
40 వసంతాల తెలుగుదేశం
ఆవిర్భావమే సంచలనం.. ఆత్మగౌరవమే నినాదం
పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం కైవసం
1984-89లో పార్లమెంటులో ప్రధాన విపక్షం
నేషనల్ ఫ్రంట్‌లో ఎన్టీఆర్ కీలక భూమిక
89లో ఓడినా ఐదేళ్లకే ఘనవిజయం
లక్ష్మీపార్వతి తీరుతో సంక్షోభం
ఎన్టీఆర్‌పై నాడు ఎమ్మెల్యేల తిరుగుబాటు
చంద్రబాబు సారథ్యంలో సర్కారు
మూడో ఫ్రంట్‌లో బాబు ప్రముఖ పాత్ర
ఎన్డీఏ కన్వీనర్‌గా కీలక భూమిక
తెలంగాణ ఉద్యమంతో బలహీనం
నవ్యాంధ్రలో 2014లో గెలుపు
2019లో కనీవినీ ఎరుగని ఓటమి
యువనాయకత్వాన్ని ప్రోత్సహిస్తాం
‘నేను.. తెలుగుదేశం’ పుస్తకావిష్కరణలో బాబు
పుట్టుకే ఓ సంచలనం.. కళ్లు తెరచిన తొమ్మిది నెలలకే రాష్ట్రాధికారం.. తెలుగునాట రాజకీయ చైతన్య కరదీపిక.. వెనుకబడిన వర్గాలకు ఆలంబన.. ప్రగతిశీల రాజకీయాలకు దర్పణం.. అభివృద్ధే ఎజెండాగా నాలుగు దశాబ్దాల రాజకీయ ప్రయాణం పూర్తిచేసుకున్న తెలుగుదేశం పార్టీ మంగళవారం 41వ వసంతంలో అడుగుపెడుతోంది. కాల ప్రవాహంలో ఎన్నో ఆటుపోట్లు, ఒడిదొడుకులు, ఒత్తిళ్లను ఎదుర్కొన్న ఈ పార్టీ.. ఉమ్మడి రాష్ట్రం రెండుగా చీలిన తర్వాత తెలంగాణలో కుంగి.. నవ్యాంధ్రలో నిలదొక్కుకొంది. 40 ఏళ్లలో పరాజయాలు ఎదురైనా తట్టుకుంది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నలభై ఏళ్ల కింద ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో ఒక చారిత్రక అవసరంగా గుర్తింపు పొందింది. అప్పటికి (ఉమ్మడి) ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ తప్ప మరో బలమైన పార్టీ లేదు. కమ్యూనిస్టు పార్టీ చీలిపోయి బలహీనపడిన తర్వాత రెండు దశాబ్దాలపాటు కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పాలించింది. మదరాసీలుగా తప్ప జాతీయ స్థాయిలో తెలుగువారికి ప్రత్యేక గుర్తింపే లేకపోవడం.. పదేపదే ముఖ్యమంత్రులను మారుస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ఇక్కడి నేతలను హీనంగా చూస్తోందన్న అభిప్రాయాల నేపథ్యంలో అప్పటి ప్రముఖ సినీ హీరో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రె్‌సను ఢీకొన్నారు.
కాంగ్రెస్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టి.. పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే విజయపతాకం ఎగురవేసి అధికారం చేపట్టారు. ఆ సమయంలో మూడు ముఖ్యమైన రాజకీయ మార్పులను టీడీపీ తీసుకొచ్చింది. ఎన్టీఆర్ చైతన్య రథమెక్కి నేరుగా జనబాహుళ్యంలోకి వెళ్లి.. రాజకీయాలను సామాన్యులకు చేరువచేసి రాజకీయ చైతన్యం కలిగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయంలో.. బాగా చదువుకున్న యువతకు, అప్పటిదాకా రాజకీయ అవకాశాలు అందని వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం ఇచ్చి.. చట్టసభల్లో సామాన్య సామాజిక వర్గాలు అడుగుపెట్టడానికి దోహదం చేశారు. పేదల సంక్షేమానికి, వారి అభ్యన్నతికి పెద్దపీట వేసే పథకాలకు రూపకల్పన చేసి అప్పటివరకూ కేవలం ఇందిరకు మాత్రమే పరిమితమైన పేదల పక్షపాతి ముద్రను ఎన్టీఆర్ తాను కైవసం చేసుకున్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాల పంపిణీతో చరిత్రకెక్కారు. కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా ఎన్టీఆర్ తన హయాంలో అనేక పాలనా సంస్కరణలు తెచ్చారు. మండల వ్యవస్థకు రూపకల్పన చేసి పాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం తెలంగాణలో పెత్తందారీ వ్యవస్థ కుప్పకూలడానికి.. భూమి రికార్డులు ప్రజలకు అందుబాటులోకి రావడానికి దోహదపడింది. సహకార సంఘాలను ప్రక్షాళన చేసి సింగిల్ విండో వ్యవస్థను తీర్చిదిద్దారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటిసారి బీసీ వర్గాలకు, మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించారు. మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు కల్పించారు. ఇంట్లో ఉండి చదువుకునే వెసులుబాటు కల్పించే దూర విద్య విశ్వవిద్యాలయం, మహిళలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం, పేద వర్గాల పిల్లలకు గురుకుల పాఠశాలల వంటివి నెలకొల్పారు. అనంతర కాలంలో వీటిలో కొన్ని నిర్ణయాలను కేంద్రప్రభుత్వాలు అందిపుచ్చుకుని.. జాతీయ స్థాయిలో అమలు చేశాయి. హైదరాబాద్ నగరాన్ని దీర్ఘకాలం కుదిపివేసిన మత కల్లోలాలను ఎన్టీఆర్ ఉక్కుపాదంతో అణచివేసి శాంతిని నెలకొల్పారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి ఉన్న మిగులు జలాల వాటా ఆధారంగా రాయలసీమలో తెలుగుగంగ సహా పలు సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి ఆ ప్రాంతానికి మొదటిసారి సాగునీటి వసతి కల్పనకు దారులు తెరిచారు.
