కొవ్వూరులో విషజ్వరాల విజృంభణ

ABN , First Publish Date - 2021-10-27T09:35:01+05:30 IST

కొవ్వూరులో విషజ్వరాల విజృంభణ

కొవ్వూరులో  విషజ్వరాల విజృంభణ

చలి జ్వరం, తలనొప్పి, కళ్లు తిరగడం, కీళ్లనొప్పులు, ప్లేట్‌లెట్లు తగ్గడం వంటి లక్షణాలతో ఇబ్బందులు

నాలుగు రోజుల్లోనే 60 మంది ఆస్పత్రి పాలు

కలుషిత తాగునీరే కారణం?

ఇవి వైరల్‌ జ్వరాలే..  జేసీ వెల్లడి


కొవ్వూరు, అక్టోబరు 26: తీవ్రమైన చలి జ్వరం, తలనొప్పి, కళ్లు తిరగడం, కీళ్లనొప్పులు, పట్టుతప్పి కిందపడిపోవడం.. ఇదీ పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు శ్రీరామ కాలనీలో పరిస్థితి. ఇక్కడ విషజ్వరాలు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నాయి. నాలుగు రోజులుగా చిన్నా పెద్దా తేడా లేకుండా.. సుమారు 60 మంది ఇలాంటి లక్షణాలతో ఆస్పత్రుల పాలయ్యారు. అనేకమంది ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. చలి, జ్వరం కారణంగా ప్లేట్‌లెట్లు దారుణంగా పడిపోతున్నాయి. కాళ్లు, చేతులు, కీళ్ల నొప్పులతో నడవలేకపోతున్నారు. ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోతున్నారు. చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి వెళితే బెడ్లు ఖాళీ లేవంటూ.. రాజమండ్రికి రిఫర్‌ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గతంలో ఏలూరు వాసులను వణికించిన విషజ్వరాల తరహాలో ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషజ్వరాలపై సమాచారం అందుకున్న స్థానిక మంత్రి తానేటి వనిత, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, ఆర్డ్డీవో ఎస్‌.మల్లిబాబు బాధితులను పరామర్శించార. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించే ఏర్పాట్లు చేశారు. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారిని ఆస్పత్రికి తరలించారు. కాలనీ అంతా బ్లీచింగ్‌ చల్లించి, సూపర్‌ శానిటేషన్‌ చేపట్టారు. తాగునీటి పైప్‌లైను సూపర్‌ క్లోరినేషన్‌ చేయించారు. నీటి నమూనాలు సేకరించి ఏలూరు నీటి పరీక్ష కేంద్రాలకు పంపించారు. ఆరోగ్య సిబ్బందితో ఇంటింటి సర్వే చేపట్టారు. 


కాలనీ వాసుల ఆగ్రహం

తాగునీరు కలుషితం కావడంతోపాటు, పారిశుధ్య లోపించిందని, దోమలు పెరిగి కాలనీలో విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని ఆ కాలనీ వాసులు వాపోతున్నారు. కలుషిత తాగునీటిపై మున్సిపల్‌ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాల క్రితం వేసిన పైపులైన్లలోనే ప్రస్తుతం నీటి సరఫరా చేయడంతో తరచూ ఇబ్బందులకు గురవుతున్నామన్నారు.


కారణాలు విశ్లేషిస్తున్నాం: మంత్రి వనిత

గత రాత్రి నుంచి కొందరు జ్వరం, కళ్లు తిరగడం, కీళ్ల నొప్పుల వంటి లక్షణాలతో బాధపడుతున్నారని మంత్రి తానేటి వనిత అన్నారు. ఇవి మామూలు జ్వరాలా లేక డెంగీ, మలేరియానా అనే కారణాలను విశ్లేషిస్తున్నట్టు చెప్పారు. కాగా.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి శాంపిల్స్‌ను పరిశీలించామని, ఎలాంటి లక్షణాలు కనిపించలేదని డిప్యూటీ డీఎంహెచ్‌వో తాడి రామగుర్రెడ్డి పేర్కొన్నారు.


డెంగీ, మలేరియా కాదు.. వైరల్‌ జ్వరాలే: జేసీ

కొవ్వూరులో నమోదవుతున్నవి వైరల్‌ జ్వరాలేనని ప్రాథమికంగా గుర్తించినట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. శ్రీరామ కాలనీ, ప్రభుత్వాస్పత్రిలో రోగులను మంగళవారం రాత్రి ఆయన పరామర్శించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. బాధితుల రక్త నమూనాలు పరీక్షించగా డెంగీ, మలేరియా లక్షణాలు కాదని వచ్చిందని, వైరల్‌ ఫీవరేనని వైద్యులు చెబుతున్నారన్నారని తెలిపారు. కాలనీలో ప్రతి ఇంటి నుంచి తాగునీరు, పాలు, కూరగాయల శాంపిల్స్‌ సేకరించి వైజాగ్‌ ల్యాబ్‌కు పంపించామని.. ఆ ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు.



Updated Date - 2021-10-27T09:35:01+05:30 IST