‘బీచ్ శాండ్ తవ్వకాలపై నిషేధం తొలగించే ప్రతిపాదన’

ABN , First Publish Date - 2022-08-01T22:39:40+05:30 IST

బీచ్ శాండ్‌తో సహా మరికొన్ని అణు ఖనిజాల తవ్వకాలపై నిషేధం తొలగించే ప్రతిపాదనపై ప్రభుత్వం అందరి సలహాలు, సూచనలు కోరినట్లు గనుల శాఖ మంత్రి ప్రల్హాద్‌ జోషి సోమవారం రాజ్యసభకు తెలిపారు.

‘బీచ్ శాండ్ తవ్వకాలపై నిషేధం తొలగించే ప్రతిపాదన’

ఢిల్లీ: బీచ్ శాండ్‌తో సహా మరికొన్ని అణు ఖనిజాల తవ్వకాలపై నిషేధం తొలగించే ప్రతిపాదనపై ప్రభుత్వం అందరి సలహాలు, సూచనలు కోరినట్లు గనుల శాఖ మంత్రి ప్రల్హాద్‌ జోషి సోమవారం రాజ్యసభకు తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధి చట్టం మొదటి షెడ్యూలులోని పార్ట్‌ బీ కింద చేర్చిన బీచ్‌ శాండ్‌ మినరల్స్‌తోపాటు మరికొన్ని అటమిక్‌ మినరల్స్‌ను తొలగించే ప్రభుత్వం ప్రతిపాదనపై వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మైనింగ్‌ పరిశ్రమకు చెందిన భాగస్వాములు, పారిశ్రామిక సంఘాలతోపాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరినట్లు చెప్పారు. అటమిక్‌ మినరల్స్‌లో కొన్నింటిని అంతరిక్ష పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్‌, ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్‌, ఇంధన రంగాలతోపాటు ఎలక్ట్రిక్‌ బ్యాటరీల తయారీకి, న్యూక్లియర్‌ పరిశ్రమకు విరివిగా వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. 


కాలుష్యరహిత సమాజానికి భారతదేశం కట్టుబడి ఉన్నందున ఆయా రంగాల్లో అణు ఖనిజ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ అణు ఖనిజాల కోసం దేశం భారీగా దిగుమతులపై ఆధారపడుతోంది. అత్యున్నత ఆర్థిక విలువ కలిగి ఉన్నందున ఈ అణు ఖనిజాల సరఫరా భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితుల మధ్య కొనసాగుతోందని మంత్రి వివరించారు. బీచ్ శాండ్ అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ఇందుకోసం  ప్రత్యేక చట్టాలను రూపొందించిందని మంత్రి  పేర్కొన్నారు. మైనింగ్‌ చట్టం ప్రకారం బీచ్ శాండ్ అక్రమ మైనింగ్, రవాణా, నిల్వలను అరికట్టే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని అన్నారు. అయితే దేశంలో బీచ్ శాండ్ మైనింగ్ అక్రమాలకు సంబంధించిన సమాచారం ఏదీ తమ వద్ద లేదని తెలిపారు.

Updated Date - 2022-08-01T22:39:40+05:30 IST