ఎన్నెన్నో ఆటుపోట్లు..
టీడీపీ 4 దశాబ్దాల ప్రయాణంలో అనేక ఆటుపోట్లు, కుదుపులు ఎదుర్కొంది. తొలిసారి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే నాదెండ్ల భాస్కరరావు టీడీపీని చీల్చి కాంగ్రెస్ మద్దతుతో గద్దెనెక్కారు. కానీ రాష్ట్రంలో తీవ్రమైన ప్రజా ఉద్యమం రావడం.. ప్రతిపక్షాలన్నీ మద్దతివ్వడంతో నెల రోజుల్లోనే ప్రధాని ఇందిరాగాంధీ దిగివచ్చి మళ్ళీ ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారు. వంగవీటి రంగా హత్య, తదితర పరిణామాల్లో 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఘనవిజయం సాధించి ఎన్టీఆర్ సీఎం అయ్యారు. అయితే ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం ఆ పార్టీలో తీవ్ర సంక్షోభానికి దారి తీసింది. ఎన్టీఆర్‌ను దేవుడిలా భావించే టీడీపీ ఎమ్మెల్యేల్లో అత్యధికులు లక్ష్మీ పార్వతి పెత్తనాన్ని నిరసిస్తూ బయటకు వచ్చి చంద్రబాబును తమ నేతగా ఎన్నుకున్నారు. దాంతో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్ మరణానంతరం చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఏకీకృతమై బలంగా నిలబడింది.
చంద్రబాబు హయాంలో..
ఎన్టీఆర్ తర్వాత టీడీపీ తరఫున అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులెత్తించారు. బెంగుళూరు తప్ప దేశంలో మరే నగరం ఐటీ చిత్రపటంలో లేని స్థితిలో ఆయన ముందు చూపుతో రాష్ట్రానికి ఆ కంపెనీలను పెద్ద ఎత్తున ఆకర్షించి హైదరాబాద్‌ను ఐటీ రాజధానిగా తీర్చిదిద్దారు. ప్రధాని అయిన కొత్తలో అమెరికా పర్యటనకు వెళ్లిన మన్మోహన్ సింగ్ తమ దేశంలో కూడా అమెరికా నగరాలకు దీటుగా నిలిచే హైదరాబాద్ వంటి నగరాలు ఉన్నాయని గర్వంగా చెప్పారు.
ఆ ఘనత చంద్రబాబుదేనని రాజకీయ పార్టీలన్నీ అంగీకరిస్తాయి. ఉపాధి అవకాశాలు విస్తరించడానికి వీలుగా చంద్రబాబు సీఎంగా విద్యావకాశాలను బాగా విస్తరించారు. కొత్తగా ఇంజనీరింగ్, మెడికల్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ వంటి వృత్తివిద్యా కోర్సుల కళాశాలలను రాష్ట్రం నలుమూలలా వందల సంఖ్యలో వచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో పలుచోట్ల బలంగా పాతుకుపోయిన నక్సలిజాన్ని గణనీయంగా తగ్గించిన ఘనత కూడా టీడీపీదే. దానివల్ల ఉత్తర తెలంగాణ, పల్నాడు, ఏజెన్సీ ప్రాంతాలు అభివృద్ధిపథంలోకి రాగలిగాయి. రాయలసీమలో పాతుకుపోయిన ఫ్యాక్షనిజాన్ని కూడా చంద్రబాబు బాగా తగ్గించగలిగారు.
