అర్ధరాత్రి వేళ కొత్త జిల్లాలా?

ABN , First Publish Date - 2022-01-28T09:48:09+05:30 IST

అర్ధరాత్రి వేళ కొత్త జిల్లాలా?

అర్ధరాత్రి వేళ కొత్త జిల్లాలా?

కేబినెట్‌లో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారు? : రఘురామ 


న్యూఢిల్లీ, జనవరి 27(ఆంధ్రజ్యోతి): పరిపాలన వికేంద్రీకరణ పేరుతో కొత్త జిల్లాల ఏర్పాటుకు అర్ధరాత్రి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సబబని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. కనీసం కేబినెట్‌లో ఎలాంటి చర్చ లేకుండానే అర్ధాంతరంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకటన ఎలా చేస్తారని నిలదీశారు. ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రాంతాలు, కులాల మద్య చిచ్చు పెట్టకుండా శాస్ర్తీయ పద్ధతుల్లో, ప్రజామోదంతో జిల్లాలను ఏర్పాటు చేయాలని సూచించారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి బుద్ధి ఉండే తిరుపతి జిల్లాకు బాలాజీ అని పేరు పెట్టారా అని ధ్వజమెత్తారు. ఉత్తర భారతంలో బాలాజీ అంటే ఆంజనేయస్వామిగా పరిగణిస్తారన్నారు. బాలాజీ ఆంధ్రుల సంస్కృతి కాదని, తిరుపతి జిల్లాకు శ్రీ వేంకటేశ్వర జిల్లాగా నామకరణం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సీఎంకు సరైన సలహా ఇవ్వాల్సిన బాధ్యత టీటీడీ ఈవోపై ఉందన్నారు. కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టడం శుభపరిణామమే అన్నారు. అన్నమయ్య జిల్లా పేరును రాజంపేటలో పరిధికి వర్తింపజేస్తే బాగుంటుందన్నారు. 26జిల్లాల కేంద్రాల్లో పరిపాలనా భవనాల ఏర్పాటుకు నిధులు ఎక్కడినుంచి తెస్తారని రఘురామ ప్రశ్నించారు. నాయకులు దండుకోవడానికి తప్ప, కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియతో ఇప్పట్లో ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఉద్యోగులు ఫిట్‌మెంట్‌ అడిగితే ప్రభుత్వం వారికి సెటిల్‌మెంట్‌ చేస్తోందని రఘురామ విమర్శించారు. ఉద్యోగులు అశుతోశ్‌ మిశ్రా నివేదిక అడిగితే, ప్రభుత్వం సజ్జల నివేదిక ఇవ్వడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదన్నారు. సీఎం జగన్‌ రాజ్యాంగాన్ని చదువుకోవాలన్నారు.  

Updated Date - 2022-01-28T09:48:09+05:30 IST