సొంత మంత్రులతోనూ దాగుడుమూతలు!

Published: Fri, 28 Jan 2022 03:12:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సొంత మంత్రులతోనూ దాగుడుమూతలు!

ఆద్యంతం రహస్యం, హడావుడి, తప్పుల కుప్ప

సొంత మంత్రులతోనూ దాగుడుమూతలు

మంత్రులకు పంపిన నోట్‌లో ఉన్నది ఒకటి

జారీ చేసిన గెజిట్‌లో చేర్చింది మరొకటి

మధ్యలో సీఎం స్థాయిలో మార్పుచేర్పులు

జిల్లాల పేర్లు, కేంద్రాలు అటూ ఇటూ

తొలుత కృష్ణా, ఉభయ గోదావరి మాయం

వ్యతిరేకత వస్తుందని చివరిలో మార్పులు

నోటిఫికేషన్లలో ఏకంగా 107 తప్పులు

జిల్లాల లోగుట్టు!


‘అత్యంత శాస్త్రీయమైన పద్ధతిలో కొత్త జిల్లాల ఏర్పాటు’... ఇది సర్కారు వారి మాట! కానీ... ఇదంతా పెద్ద లోగుట్టు! మొత్తం రాష్ట్ర ప్రజానీకంపై ప్రభావం చూపించే ఈ ప్రక్రియలో ఆద్యంతం హడావుడి! ఎవరో తరుముతున్నట్లుగా ఉరుకులు పరుగులు! చివరికి... మంత్రివర్గానికి పంపిన నోట్‌ నుంచి ప్రాథమిక నోటిఫికేషన్ల దాకా... తప్పుల తడకలు! 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కొత్త జిల్లాలు! కొత్త సమీకరణలు! పరిపాలన, రాజకీయ, భౌగోళిక అంశాలపై తీవ్రమైన ప్రభావం చూపే అంశం! ఇలాంటి కీలకమైన ప్రక్రియను సర్కారు ‘అర్ధరాత్రి’ వేళ హడావుడి తంతుగా మార్చేసింది. జిల్లాల పేర్ల ప్రతిపాదన మొదలు.. అనుకూల మీడియాకు లీకులివ్వడం వరకు ప్రతి విషయంలోనూ ప్రభుత్వ పెద్దలు ‘రహస్య’ పంథా పాటించినట్లు స్పష్టమవుతోంది. అత్యంత శాస్త్రీయ పద్ధతిలో కొత్త జిల్లాల విభజన కసరత్తు జరిగిందని ప్రణాళిక శాఖ చెబుతున్నా.. అది గెజిట్‌ రూపంలోకి రావడానికి ముందే అనేకానేక మార్పులు, కుదుపులకు లోనైనట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాలపై రెవెన్యూ శాఖ అందించిన నివేదిక వేరు. 25వ తేదీ రాత్రి పొద్దు పోయాక మంత్రులకు ఆన్‌లైన్‌లో అందిన  కేబినెట్‌ నోట్‌ వేరు. అర్ధరాత్రి దాటాక ఒకదాని తర్వాత ఒకటిగా జారీ అయిన ప్రాథమిక నోటిఫికేషన్‌లు వేరు! ప్రతి దానిలోనూ మార్పులూ, చేర్పులు జరిగాయి.


కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలకు సంబంధించి మంత్రివర్గం ఆమోదం తీసుకున్న ఫైలుకు, గెజిట్‌ నోటిఫికేషన్లకు చాలా తేడా ఉన్న విషయం వెలుగుచూసింది. మంత్రివర్గం ఆమోదానికీ... గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలకూ మధ్య... ఉన్నతస్థాయిలో మళ్లీ మార్పులు, చేర్పులు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వెరసి... సర్కారు పెద్దలు సొంత మంత్రులతోనూ దాగుడు మూతలాడారు. కేబినెట్‌ ఆమోదించిన ఫైలులో తూర్పు గోదావరి జిల్లాకు కాకినాడ ప్రధాన కార్యాలయంగా ఉంటుందని ప్రతిపాదించారు. కానీ గెజిట్‌లో ఇది మారి పోయింది. కాకినాడ పేరుతోనే ప్రత్యేక జిల్లా ఏర్పాటయింది. రాజమహేంద్రవరం హెడ్‌క్వార్టర్‌గా తూర్పుగోదావరి జిల్లా ఉంటుందని పేర్కొన్నారు. ఇక... ఏలూరు కేంద్రంగానే పశ్చిమ గోదావరి జిల్లా ఉంటుందని నోట్‌లో తెలిపారు. గెజిట్‌కు వచ్చేసరికి ఏలూరు కేంద్రంగా అదే పేరుతో జిల్లా ఏర్పాటు చేసి... భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పాటు చేశారు. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు. ఇలాంటి మార్పు చేర్పులు చాలానే ఉన్నాయి.


