సభలో ‘తీర్పు’!?

ABN , First Publish Date - 2022-03-06T08:35:41+05:30 IST

సభలో ‘తీర్పు’!?

సభలో ‘తీర్పు’!?

శాసనాధికారం లేదనడంపై అభ్యంతరం

హైకోర్టు తీర్పుపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం

జగన్‌కు లేఖ రాసిన ధర్మాన ప్రసాదరావు 

అంతకుముందే సలహాదారు సజ్జల ప్రకటన

సభా హక్కులపై చర్చిస్తామన్న చీఫ్‌ విప్‌

సుప్రీంలో అప్పీలుపై సర్కారు కసరత్తు

మంత్రులతో సీఎం వరుస సమీక్షలు


అమరావతి/శ్రీకాకుళం, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): అనుకున్నదే జరుగుతోంది! రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన మూడొందల పేజీల తీర్పులోని అనేక కీలకాంశాలను  పక్కనపెట్టి... ‘రాజధానిని మార్చే శాసనాధికారం రాష్ట్రానికి లేదు’ అనే ఒక్క అంశంపైనే అసెంబ్లీ వేదికపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా... అడుగులు కూడా పడ్డాయి. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మొదలుకానున్నాయి. కానీ... హైకోర్టు తీర్పుపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాలంటూ సీనియర్‌ నాయకుడు, శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు శనివారం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ‘‘అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. కానీ, రాజధానిని మార్చే, విభజించే అధికారం శాసనసభకు లేదన్న వ్యాఖ్య నన్ను తీవ్రంగా ఆలోచింపజేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధులను.. శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పరిధులను రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర భద్రత, అభివృద్ధికి అవసరమైన చట్టాలను రూపొందించడం రాజ్యాంగం ద్వారా రాష్ట్ర శాసనసభకు సంక్రమించిన హక్కు. ఈ హక్కును కాదనడం రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధమని నేను భావిస్తున్నాను. ఇప్పుడు శాసనసభ అధికారాల్లో, బాధ్యతల నిర్వహణలో న్యాయవ్యవస్థ జో క్యం చేసుకుందని ఎవరికైనా స్ఫురించకమానదు. ఈ 3 విభాగాల మధ్య రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాల్సిన సంబంధాలపై అసెంబ్లీలో చర్చించేందుకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి’’ అని ధర్మాన సీఎంని కోరారు. 


ముందే చెప్పిన సజ్జల

‘పార్లమెంటు చేసిన రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. నవ్యాంధ్రకు ఒకే రాజధాని ఉండాలి. అది అమరావతే. దీనిని మార్చే శాసనాధికారం రాష్ట్రానికి లేదు’ అని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై సుదీర్ఘ వివరణే ఇచ్చింది. కానీ.. ‘అసెంబ్లీకి శాసనాలు చేసే అధికారం లేదంటారా?’ అని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారు. త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ ఉంటుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారమే చెప్పా రు. ఇప్పుడు దీనిపై ‘ప్రత్యేకంగా సభను సమావేశ పరచాలి’ అని ధర్మాన ప్రసాదరావు కోరారు. ఈ నేపథ్యం లో.. బడ్జెట్‌ సమావేశాల్లోనే ఈ అంశంపై చర్చ జరగ డం ఖాయంగా కనిపిస్తోంది. శాసన వ్యవస్థ అధికారా ల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవడం సరికాదని సీఎం కూడా భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇక.. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, అడ్వకేట్‌ జనరల్‌తో రోజూ భేటీ అవుతున్నారు.  


అసెంబ్లీ హక్కులపై చర్చిస్తాం: చీఫ్‌ విప్‌

శాసనసభకు ఉన్న హక్కులపై బడ్జెట్‌ సమావేశాల్లో చర్చిస్తామని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి చెప్పారు. శనివారం సభాపతి తమ్మినేని సీతారాం, శా సనమండలి చైర్మన్‌ మోసేన్‌రాజు, అన్ని శాఖల అధికారులతో సభా వ్యవహారాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజాసమస్యలే ప్రాధాన్యంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. టీడీపీలా కాకుండా తాము ప్రతిపక్షాన్ని గౌరవిస్తామన్నారు. వివేకా హత్యపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Updated Date - 2022-03-06T08:35:41+05:30 IST