రహదారులు రక్తసిక్తం!

Sep 20 2021 @ 03:19AM

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి.. అతివేగానికి ఐదుగురు

హైదరాబాద్‌-విజయవాడ హైవేపై అరగంట వ్యవధిలో 2 ప్రమాదాలు


కట్టంగూరు/మిర్యాలగూడ రూరల్‌, సెప్టెంబరు 19: రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం అర గంట వ్యవఽధిలో, అర కిలోమీటరు దూరంలో హైదరాబాద్‌-విజయవాడ 65వ నంబరు జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలంలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మరణించారు. నాగర్‌కర్నూలు జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. విజయవాడ రహదారిపై జరిగిన ప్రమాదంలో మరణించివారు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా, ఏపీలోని ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం హైపరాజుపాలెం గ్రామానికి చెందిన దంపతులు కదిరి గోపాల్‌రెడ్డి(31), రచన(30), కుమార్తె రియాన్షుతో పాటు కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ప్రశాంత్‌(24)తో కలిసి హైదరాబాద్‌ నుంచి నూజివీడుకు సొంత కారులో బయలుదేరారు. కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం గ్రామశివారులోకి రాగానే విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్‌ చేయబోయారు. ఈ క్రమంలో అతివేగంగా వెళ్తున్న కారు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టి అదుపు తప్పింది. డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ప్రశాంత్‌తో పాటు గోపాల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన రచనను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. రియాన్షు స్వల్పగాయాలతో బయటపడింది. ప్రకాశం జిల్లాకు చెందిన గోపాల్‌రెడ్డి, రచనలది ప్రేమ వివాహం. గోపాల్‌రెడ్డి రాజస్థాన్‌లో ఏడేళ్లుగా మైనింగ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. దక్షిణాఫ్రికాలో ఉద్యోగం రావడంతో రాజస్థాన్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి భార్య, కుమార్తెతో కలిసి స్వగ్రామానికి బయలుదేరారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.