ఇప్పుడు షాకే.. ఇకపై పిడిబాకే!

ABN , First Publish Date - 2021-10-25T08:17:23+05:30 IST

ఇప్పుడు షాకే.. ఇకపై పిడిబాకే!

ఇప్పుడు షాకే.. ఇకపై పిడిబాకే!

వచ్చే ఏడాది కరెంటు బిల్లులు పేలుడే!

యూనిట్‌కు 50 పైసల ట్రూఅప్‌ చార్జీ

యూనిట్‌ రూ.4కు కొంటేనే ఇదీ పరిస్థితి

ఇప్పుడు రూ.15-20కి కొంటున్న వైనం

అంటే రూ.3 నుంచి 4 బాదుడు తప్పదా?


విద్యుత్‌ వినియోగదారులారా.... జాగ్రత్త! కరెంటును ఆచితూచి వాడుకోండి. ఒక్కో యూనిట్‌ను పొదుపు చేయండి. ఇప్పటికే భారమవుతున్న బిల్లులు మున్ముందు మరింత బద్దలవుతాయి. ‘షాకులు’ కొడుతున్న ట్రూఅప్‌ చార్జీలు పిడిబాకులై గుచ్చుకుంటాయి. ఎందుకంటే.. ‘బొగ్గు కొరత’ పేరిట యూనిట్‌ను రూ.15 నుంచి 20 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ భారమంతా ట్రూఅప్‌ చార్జీల పేరిట జనం నుంచే వసూలు చేస్తారు. అది ఎంత ఉండొచ్చు... అని తలచుకుంటేనే గుండె గుభేల్‌మనడం ఖాయం.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

మొన్నటిదాకా యూనిట్‌ విద్యుత్తు నాలుగు రూపాయల నుంచి ఆరు రూపాయలకు కొనుగోలు చేసినందుకే... ట్రూఅప్‌ చార్జీలను భారీగా బాదేశారు. విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ (ఈఆర్‌సీ) ఇచ్చిన ‘ముందస్తు అనుమతి’ ప్రకారం ప్రతి క్వార్టర్‌కు యూనిట్‌కు 50 పైసల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇప్పుడు... విద్యుత్తు సంక్షోభం పేరిట సాధారణ సమయాల్లో యూనిట్‌ రూ.15 వరకూ .. పీక్‌ (సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదిన్నర) సమయంలో యూనిట్‌ను ఏకంగా రూ.20 వరకూ  కొనుగోలు చేస్తున్నారు. దీంతో.. వచ్చే ఏడాది ట్రూఅ్‌పలు భారీ నుంచి అతి భారీగా ఉండే అవకాశం ఉందని విద్యుత్తు రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత లెక్కల ప్రకారం చూస్తే... యూనిట్‌కు 3 నుంచి 4 రూపాయల వరకు ట్రూఅప్‌ చార్జీ (ఇంధన వ్యయం సర్దుబాటు చార్జీ) వసూలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏటా రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి వద్ద వినియోగదారులకు ఎంత ధరకు విద్యుత్తును అందించనున్నది వివరిస్తూ .. వార్షిక ఆదాయ నివేదిక (ఏఆర్‌ఆర్‌)ను డిస్కమ్‌లు సమర్పిస్తాయి. ఈ నివేదికలో విద్యుత్తు వినియోగదారుల నుంచి ఎంతెంత టారిఫ్‌ అమలు చేయనున్నది కూడా తెలుపుతాయి. గృహ, పరిశ్రమలు, వాణిజ్య విభాగాలవారీగా ఎవరి నుంచి ఎంతెంత టారి్‌ఫను అమలు చేస్తున్నదీ  విద్యుత్తు నియంత్రణ మండలి ముందు పెడతాయి. మండలి ఆమోదించాక వాటిని ప్రధాన పత్రికల్లో ప్రకటనల ద్వారా ప్రజల ముందుంచుతాయి. రాష్ట్రంలో 17.37 లక్షల  వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వ్యవసాయానికి  ఉచిత విద్యుత్తు ఇస్తున్నందున రైతులు వినియోగదారుల కిందకు రారు. ఇప్పుడు వారికి కూడా బిల్లులను లెక్కించి.. ఆ మొత్తాన్ని ప్రభుత్వమే తిరిగి చెల్లించేందుకు సిద్ధమైనందున .. వ్యవసాయ విద్యుత్తునూ వినియోగం లెక్కల్లోకే తీసుకోవాల్సి ఉంటుందని నిపుణలు చెబుతున్నారు. 


