ఎవరికి ఎవరు బాకీ!

ABN , First Publish Date - 2021-09-18T08:03:02+05:30 IST

పీఎం ఆవా్‌సయోజన(పీఎంఏవై) పథకం కింద కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టానికి పెద్దఎత్తున ఇళ్లు మంజూరుచేసింది.

ఎవరికి ఎవరు బాకీ!

ఇళ్లకు 3700 కోట్లు ఇచ్చిన కేంద్రం

అందులో 2 వేల కోట్లు వాడుకున్న ఏపీ

పేదలకు సకాలంలో అందని బిల్లులు

దీంతో తర్వాతి కోటా ఇవ్వని కేంద్రం

ఆ నిధులు చూపేందుకు నానా తిప్పలు

చివరకు పేదలపై అప్పుల తప్పుల భారం

పైకి మాత్రం రిజిస్ర్టేషన్‌ అంటూ కలరింగ్‌

వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ అసలు గుట్టు ఇదే

ప్రభుత్వానికి ప్రజలు అప్పు ఉన్నారా?

ప్రభుత్వమే ప్రజలకు బకాయిపడిందా?


కేంద్రం పేదలకు ఇచ్చిన ఇళ్ల డబ్బులను చాలామేర రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు వాడుకుంది. తీరా కేంద్రం ఇచ్చిన నిధులను పేదలకు ఇవ్వాల్సిన సమయం వచ్చేసరికి... మళ్లీ ఆ పేదలనే బాదేసేందుకు సిద్ధమయింది. ఇళ్లపై పేదలు కట్టాలంటున్న రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌’ బాగోతం ఇదే!


(అమరావతి, ఆంధ్రజ్యోతి): పీఎం ఆవా్‌సయోజన(పీఎంఏవై) పథకం కింద కేంద్ర ప్రభుత్వం.. రాష్ర్టానికి పెద్దఎత్తున ఇళ్లు మంజూరుచేసింది. ఒక్కో ఇంటికి రూ.లక్షన్నర రాయితీ ఇస్తోంది. రాష్ట్రం ఆర్భాటం గా ప్రచారం చేసుకుంటున్న ‘జగనన్న కాలనీల ఇళ్ల’న్నీ కేంద్రం నిధులతో కడుతున్నవే. అంటే కేంద్రం ఇచ్చేది పోగా వైసీపీ ప్రభుత్వం పేదల ఇంటికి ఇస్తోంది కేవలం రూ.30వేలు. వాటి ని కూడా ఉపాధి హామీ నిధులకు ముడిపెట్టేసింది. అంటే గ్రా మీణ ప్రాంతాల్లో రాష్ట్రం ఒక్కో ఇంటికి ఇచ్చేది అక్షరాలా సున్నా. పీఎంఏవై కింద కట్టే ఈ ఇళ్లకు కేంద్రం మూడు దఫాలుగా నిధులు మంజూరుచేస్తుంది. తొలి విడతలో 40శాతం(రూ.60వేలు), రెండో విడతలో 40శాతం(రూ.60వేలు), మూడో విడతలో 20శాతం(రూ.30వేలు) మొత్తం రూ.లక్షన్నర విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి విడత, అంతకముందు నిధులు అన్నీ కలిపి రూ.3700 కోట్లు ఏపీ ప్రభుత్వానికి కేంద్రం విడుదల చేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.1700 కోట్లు మాత్ర మే వాస్తవంగా ఇళ్లకోసం వినియోగించింది. ఇళ్ల బిల్లులతోపా టు సిమెంట్‌, స్టీలు కొనుగోలు అవసరాలకూ వాడింది. అంటే లబ్ధిదారులకు అందులో బిల్లుల రూపంలో వచ్చింది సుమారు సగమే. మిగతా దాదాపు రూ.2వేల కోట్ల ఇళ్ల నిధులు రాష్ట్రం ఇతర పథకాలకు మళ్లించింది. 


అందుకే బాదుడు స్కీమ్‌..

