ఖరీఫ్ కు తెగుళ్ల బెడద!

Sep 20 2021 @ 03:30AM

పురుగు మందుల కోసం తంటాలు

ఎకరాకు 3వేల అదనపు ఖర్చు

మొక్కుబడిగా పొలంబడి!

కూలీలు దొరక్క, యంత్రాల్లేక రైతుల అవస్థలు 


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌ పైర్లను చీడపీడలు చుట్టుముడుతున్నాయి!. ప్రధాన పంటలపై తెగుళ్లు, పురుగులు ఆశించడంతో రైతులు క్రిమి సంహారక మందులు కొనుగోలు చేయలేక తంటాలు పడుతున్నారు. గతంలో మాదిరిగా పురుగు మందుల పిచికారీకి కూలీలు రాకపోవడంతో స్ర్పేయర్లు అందుబాటులోని లేని రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు ఇబ్బందిపడుతున్నారు. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు లేని గ్రామాల రైతులకు అద్దె పరికరాలు కూడా లభించడం లేదు. దీంతో పిచికారీ కోసం కూలీలను బతిమాలుకోవాల్సి వస్తోంది. ఇలా చీడపీడల నివారణకు ఎకరానికి రూ.2-3వేలు ఖర్చవుతోందని చెప్తున్నారు. వ్యవసాయశాఖ పొలంబడి కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహించడం తప్ప, చాలా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పంట పొలాలను సందర్శించి తగిన సూచనలు, సలహాలు ఇస్తున్న దాఖలాలే లేవన్న విమర్శలున్నాయి. 


ఇదీ పరిస్థితి.. 

ప్రస్తుతం నాట్ల దశలో, మొక్క ఎదుగుదల దశలో ఉన్న వరిలో కాండం పురుగు, ఆకు ముడత, తొడుగు ముడత, అగ్గి తెగులు ఆశిస్తున్నాయి. నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం, రాయలసీమ జిల్లాల్లో వరి పైరులో ఈ తెగుళ్లు ఎక్కువగా ఉన్నాయని ఆ ప్రాంత రైతులు చెప్తున్నారు. తెగులు ఆరంభదశలో పురుగు మందులు పిచికారీ చేయకపోతే, ధాన్యం దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా, కర్నూలు, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో మొక్కజొన్నలో కత్తెర పురుగు కన్పిస్తోంది. కృష్ణా, కర్నూలు,  కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పత్తి చేలల్లో గులాబీ రంగు పురుగు, రసం పీల్చే పురుగు, తెల్లదోమ రైతుల్లో అలజడి సృష్టిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సహా, రాయలసీమ ప్రాంతంలో వేరుశనగ పైరులో ఆకు మచ్చ, రసం పీల్చే శనగపచ్చ, లద్దె పురుగు, ఆకు ముడత, వేరుకుళ్లు ఉధృతమవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో మినుములో ఆకు తినే గొంగళి పురుగు కన్పిస్తోంది. చిత్తూరు, కడప జిల్లాల్లో సజ్జలో కాండం పురుగు, తేనెబంక తెగులు, పొద్దుతిరుగుడు పంటలో రసం పీల్చే పురుగు, ఆకుమచ్చ, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మిర్చిలో రసం పీల్చే పురుగు, విశాఖపట్నం జిల్లాలో చెరకులో పచ్చాకు తెగులు కన్పిస్తున్నాయి.  


సస్యరక్షణ ఇలా.. అగ్రివర్సిటీ సూచనలు

ఖరీఫ్‌ పైర్లలో తెగుళ్ల నివారణకు సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ విభాగం సూచించింది. దీని ప్రకారం.. శాస్త్రవేత్తల సూచనల మేరకే వరిలో తెగుళ్ల నివారణకు క్రిమి సంహారక మందులు వాడాలి. పత్తిలో గులాబీ రంగు పురుగు ఉధృతిని గమనించేందుకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయాలి. వేరుశనగలో రసం పీల్చే లద్దె పురుగు నివారణకు 5ు వేపకషాయం, లేదా ఎకరానికి 200లీటర్ల నీటిలో 320ఎంఎల్‌ మోనోక్రోటోఫాస్‌ కలిపి పిచికారీ చేయాలి. పొద్దుతిరుగుడులో శనగపచ్చపురుగుకు స్పైనోసాడ్‌ 0.3ఎంఎల్‌ లేదా నొవల్యూరాన్‌1ఎంఎల్‌ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.