ఆయన హయాంలో సాధించుకున్న అభివృద్ధి ముద్ర.. రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్ర ప్రజలు టీడీపీకి మరోసారి అవకాశం ఇవ్వడానికి దోహదపడింది. రాజధానిగా అమరావతిని ఎంపిక చేసి నిర్మాణం చేపట్టడం, దానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడం, పోలవరం నిర్మాణాన్ని పరుగులెత్తించడం, కియా కార్ల ఫ్యాక్టరీ వంటి పారిశ్రామిక పెట్టుబడులను రాష్ట్రానికి సాధించడం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయడం, రాష్ట్రంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచడం వంటి వాటిలో ఆయన కొంతమేర విజయవంతమయ్యారు. ఎన్టీఆర్ హయాంలో సంక్షేమ ముద్ర తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబు హయాంలో అభివృద్ధి ముద్ర సాధించింది.
తెలంగాణ ఉద్యమ దెబ్బ..
టీడీపీకి అతి పెద్ద సవాలు తెలంగాణ ఉద్యమ రూపంలో వచ్చింది. చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీని ఆంధ్రా పార్టీగా తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ముద్ర వేయడం... దానిని టీడీపీ బలంగా ఎదుర్కోలేకపోవడం ఆ పార్టీని బలహీనపరచింది. సమైక్యవాద పార్టీగా ఉన్న తెలుగుదేశం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించినా తెలంగాణలో ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆ పార్టీ నామమాత్రంగానే మిగిలింది.
నవ్యాంధ్రలో తొలి ఓటమి..
నవ్యాంధ్రలో 2014లో విజయం సాధించిన టీడీపీ.. 2019లో ఆ జోరు కొనసాగించలేకపోయింది. కనీవినీ ఎరుగని రీతిలో పరాజయం చవిచూసింది. అయినా తన పట్టు నిలుపుకొని బలమైన రాజకీయ పక్షంగా కొనసాగుతోంది.
జాతీయ పాత్ర..
ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ టీడీపీ జాతీయ స్థాయిలోనూ తనదైన ముద్రవేసింది. అనేక జాతీయ పార్టీలు ఉన్నా 1984-89 మధ్య కాలంలో లోక్‌సభలో వాటన్నింటికంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోవడం ద్వారా ప్రధాన ప్రతిపక్షంగా నిలబడింది. దేశంలో మరే ప్రాంతీయ పార్టీకి ఇటువంటి అవకాశం రాలేదు. జాతీయ స్థాయిలో కుడిఎడమలుగా ఉన్న పార్టీలను కూడా ఏకతాటిపైకి తెచ్చి ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్‌కు రూపుదిద్దారు. ఆ కూటమి 1989లో కాంగ్రె స్ను ఓడించి కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు కూడా జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. 1996లో ప్రాంతీయ పార్టీలను, వామపక్షాలను కూడగట్టి జాతీయ స్థాయిలో మూడో ప్రత్యామ్నాయం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కృషిచేశారు. దానికి కాంగ్రెస్ మద్దతివ్వక తప్పని పరిస్థితులు కల్పించారు. అయితే జనతాదళ్‌లో లుకలుకలతో మూడో ఫ్రంట్ ముక్కలైంది. దరిమిలా 1998, 99ల్లో కాంగ్రె్‌సకు వ్యతిరేకంగా ఆయన కేంద్రంలో బీజేపీకి మద్దతిచ్చారు. వాజపేయి ప్రధానిగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి దోహదపడ్డారు. ఎన్డీఏకి కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు జాతీయంగా.. అంతర్జాతీయంగా ఒక వెలుగు వెలిగారు.
చైతన్య రథం.. కేరాఫ్ నాచారం రామకృష్ణ స్టూడియో
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చైతన్యాన్ని నింపి.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారం సాధించి.. రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన ఎన్టీఆర్ ప్రచారంలో కీలకపాత్ర ఆయన వాహనమైన చైతన్య రథానిదే. షెవర్లే కంపెనీకి చెందిన ఆ 1940 మోడల్ వాహనం గురించి అప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియదు. ఎంతో ఆకర్షణీయంగా విశాలంగా సకల వసతులతో ఉండే ఆ వాహనం నిజానికి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ది.
అప్పటికి చాలాకాలంగా ఆయన ఆ వాహనాన్ని వాడుతుండేవారు. 1982లో టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్.. ప్రచారం కోసం ఆ వాహనాన్ని ఎంజీఆర్ నుంచి కొనుగోలు చేసి అందులో తనకు కావాల్సిన విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయించుకున్నారు. కూర్చునేందుకు ఎత్తైన సీటు, సమావేశమయ్యేందుకు పొడవైన సోఫా, టాయిలెట్, వాహనం లోపలి నుంచే పైకి ఎక్కేందుకు మెట్లు ఆ వాహనంలో ఉంటాయి. అలా లోపలి నుంచే వాహనంపైకి ఎక్కి వేలాది బహిరంగ సభల్లో ఎన్టీఆర్ ప్రసంగించారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చైతన్య రథాన్ని ఆయన ఇంటి ముందే పార్కు చేసి ఉంచారు. ఎన్జీఆర్ చనిపోయాక నాచారంలోని రామకృష్ణ స్టూడియోకు తరలించారు. ఇప్పటికీ ఆ వాహనం అక్కడే ఉంది.