తీరని కష్టం!

ABN , First Publish Date - 2021-11-21T07:09:58+05:30 IST

వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ..

తీరని కష్టం!

భారీ వర్షాలతో విలయంభారీ నష్టం

కడపలో గల్లంతైనవారు 40 మందికి పైమాటే.. ఇప్పటికి 12 మృతదేహాలు లభ్యం 

చెయ్యేరు వరదకు చితికిన గ్రామాలు.. ఆనవాళ్లు లేని పురాతన శివాలయం 

పూజారి కుటుంబం సహా 13 మంది మృతి.. మృత్యుంజయుడైన పూజారి కుమారుడు

5కి.మీ. వరదను ఈదుకుంటూ ఒడ్డుకు.. ఏరియల్‌ సర్వే ద్వారా సీఎం జగన్‌ పరిశీలన

నెల్లూరులో పెన్నమ్మ ఉగ్రరూపం.. నీట మునిగిన వేలాది ఇళ్లు..రూ.కోట్లల్లో నష్టం

సబ్‌స్టేషన్లలోకి నీరు... 32 గ్రామాలకు పవర్‌ కట్‌.. 20 అడుగుల ముంపులో జగనన్న కాలనీ

శ్రీవారి మెట్టు నడక మార్గంలో వర్ష బీభత్సం.. నేడు తిరుమలలో కార్తీక వనభోజనం రద్దు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)


వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీవర్షాలకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడటంతో చేతికందిన పంట ఏటి పాలైంది. వరద సృష్టించిన విలయం నుంచి బాధితులు ఇంకా కోలుకోలేకపోతున్నారు. కడప జిల్లాలో చెయ్యేరు వరద విధ్వంసానికి 24 గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ప్రతి పల్లెలో 1000కి పైగా మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. రాజంపేట మండలం పులపుత్తూరులో 12మంది, మందపల్లెలో 13మంది, గుండ్లూరులో 9మంది, రామాపురంలో ముగ్గరు, అడపూరులో ఇద్దరు... ఇలా సుమారు 40 మందికి పైగా గల్లంతయ్యారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికి 12మంది మృతదేహాలు లభ్యమయ్యాయని అధికారులు వివరిస్తున్నారు. అన్నమయ్య ప్రాజెక్టు ఆనకట్ట తెగి రాజంపేట, నందలూరు మండలాల్లో పలు గ్రామాలు జలదిగ్బంధంలోచిక్కుకున్నాయి. ప్రాజెక్టుకు అతిసమీపంలో ఉన్న పులపుత్తూరులో వందకు పైగా ఇళ్లు ఆనవాళ్లు కోల్పోయాయి. ఇక చెయ్యేరు నది ఒడ్డునున్న గ్రామం మందపల్లెలో ఇళ్లన్నీ బురద కుప్పలుగా మారాయి. ఇక్కడ రూ.25కోట్లకు పైగా నష్టం జరిగి ఉంటుందని అంచనా. 


కొట్టుకుపోయిన పురాతన శివాలయం 

మందపల్లి-పులపుత్తూరు గ్రామాల మధ్య చెయ్యేరు నది గట్టుపై శివాలయం నిర్మించారు. 600 ఏళ్లనాటి ఆలయమని స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కార్తీక పూజల కోసం 11మందితో పూజారి కుటుంబం, మరికొందరు భక్తులు ఆలయానికి చేరుకున్నారు. వరద ధాటికి ఆలయం పునాదులతో సహా కొట్టుకుపోయింది. 12మంది ఆలయం, కల్యాణ మండపం పైకి ఎక్కారు. అదీ వరదకు కొట్టుకుపోవడంతో వారంతా మృత్యుఒడి చేరారు. పక్కనే ఉన్న సుబ్రమణ్యస్వామి చిన్న ఆలయంలోకి వెళ్లి తలుపులు వేసుకున్న ఓ భక్తుడు విగతజీవుడయ్యాడు. పూజారి ఈశ్వరయ్య, ఆయన కుమారుడు హేమంత్‌ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వరదలో చిక్కుకున్న 15ఏళ్ల హేమంత్‌ వరిగడ్డి ఆసరాతో 5కి.మీ. పైగా ఈదుకుంటూ రాగా స్థానికులు కాపాడగలిగారు. 


సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే 

చెయ్యేరు భీకర వరదకు చితికిన గ్రామాలను సీఎం జగన్‌ హెలికాప్టర్‌ నుంచి ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. ఉదయం 10.32 గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్న ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో నందలూరు, రాజంపేట మండలాల్లో వరద ప్రభావిత గ్రామాలను పరిశీలించారు. అడ్డంగా తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టును తిలకించారు. అంతకుముందు జగన్‌కు నష్టం వివరాలను జిల్లా కలెక్టర్‌ విజయరామారాజు కడప ఎయిర్‌పోర్టులో వివరించారు. ఏరియల్‌ సర్వే అనంతరం తిరుపతి విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు.


సోమశిలకు స్వల్పంగా తగ్గిన వరద 

సోమశిల జలాశయానికి శుక్రవారం గరిష్ఠంగా 5.56లక్షల క్యూసెక్కులుగా రాగా, శనివారానికి కాస్త తగ్గుముఖం పట్టింది. ఉదయం 6గంటలకు 4,02,100 క్యూసెక్కులు, సాయంత్రం 5 గంటలకు 3,50,611 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదయింది. దిగువకు 3,32,250 క్యూసెక్కులు వదిలారు. సోమశిల డ్యాం దిగువన ఉన్న సోమేశ్వర ఆలయం వరద తాకిడికి పూర్తిగా ఛిద్రమైంది. గాలిగోపురం కుప్పకూలిపోయింది. కాగా, బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని శ్రీరంగరాజపురంలో పోటెత్తిన వరదను చూసి భయాందోళనతో గంపా బుజ్జయ్య(60) అనే రైతు శనివారం మృతి చెందాడు. 