అన్నీ మాయలే... 

24వ తేదీన ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చారు. అదే రోజు సాయంత్రానికే ప్రభుత్వం కొత్త జిల్లాల హడావుడి మొదలు పెట్టింది. 25వ తేదీ రాత్రి కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ఆన్‌లైన్‌లో మంత్రివర్గ ఆమోదం పొందింది. తమకు అనుకూలంగా ఉన్న ఓ మీడియాకు ఆ నోట్‌లో ప్రస్తావించిన జిల్లాల పేర్లను లీక్‌చేసింది. ఆ మీడియా వాటిని అచ్చుపొల్లుపోకుండా ప్రచురించింది. అయితే... ముఖ్యమంత్రి సొంత మీడియా మాత్రం చివరి నిమిషంలో జరిగిన మార్పులను కూడా కలిపి, గెజిట్‌ నోటిఫికేషన్‌లలోని సమాచారాన్ని యథాతథంగా ప్రచురించడం విశేషం. బుధవారం రాత్రి పొద్దుపోయాక సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆమోదం అనంతరం 26 జిల్లాల ఏర్పాటుపై గెజిట్‌ నోటిఫికేషన్లను అప్‌లోడ్‌చేశారు. ఆ తర్వాతే అసలు విషయం బయటిచ్చింది. గెజిట్‌ విడుదలకు ముందు మంత్రివర్గం ఆమోదించిన జిల్లాల పేర్లలో మార్పులు చేశారని తేటతెల్లమైంది.


అసలు ఇలా చేయవచ్చా.. ఇది నైతికమేనా? అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ‘’ప్రభుత్వం తలచుకుంటే మంత్రివర్గం ఆమోదించిన ఏ డాక్యుమెంటునైనా మార్చవచ్చు. ఆ తర్వాత మరోసారి ర్యాటిఫికేషన్‌ తీసుకోవచ్చు. కానీ అదేదో ముందే చేసుకుంటే పారదర్శకంగా ఉండేది’’ అని ఓ సీనియర్‌ అధికారి అభిప్రాయపడ్డారు. తమకు పంపిన ఫైలులోని సమాచారం తెల్లారేసరికి చాలామటుకు మారిపోయిందని మంత్రులకు కూడా బోధపడింది. దీనిపై ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌ కుమార్‌ను ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధాన ం ఇచ్చారు. ‘కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల పేర్లే లేకపోతే ఎలా?  అవి ఉండాలని చివరి నిమిషంలో నిర్ణయించారు. అందుకే కొన్ని మార్పులు జరిగాయి’ అని ఆయన గురువారం నాటి విలేకరుల సమావేశంలో తెలిపారు.


107 తప్పులు..

ఆగమేఘాలపై హడావుడిగా ఇచ్చిన జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనల గెజిట్‌ నోటిఫికేషన్లలో భారీగా తప్పులు దొర్లాయి. ఉరుకుల పరుగుల మీద పని చేయడంతో జరిగిన తప్పులను కూడా సరిదిద్దకుండానే వాటిని అప్‌లోడ్‌ చేసేశారు. మండలాలు, రెవెన్యూ డివిజన్ల పేర్లను సరిగా ప్రస్తావించలేదు. పేర్లను ఇష్టానుసారం పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఆ వెంటనే సీసీఎల్‌ఏ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. 107 దోషాలను సరిచేస్తూ సర్కారు మరో సవరణ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ప్రజల మనోభావాలు, ప్రాంతాల మధ్య సమతుల్యతను పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రణాళికా శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌తో సర్కారు చెప్పించింది. కానీ పారదర్శకత ఎందుకు పాటించలేదనేదే అసలు ప్రశ్న!

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.