ltrScrptTheme3

ప్రజల కోసం అమరత్వం

Oct 25 2021 @ 03:39AM

ఆర్కే ఆశయాల సాధనే నిజమైన నివాళి 

భార్య శిరీష, బంధుమిత్రుల ఉద్ఘాటన

ఆలకూరపాడులో సంస్మరణ సభ

 ప్రజాసంఘాల నాయకులు హాజరు

పోలీసుల దిగ్బంధంలో గ్రామం


ఒంగోలు(జడ్పీ), అక్టోబరు 24: ‘భర్త, కొడుకు.. ఇద్దరికీ ఒకేరోజు సంస్మరణ సభ నిర్వహించడం వేదన కలిగిస్తోంది. కానీ, ప్రజల కోసం వారు అమరత్వం సాధించినందుకు గర్వపడుతున్నా. ఆర్కే ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి’ అని మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష పేర్కొన్నారు. అనారోగ్యంతో ఇటీవల కన్నుమూసిన ఆర్కే సంస్మరణ సభను ఆయన భార్య స్వగ్రామమైన ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో ఆదివారం నిర్వహించారు. ఆర్కే కుమారుడు పృథ్వీ అలియాస్‌ మున్నా ఐదో వర్ధంతి రోజే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. బంధుమిత్రులు, ప్రజాసంఘాల నాయకులు హాజరై జోహార్లు అర్పించారు. నమ్మిన సిద్ధాంతం కోసం 40 ఏళ్ల విలువైన జీవితాన్ని పోరాటాలకు అంకితం చేసిన ఎర్రసూరీడు ఆర్కే అంటూ వందనాలు సమర్పించారు. మావోయిస్టు ఉద్యమంలోనే గతంలో మరణించి అదే గ్రామానికి చెందిన దత్తాత్రేయ, జయకుమార్‌కు కూడా నివాళులర్పించారు. సంస్మరణ సభలో ఆర్కే తమ్ముడు సుబ్బారావు మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి తనకు గురువు అన్నయ్యేనని గుర్తు చేసుకున్నారు. ఉద్యమాల పట్ల ఆకర్షితుడై ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో పోరాట పంఽథాను ఎంచుకుని అమరుడైనందుకు గర్వపడుతున్నానని చెప్పారు. అరుణోదయ విమలక్క మాట్లాడుతూ అడవి మీద హక్కు ఆదివాసీలకే తప్ప దోచుకునేవాళ్లకు కాదంటూ ఆదివాసీల హక్కుల కోసం తుదికంటా పోరాడిన వ్యక్తి ఆర్కే అన్నారు.  విరసం సభ్యుడు పినాకపాణి మాట్లాడుతూ ఆర్కే మరణంతో విప్లవోద్యమానికి దశ, దిశ ఉండదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారని.. కానీ, వారి ఆశలు నెరవేరబోవన్నారు. కార్యక్రమంలో విరసం నేత కల్యాణరావు, అమరుల బంధుమిత్రుల కమిటీ ప్రధాన కార్యదర్శి పద్మ, భవాని, పౌరహక్కుల కమిటీ సభ్యుడు చిలకా సుధాకర్‌, అరసవెల్లి కృష్ణ, చావలి సుధాకర్‌, సీపీఐ ఎంఎల్‌ నాయకురాలు లలిత, న్యూడెమోక్రసీ నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రగతిశీల కార్మిక సంఘం నేత కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


సమాధుల వద్ద నివాళి

తొలుత ఆర్కే కుమారుడు మున్నా, గ్రామానికి చెందిన దత్తాత్రేయ, జయకుమార్‌ సమాధుల వద్ద వారి కుటుంబసభ్యులతోపాటు అమరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు, గ్రామస్థులు నివాళులర్పించారు. అనంతరం స్థూపం వద్ద జెండా ఎగురవేసి, సంస్మరణ సభ వేదిక వద్దకు చేరుకున్నారు.


పోలీసు తనిఖీలు

ఆర్కే సంస్మరణ సభ సందర్భంగా ఆలకూరపాడును పోలీసులు దిగ్బంధించారు. పది మంది సీఐలు, 200 మందికిపైగా సిబ్బంది నలువైపులా గ్రామంలోకి ప్రవేశించే మార్గాలను ఆధీనంలోకి తీసుకున్నారు. ఊళ్లోకి ప్ర వేశించే ప్రతి ఒక్కరి వివరాలు అడిగి నమోదు చేసుకు న్న తర్వాతే పంపించారు. వ్యవసాయ పనులకు వెళ్లి వ చ్చే గ్రామస్థులనూ తనిఖీ చేశారు. కాగా, ప్రశాంతంగా తాము సంస్మరణ సభ నిర్వహిస్తుంటే ఇంత నిఘా దేనికని ఆర్కే భార్య శిరీష ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.