శ్రీవారి మెట్లు మార్గం ధ్వంసం 

శ్రీవారిమెట్టు గుండా తిరుమలకు వెళ్లే నడక మార్గంలో రెండు రోజుల క్రితం కురిసిన భారీవర్షం బీభత్సం సృష్టించింది. వర్షపు నీటి ప్రవాహంలో పలు ప్రదేశాల్లో మెట్లు, ఇనుపగేట్లు కొట్టుకుపోవడంతో పాటు టోకెన్లు జారీచేసే కేంద్రం మట్టిలో కూరుకుపోయింది. ఈ మార్గాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావాలంటే 4నెలల సమయం పట్టే అవకాశముంది. తిరుమల రెండు ఘాట్‌రోడ్లలో శనివారం రాకపోకలు యథావిధిగానే కొనసాగాయి. వర్షాలు తగ్గేవరకు అలిపిరి మార్గం కాలినడక భక్తులను అనుమతించబోమని అధికారులు తెలిపారు. గత 30ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు కురవడంతో తిరుమలలో దాదాపు రూ.4 కోట్లకుపైగా ఆస్తి నష్టం జరిగిందని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలోని పార్వేట మండపంలో ఆదివారం నిర్వహించాల్సిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని వర్షాల నేపథ్యంలో టీటీడీ రద్దు చేసింది. 


మరో 48గంటలు మోస్తరు వర్షాలు

 చెన్నై వద్ద తీరం దాటిన వాయుగుండం మరింత బలహీనపడి, ఉత్తర తమిళనాడును ఆనుకుని ఉన్న కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల మీద అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం దక్షిణ కర్ణాటక ప్రాంతం వరకు వాయుతుఫాన్‌గా వ్యాపించి, ఉష్ణమండల స్థాయి వరకు విస్తరించింది. వీటి ప్రభావంతో రానున్న 48గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రాయలసీమలో ఎక్కువచోట్ల, కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి తమిళనాడు, ఏపీ, ఒడిశా వరకు విస్తరించిన అల్పపీడన ద్రోణి కూడా బలహీనపడింది. కాగా, తూర్పు మధ్య అరేబియా సముద్రం మీద అల్పపీడన ప్రాంతాన్ని ఐఎండీ గుర్తించింది. ఇది రానున్న 2-3 రోజుల్లో పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ, క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని, దీనివల్ల దేశంలో ప్రతికూల వాతావరణం ఏర్పడబోదని ఐఎండీ తెలిపింది. 


పాక్షికంగా కూలిన కపిలతీర్థం ఆలయ మండపం

మొన్నటి భారీ వర్షాలకు దెబ్బతిన్న తిరుపతిలోని కపిలతీర్థం ఆలయ ముఖమండపం శనివారం పాక్షికంగా కూలిపోయింది. నగర శివార్లలోని రాయలచెరువు తెగే ప్రమాదముందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో దిగువన ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పుంగనూరులో ప్రమాదకరస్థితికి చేరిన రాయలచెరువు మొరవ కట్టను మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ దగ్గరుండి తెగ్గొట్టించి నీటిని విడుదల చేయించారు. తిరుపతి రూరల్‌ మండలంలోని పేరూరు చెరువు నుంచి నీటిని స్వర్ణముఖి నదిలోకి విడుదల చేయాలని అధికారులను ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, కరుణాకరరెడ్డి, కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. విషయం తెలుసుకున్న దిగువ గ్రామాల జనం పెద్దఎత్తున రోడ్డుపైకి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డుగా రాళ్లు పెట్టి ఆందోళనకు దిగారు. దీంతో పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. ఈ వివాదం కొనసాగుతోంది. 


పెన్నానదికి వరద పోటు 

నెల్లూరు జిల్లాలో వాగులు, వంకలను ఏకం చేసుకున్న పెన్నమ్మ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతాలను ముంచేసింది. వరద నీరు వేలాది ఇళ్లను దిగ్బంధించడంతో ఎంతోమంది కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు. నెల్లూరు శివారు ప్రాంతంతో పాటు బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, విడవలూరు మండలాలు పూర్తిగా జలదిగ్భందమయ్యాయి. నది 5లక్షల క్యూసెక్కులకుపైగా వరద పోటెత్తడంతో శుక్రవారం అర్ధరాత్రి బుచ్చిరెడ్డిపాళెం మండలం దామవరం వద్ద ఐదుచోట్ల కరకట్టలు తెగిపోయాయి. సుమారు పది వేల ఇళ్లలోకి నీరు ప్రవేశించడంతో  తీవ్ర నష్టం సంభవించింది. పెన్నానది ఒడ్డున ఉన్న జనార్దనరెడ్డి కాలనీ పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడే జగనన్న ఇళ్లకాలనీ సుమారు 20అడుగుల లోతుకు వెళ్లిపోయింది. కట్టిన గృహాలు నీట మునగ్గా, పునాదులు కొట్టుకుపోయాయి. అనంతసాగరం, ఆత్మకూరు, కోవూరు, బుచ్చి, ఇందుకూరుపేట, నెల్లూరు రూరల్‌ పరిధిలోని ఏడు సబ్‌స్టేషన్లలోకి వరద నీరు చేరింది. వీటి పరిధిలోని 32గ్రామాలకు శుక్రవారం రాత్రి నుంచే విద్యుత్‌ సరఫరా ఆపేశారు. 



Updated Date - 2021-11-21T07:09:58+05:30 IST