ఇంకెన్ని సంఘాలను చీలుస్తారు?

ABN , First Publish Date - 2022-01-28T09:05:17+05:30 IST

ఇంకెన్ని సంఘాలను చీలుస్తారు?

ఇంకెన్ని సంఘాలను చీలుస్తారు?

సజ్జల తీరు సరికాదు.. ఉద్యోగులను అవమానించారు

మాకు జరిగిన అన్యాయాలకు ఆయనే సాక్షి

ఎన్నిసార్లు ఆయనతో మేం చర్చలు చేయలేదు?

అప్పుడు అపరిపక్వ నాయకుల్లా అనిపించలేదా?

జీతాలు ఆపడానికి ప్రభుత్వం కుట్రలు

జనవరి వేతనాలు ఆగితే మూల్యం తప్పదు

ట్రెజరీపై చర్యలు తీసుకుంటే న్యాయపోరు

పీఆర్సీ సాధన సమితి నేతల హెచ్చరిక


అమరావతి, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): అనాలోచితం, అపరిపక్వం.. అంటూ ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీఆర్సీ సాధన సమితి భగ్గుమంది. ‘‘మేం పరిపక్వ నేతలమో.. అపరిపక్వ నేతలమో మాతో చర్చలు చేసినప్పుడు తెలియదా?’’ అంటూ సమితి నేతలు విరుచుకుపడ్డారు. కొత్త పీఆర్సీతో వేతనాలకు కోతపడని మాటే నిజమైతే గతంలో ఫిట్‌మెంట్‌ కంటే ఎక్కువ ఇచ్చిన ఐఆర్‌ను డీఏల నుంచి రికవరీ చేయాలని జీవోల్లో ఎందుకు పేర్కొన్నారో పరిపక్వత కలిగిన మంత్రుల కమిటీ బదులు చెప్పాలని నిలదీశారు. ఉద్యోగులను, ఉద్యోగ సంఘాల నేతలను అవమానించడం సరికాదన్నారు. గురువారం అమరావతి సచివాలయం మూడో బ్లాక్‌లోని అప్స కార్యాలయం ఆవరణలో  జరిగిన పీఆర్సీ సాధన సమితి స్ట్రగుల్‌ కమిటీ సమావేశంలో సజ్జల వ్యాఖ్యల ప్రస్తావన రాగా నేతలు తీవ్రంగా స్పందించారు. ట్రెజరీ, పీఏవో, డీడీవోలపై బిల్లులు చేయాలంటూ ప్రభుత్వం ఒత్తిడి పెడుతున్న అంశంపైనా సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. జనవరి నెలకు పాత జీతాలను డీఏలతో కలిపి ఇవ్వాలని ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా డీడీవోలకు వినతిపత్రాలు ఇవ్వాలని భేటీ నిర్ణయించింది. దీనికోసం ఓ ప్రొఫార్మా కూడా రూపొందించారు. ‘‘ప్రాసెస్‌ కాకుండా జీతాల బిల్లులను ట్రెజరీ ఉద్యోగులు అడ్డుకోవడం క్రమశిక్షణారాహిత్యమే అవుతుంది’’ అన్న సజ్జల హెచ్చరిక ప్రస్తావనకు రాగా.. ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే లీగల్‌గానే ఎదుర్కోవాలని నేతలు నిర్ణయించారు. పీఆర్సీ, ఉద్యోగుల హక్కులపై రాజీపడబోమని తెగేసి చెప్పారు. అనంతరం మీడియాతో నేతలు మాట్లాడారు. 


ఎలా ఆపుతారో ఆపండి: వెంకట్రామిరెడ్డి

సజ్జల వ్యాఖ్యలపై సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి సూటిగా స్పందించారు. ‘‘మాతో కాకుండా వేరే ఉద్యోగ సంఘాలు ఎవరైనా వస్తే వారితో ప్రభుత్వం చర్చలు జరపొచ్చు. ఇబ్బందేమీ లేదు. వేరే సంఘాలతో చర్చించుకుని ఉద్యమాన్ని ఎలా ఆపుతారో ఆపండి. చర్చలకు రామని మేం బిగుసుకుని కూర్చోలేదు. చర్చలకు వెళ్లడానికి 3షరతులతో ఇచ్చిన లేఖపై మంత్రుల కమిటీ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు’’ అని అన్నారు. 


చలో విజయవాడతో సత్తా: బండి శ్రీనివాసరావు

ఫిబ్రవరి 3న చలో విజయవాడను విజయవంతం చేసి ఉద్యోగుల సత్తా చాటాలని ఏపీజేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు కోరారు. పాత జీతాలు.. జీవోల రద్దు.. పీఆర్సీ నివేదిక వెల్లడిపై పెట్టిన షరతులమీదే స్పందించని ప్రభుత్వం.. వేతనాలపై డిమాండ్లను నెరవేర్చుతుందనే నమ్మకం లేదన్నారు. 