అంచనాలపై అడుగు పడేనా? 

విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి సమర్పిస్తున్న వార్షిక నివేదికల్లోనే భవిష్యత్తు డిమాండ్‌ ఎంత ఉండబోతుందో డిస్కమ్‌లు ఊహిస్తాయి. ఆ లెక్కలను నియంత్రణ మండలికి అందిస్తాయి. ఏటా విద్యుత్తు వినియోగం 12 శాతం మేర పెరుగుతోందంటూ ఈఆర్‌సీకి లెక్కలను సమర్పిస్తాయి. విద్యుత్తు నియంత్రణ మండలికి సమర్పించిన విద్యుత్తు పెరుగుదల అంచనాల్లో 2020-21 సంత్సరంలో 73,090 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉం టుందని ఇంధనశాఖ పేర్కొంది. 2021-22 సంవత్సరాల్లో 78,540 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ ఉంటుందని అంచనాలు వేసింది. పీక్‌ అవర్‌లో 2020- 21 లో 11,021 మెగావాట్లు, 2021-22లో 11,843 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్‌ ఉంటుందని అంచనాలు వేసింది. ఈ అంచనాల మేరకు విద్యుత్తును సమీకరించుకోవాలి. అయితే.. ఈ దిశగా ఇంధన సంస్థలు కార్యాచరణ రూపొందించాయో లేదోనన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 


రెండు విధాలా దెబ్బే!

2019లో విద్యుత్తు రంగంపై ప్రభుత్వం సమీక్షించింది. విద్యుత్తు సమీకరణ విధానంలో మార్పులూ చేర్పులూ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ధర్మల్‌ విద్యుత్కేంద్రాల కంటే.. పవర్‌ ఎక్స్ఛేంజీలో విద్యుత్తు కొనుగోలు చేస్తూ ప్రాంతీయ విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌)ల ద్వారా వినియోగదారులకు సరఫరా చేస్తోంది. ఈ విధంగా విద్యుత్తు కొనుగోళ్లకు ఇంధన శాఖ రూ.11,000 కోట్ల  మేర బకాయి పడింది. ఒకవైపు వినియోగదారుల నుంచి ఏ నెలకానెల బిల్లులు వసూలు  చేస్తున్న డిస్కమ్‌లు .. ఇంధన సంస్థలకు చెల్లించడం లేదని విద్యుత్తురంగ నిపుణులు చెబుతున్నారు. ఒకవైపు విద్యుత్తు కొనుగోళ్ల బిల్లులు తడిసిమోపెడు కావడం .. మరోవైపు బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరలకు కొనుగోలు చేయడం వల్ల ఇంధన సంస్థలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని నిపుణులు అంటున్నారు. విద్యుత్తు కొనుగోలు భారం భారీగా ఉండడంతో .. వాటిని ట్రూఅప్‌ చార్జీల పేరిట వినియోగదారులపై ఇంధన పంపిణీ సంస్థలు వేస్తున్నాయి. గతంలో నాలుగు నుంచి ఆరు  రూపాయలకు యూనిట్‌ కొనుగోలు చేసినప్పుడే భారీ మొత్తంలో ట్రూఆప్‌ పేరిట బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పడు .. ఏకంగా యూనిట్‌ను రూ.20 చొప్పున కొనుగోలు చేస్తున్నందున .. ట్రూఅప్‌ చార్జీల భారం ఇంకెంత ఉంటుందోనన్న భయం వినియోగదారులను ఆవహిస్తోంది. 


ఆధిక్యం గృహ వినియోగానిదే!

విద్యుత్‌ నియంత్రణ మండలికి డిస్కమ్‌లు అందించిన వార్షిక ఆదాయ నివేదికను అనుసరించి... రాష్ట్రంలోని మొత్తం 185.06 లక్షలమంది వినియోగదారుల్లో  148 లక్షలమంది గృహ వినియోగదారులు ఉన్నారు. 14.5 లక్షలమంది వాణిజ్య వినియోగదారులు, 1.63 లక్షల మంది పారిశ్రామిక వినియోగదారులు ఉన్నారు.

Updated Date - 2021-10-25T08:17:23+05:30 IST