ఇప్పుడు రెండో విడత నిధులు విడుదల కావాలంటే తొలి విడత నిధులకు యూసీలు సమర్పించాలి. అందుకోసం ఇంకా చాలా బిల్లులు పేదలకు చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభు త్వ ఇళ్ల ఖాతాలో వాస్తవంగా ఉన్న నిధు లు రూ.50 కోట్లకు మించి లేవు. రాష్ర్టాలు ఇళ్ల నిధులను సొంత అవసరాలకు వాడకుండా కేంద్రం...పబ్లిక్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (పీఎ్‌ఫఎంఎస్‌) అనే కొత్త ఖాతాలు తెరిచింది. కేంద్రం నుంచి ఇళ్ల కోసం వచ్చే నిధులు నేరుగా అందులోనే జమ అవుతాయి. వాటిని ఇళ్ల కోసం తప్ప వేరే అవసరాలకు వినియోగించడానికి కుదరదు. ‘మాకు సీఎ్‌ఫఎంస్‌ ఉంది. పీఎ్‌ఫఎంఎస్‌ వద్దు’ అని రాష్ట్రం చెప్పినా అందుకు కేంద్రం అంగీకరించలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో కొద్దినెలల నుంచి పీఎ్‌ఫఎంఎస్‌ విధానాన్ని రాష్ట్రం అమలుచేస్తోంది. అయితే గతంలో విడుదల చేసిన నిధులు కూడా పీఎ్‌ఫఎంఎ్‌సలో కనిపించాలని కేంద్రం రాష్ట్రంపై ఒత్తిడి చేస్తోంది. ఇప్పటికే ఖజానా ఖాళీ కావడం, అప్పులపై నడుస్తోన్న సర్కారుకు ఇంత నిధులు ఎక్కడినుంచి తేవాలో అర్థంకావడం లేదు. హడ్కో నుంచి రుణ ప్రయత్నాలు చేస్తున్నా ఇళ్లకు అవసరమైన భారీ మొత్తంలో రుణం వచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో దీనికి శాశ్వత పరిష్కారంగా వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో అప్పుల్లేకుండా అటు ఇళ్లకు బిల్లులు సమీకరించడంతో పాటు ఇతర పథకాలకూ నిధులు తెచ్చిపెట్టేలా ఈ ప్లాన్‌ చేసింది. కానీ అసలు ఉద్దేశ్యాన్ని పైకి చెప్పకుండా పేదలకు వారి ఆస్తులు వారికి ఇచ్చేస్తామని, స్థలాలు రిజిస్ర్టేషన్‌ కూడా చేస్తామంటూ కలరింగ్‌ ఇస్తోంది.


ఆ బకాయిల సంగతేంటి?

ప్రభుత్వానికి ఇళ్లపై ప్రజలు కట్టాల్సిన పాత రుణాలపై ఇప్పుడు కొత్త పథకం పెట్టారు. మరి.. ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన రాయితీ నగదు బకాయిలను ఎందుకు విడుదల చేయడం లేదనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్‌ పథకాల కింద కట్టుకున్న ఇళ్లకు సంబంధించి 2లక్షల మంది లబ్ధిదారులకు దాదాపు రూ.900 కోట్లు చెల్లించాలి. రెండున్నరేళ్లు అవుతున్నా వైసీపీ ప్రభుత్వం ఆ బకాయిల ఊసే ఎత్తడంలేదు. గత ఏడాది క్రిస్టమస్‌ రోజు వేస్తామని సీఎం అంతర్గతంగా హామీ ఇచ్చినా, ఎందుకో అది అమలుకాలేదు.


అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్న పేదలు మధ్యలో ఆగిపోయిన బిల్లుల కోసం మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. దీంతో అసలు ఆ బిల్లులు ఇక రావేమోనన్న భావన పేదల్లో ఏర్పడింది. వాటి గురించి మాట మాట్లాడని ప్రభుత్వం పేదలు ఇవ్వాల్సిన వాటికి మాత్రం కొత్త స్కీం తీసుకొచ్చింది. మరోవైపు ప్రస్తుతం కడుతున్న ఇళ్లకూ సక్రమంగా బిల్లులు రావడంలేదు. దాదాపు రూ.1500 కోట్లకు బిల్లులు జనరేట్‌ చేస్తే అందులో సగం కూడా అందలేదన్న ప్రచారం సాగుతోంది. బిల్లులు ఇవ్వకుండా ఇళ్లు కట్టుకోమంటే ఎలాగంటూ పేదలు ప్రశ్నిస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వారికి బిల్లులు ఇవ్వడం కోసం మళ్లీ ప్రజలనే బాదేందుకు వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ను(ఓటీఎస్‌) తెరపైకి వచ్చింది. దీంతో ప్రభుత్వానికి ప్రజలు అప్పు ఉన్నారా...ప్రజలకి ప్రభుత్వమే బకాయు పడిందా....అసలు ఎవరు ఎవరికి బాకీ ఉన్నారు.... అప్పుడెప్పుడో కట్టుకున్న ఇళ్ల రుణాలు ఇప్పుడు చెల్లించాలంటు న్న ప్రభుత్వం, పేదల ఇళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన నిధులను పేదలకు ఎందుకు విడుదలచేయడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

Updated Date - 2021-09-18T08:03:02+05:30 IST