సమ్మెపై ‘జిల్లా’ సమ్మెట

ABN , First Publish Date - 2022-01-28T09:16:18+05:30 IST

సమ్మెపై ‘జిల్లా’ సమ్మెట

సమ్మెపై ‘జిల్లా’ సమ్మెట

ఉద్యమం నుంచి దృష్టి మళ్లించే వ్యూహమే!

కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగుల విభజన

కసరత్తు ప్రారంభించిన అధికారుల కమిటీ

సమ్మె మొదలయ్యే నాటికి ‘ఆప్షన్ల’ హడావుడి?

ఏ జిల్లా ఎంచుకోవాలనే టెన్షన్‌లో ఉద్యోగులు


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఒకవైపు ఉద్యోగులంతా పీఆర్సీ కోసం ఉద్యమిస్తున్నారు. మరోవైపు... రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగులను విభజించే ప్రక్రియను అధికారికంగా మొదలుపెట్టింది. సర్కారు ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ జిల్లాల వారీగా ఉద్యోగుల విభజనపై కసరత్తు చేస్తోంది. ఎవరు ఏ జిల్లాకు వెళ్లాలి? ఎవరిని ఎక్కడ సర్దుబాటు చేయాలి? అనే అంశాలపై సంప్రదింపులు ప్రారంభించింది. కొత్త జిల్లాల్లో ఆకస్మిక కదలిక వెనుక ఉద్యోగుల దృష్టిని ఉద్యమం నుంచి మళ్లించే వ్యూహముందని ‘ఆంధ్రజ్యోతి’ ఇది వరకే చెప్పింది. ఇప్పుడు అదే నిజమవుతోంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉద్యోగుల విభజనపై ప్రభుత్వ కమిటీ కసరత్తు చేస్తోందని ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ గురువారం అధికారికంగా చెప్పారు. అంటే, జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఉద్యోగుల విభజనతోనే మొదలవుతుందన్న మాట! ఇదే అంశంపై గురువారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఉద్యోగుల విభజన, సర్దుబాటు వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఫిబ్రవరి 7వ తేదీన సమ్మె మొదలుకావడానికి  రెండు మూడు రోజుల ముందు నుంచే ఉద్యోగుల విభజన అంశం మొదలవుతుంది. ప్రస్తుతానికి జిల్లాల ఏర్పాటు కార్యక్రమాల్లో పాల్గొంటామని, సమ్మె మొదలయ్యాక దూరంగా ఉంటామని ఉద్యోగ సంఘ నేతలు ప్రకటించారు. కానీ, ఈ మాత్రం వెసులుబాటు కూడా ఇవ్వనంతగా ప్రభుత్వ కార్యాచరణ ఉండొచ్చని సీనియర్‌ అధికారులు అంచనా వేస్తున్నారు. ‘‘జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన ఎలా ఉండాలన్న దానిపై ఇదివరకే మానవ వనరుల కమిటీ చర్చించి నివేదిక ఇచ్చింది. ఇప్పుడు కొత్త జిల్లాల నోటిఫికేషన్‌లు విడుద లైన నేపథ్యంలో ఆ నివేదిక ఆధారంగా విభజనపై జిల్లాల వారీగా సబ్‌కమిటీలు  ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఎవరు ఎక్కడ పని చేయాలి? ఎవరు ఎక్కడ కొనసాగుతారు? అనే అంశంపై ఆ కమిటీ ఉద్యోగులతో మాట్లాడాల్సి ఉంటుంది. ఇది వారం పక్షం రోజుల్లో అయ్యే పనికాదు. సమ్మె చేస్తూ ఇటు స్థానికత కేటాయింపుపై దృష్టి పెట్టడం కష్టం. ఉద్యోగులు సహజంగానే సమ్మెకన్నా... సర్వీసు  అంశంపై ఎక్కువ దృష్టిపెడతారు’’ అని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఒకరు చెప్పారు.


‘ఎన్నికల హామీ ప్రకారం జిల్లాల సంఖ్య పెంచుతున్నాం. పరిపాలనా సౌలభ్యంకోసమే ఈ నిర్ణయం’... అని సర్కారు  ప్రకటించింది! మంచిదే! కానీ... ఈ ప్రక్రియ చేపట్టిన ‘టైమింగ్‌’పైనే అందరిలోనూ అనుమానాలు! కొత్త జిల్లాలపై ఈనెల 25వ తేదీ రాత్రికి రాత్రి ఆన్‌లైన్‌లో కేబినెట్‌ ఆమోదం తీసుకున్నారు. అర్ధరాత్రి దాటాక తెల్లవారుజాము వరకు ప్రాథమిక నోటిఫికేషన్లు జారీ చేశారు. అదికూడా... ఉద్యోగులు సమ్మె నోటీసు ఇచ్చిన రోజునే ఈ ప్రక్రియ మొదలుపెట్టారు. దీని వెనుక పీఆర్సీ ఉద్యమం నుంచి ఉద్యోగుల దృష్టి మళ్లించే వ్యూహం ఉందని అందరిలోనూ అనుమానం వ్యక్తమవుతోంది.

Updated Date - 2022-01-28T09:16:18+05:30 IST