ఉద్యోగుల ఉడుంపట్టు

ABN , First Publish Date - 2022-01-28T09:11:47+05:30 IST

ఉద్యోగుల ఉడుంపట్టు

ఉద్యోగుల ఉడుంపట్టు

పీఆర్సీ జీవోల రద్దుకు డిమాండ్‌ 

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఉధృతం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

పీఆర్సీ జీవోలను రద్దు చేయాల్సిందేనంటూ ఉద్యోగులు ఉడుంపట్టు పట్టారు. పీఆర్సీ కార్యాచరణ సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం రాష్టవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద, ప్రముఖ పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద, ధర్నా చౌక్‌ల వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు కొనసాగాయి. పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ‘మాకొద్దీ పీఆర్సీ’ అంటూ నినదించారు. జనవరి నెలకు పాత వేతనాలనే కొనసాగించాలని కోరారు. విజయవాడలోని ధర్నా చౌక్‌ ప్రాంగణంలో ఏపీ ఎన్‌జీఓ పశ్చిమ కృష్ణా నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలను పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ నేత బండి శ్రీనివాసరావు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద రిలే దీక్షలను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.ఆర్‌. సూర్యనారాయణ ప్రారంభించారు. కర్నూలు ధర్నాచౌక్‌ వద్ద చేపట్టిన తొలిరోజు రిలే దీక్షలో ఏపీజేఏసీ సెక్రటరీ జనరల్‌ హృదయరాజు పాల్గొన్నారు. సచివాలయంలోని 3వ బ్లాక్‌ వద్దకు ఉద్యోగులందరూ చేరుకుని నిరసన తెలిపారు. సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో మొదటి బ్లాకు నుంచి మెయిన్‌ గేట్‌ వరకు నిరసన ర్యాలీ జరిపారు. 


సీఎం గారూ.. మమ్మల్ని ఏకం చేశారు

‘‘గతంలో ఉద్యోగ జేఏసీలకు విభిన్న అభిప్రాయాలు, అజెండాలు ఉండేవి. రెండేళ్లలో ఎప్పుడూ కలసి పని చేసిన సందర్భాలు లేవు.. ఇకపై ఎప్పటికీ కలవరు అనుకునే వాడిని. కానీ పీఆర్సీ, జీతాలు తగ్గింపు,  పెన్షనర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, కార్మికుల పట్ల మీరు(సీఎంను ఉద్దేశించి) వ్యవహరించిన తీరుతో అందరం కలసి ఐక్యంగా రోడ్డుపైకి వచ్చాం. సమస్యల సంగతి పక్కన బెడితే మాలో ఐక్యత తెచ్చింది మాత్రం మీరే... అందుకు మీకు కృతజ్ఞతలు..’’ అని సచివాలయం ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు జరిపిన నిరసన కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T09:11:47+05:30 IST