భగ్గుమన్న మిర్చి రైతు

Sep 22 2021 @ 03:11AM

మార్కెట్లో ఒక్కసారిగా పతనమైన ధర

క్వింటాల్‌కు రూ.3 వేలకుపైగా తగ్గుదల

రైతుల ఆగ్రహం.. యార్డుకు తాళం

పత్తిపై షరతుల కత్తి

8 శాతం మించి తేమ ఉంటే ధరలో కోత

12 శాతం మించితే సీసీఐ కొనదు

ఈ-క్రా్‌పలో నమోదు తప్పనిసరి


హిందూపురం, సెప్టెంబరు 21: ఎండుమిర్చి ధర ఒక్కసారిగా పతనం కావడంతో రైతులు కన్నెర్రజేశారు. తెచ్చిన సరుకును అక్కడే పారబోసి.. మార్కెట్‌ యార్డు గేట్లకు తాళం వేసి.. రోడ్డుపై బైఠాయించారు. రైతుల ఆందోళనలతో అనంతపురం జిల్లా హిందూపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డు వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది మిర్చి దిగుబడులు బాగున్నాయి. ధర కూడా బాగుండటంతో రైతులు మంగళవారం భారీగా మిర్చి పంటను తోలుకుని యార్డుకు వచ్చారు. ప్రారంభంలోనే నాణ్యమైన పంటను సైతం క్వింటాల్‌ రూ.6 వేల నుంచి రూ.8 వేల లోపే పాడారు. గత వారంలో క్వింటాల్‌ 12 నుంచి 14 వేల దాకా ధర పలికింది. వారంలోనే సగానికి సగం దాకా ధరలు ఎలా తగ్గుతాయని కమీషన్‌ ఏజెంట్లను రైతులు నిలదీశారు. మార్కెట్‌కు పంట అధికంగా వచ్చిందని, ఎగుమతులు లేకపోవడంతో ధరలు తగ్గాయని ట్రేడర్స్‌ చెప్పారు. ‘ఇష్టమైతే ఇవ్వండి.. లేదంటే తీసుకుపోండి’ అని కమీషన్‌ ఏజెంట్లు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటను బస్తాల్లో నుంచి కిందపోసి, ఆందోళనకు దిగారు. మార్కెట్‌ యార్డు చైర్మన్‌, కార్యదర్శులను నిలదీశారు. ధరలు సగానికి సగం తగ్గించేరని, కొందరు కమీషన్‌ ఏజెంట్లు నూటికి రూ.8 నుంచి రూ.10 దాకా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుల ఆందోళనతో మధ్యాహ్నం దాకా కొనుగోళ్లు నిలిచిపోయాయి. పోలీసుల జోక్యంతో మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు ప్రారంభించారు. కనిష్ఠంగా క్వింటాల్‌ రూ.4,500, గరిష్ఠంగా 12 వేలు, సగటున రూ.4600 చొప్పున కొనుగోళ్లు చేశారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.