా అయితే లక్షల మంది ఉద్యోగులు, వలంటీర్లు ఎందుకనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

Updated Date - 2022-01-28T09:21:24+05:30 IST