ఏ పీఆర్సీయో స్పష్టత ఇవ్వాలి: సూర్యనారాయణ

కేంద్ర పీఆర్సీ.. అశుతోశ్‌మిశ్రా కమిషన్‌ నివేదిక... అధికారుల కమిటీ సిఫారసులు.. ఇలా ఏ పీఆర్సీని అమలు చేయాలనుకుంటుందో ప్రభుత్వం స్పష్టతకు వస్తే చర్చలకు తాము సిద్ధమవుతామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ‘‘ఉద్యోగులతో ప్రభుత్వం దోబూచులాడుతోంది. రెండున్నరేళ్లు నాలుగు స్తంభాలాట ఆడారు. కేంద్ర పీఆర్సీలో డీఏలు పెరిగినప్పడల్లా హెచ్‌ఆర్‌ఏ పెరుగుతుంది. కేంద్రం 104 రకాల అలవెన్సులు పీఆర్సీ కమిషన్‌ సిఫారసుల ప్రకారం ఇస్తోంది. కేంద్ర పీఆర్సీ ఆధారంగా హెచ్‌ఆర్‌ఏ ఇచ్చామనే ప్రభుత్వం..అవన్నీ ఇక్కడ ఇస్తుందా? మంత్రుల కమిటీ మీద గౌరవం ఉంది కాబట్టే.. దారినబోయే దానయ్యలను కాకుండా 9మంది స్టీరింగ్‌ కమిటీ సభ్యులను ఎంపిక చేసి పంపాం. ప్రభుత్వమే దారినబోయే దానయ్యలతో చర్చిస్తామంటోంది. మా స్టీరింగ్‌ కమిటీ సభ్యులు లిఖితపూర్వకంగా ఇచ్చిన వాటికి సమాధానం చెప్పకుండా చర్చలకు రావడంలేదని మాపై నిందలు వేస్తున్నారు’’ అని మండిపడ్డారు. 


డీడీవోలకు వెంకట్రామిరెడ్డి విజ్ఞాపన లేఖ 

పెండింగ్‌ డీఏలతో కూడిన పాత జీతాన్నే ఇవ్వాలంటూ విజ్ఞాపన లేఖను పంచాయతీరాజ్‌శాఖలోని డీడీవోలకు పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి గురువారం అందించారు. 


‘‘వేతనాల ప్రక్రియలో పాల్గొనాలని ట్రెజరీ ఉద్యోగులను ఒత్తిడి తెస్తున్న ప్రభుత్వం... ఉద్యోగులపై అంత ప్రేమ ఉంటే రూ. 1800 కోట్ల సప్లిమెంటరీ బిల్లులు ఎందుకు ప్రాసెస్‌ చేయడంలేదు? 2100 కోట్ల పీఎఫ్‌, ఏపీజేఎల్‌ఏ, జీపీఎఫ్‌ బిల్లులు ఎందుకు చెల్లించడం లేదు? జనవరి జీతాలు ఆపడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. జీతాలు ఆపితే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదు’’

- ఉద్యోగ నేతలు


మాపై ఉద్యోగులతో ఒత్తిడి తెస్తారా: బొప్పరాజు వెంకటేశ్వర్లు

పీఆర్సీ విషయంలో గందరగోళం ఉండబట్టే పాత జీతాలు ఇవ్వాలని సీఎ్‌సను కోరామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు వివరించారు. ‘‘ఉద్యమంలో ఉన్న ట్రెజరీ ఉద్యోగులు, పీఏవో ఉద్యోగులు, డీడీవోలపై చర్యలు తీసుకోవాలనుకోవడం మంచి పద్ధతి కాదు. జనవరి నెల పాత జీతాలనే ఇవ్వాలని ఉద్యోగులను ట్రెజరీ ఉద్యోగులకు లేఖలు ఇవ్వమంటున్నాం. ఈ పరిస్థితుల్లో ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నా రెచ్చగొట్టడమే అవుతుంది. జనవరి నెల జీతాలు ఇవ్వకుండా ఉండే కుట్ర చేస్తోంది. జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగులు ఇబ్బందిపడి ఎక్కువ రోజులు ఉద్యమంలో పాల్గొనలేరనే  ఉద్దేశంతో ఉంది’’ అని మండిపడ్డారు. చర్చలకు వెళ్లమని ఉద్యోగ నేతలపై ఒత్తిడి తేవాలని ఉద్యోగులను కోరుతున్న సజ్జల.. చర్చల కోసం తాము ఆయన చుట్టూ తిరిగిన విషయం మరిచిపోయారా అని నిలదీశారు. ‘‘మాకు జరిగిన ప్రతి అన్యాయానికి సజ్జల సాక్షి కాదా? ప్రతి అంశం పైనా సజ్జల మాతో చర్చించింది వాస్తవం కాదా? మధ్యంతర భృతిని వెనక్కు తీసుకునేలా పీఆర్సీ జీవోలు ఇచ్చింది వాస్తవంకాదా?  మేం  అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా .. మేం పరిపక్వంగా ప్రవర్తించడం లేదని సజ్జల ఎలా అంటారు?’’ అని ఆగ్రహించారు. పీఆర్సీ సాధన సమితి నేతలే కాకుండా ఎవరొచ్చినా చర్చలు జరుపుతామన్న సజ్జల వ్యాఖ్యలపై  బొప్పరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఇంకెన్ని సంఘాలను చీలుస్తారు?’’ అంటూ నిప్పులు చెరిగారు. 

Updated Date - 2022-01-28T09:05:17+05:30 IST