ఇప్పుడెందుకిలా?

ABN , First Publish Date - 2021-11-22T08:12:42+05:30 IST

అలిపిరిలో క్లెమోర్‌ మైన్స్‌తో దాడి జరిగి.. ఒళ్లంతా గాయాలైనప్పుడు కూడా బాధ బయటకు కనిపించకుండా గంభీరంగా నిలిచిన...

ఇప్పుడెందుకిలా?

క్లెమోర్‌ మైన్స్‌నే తట్టుకున్నారు.. మరి

బాబు ఎందుకు ఇంతలా చలించారు.. సర్వత్రా చర్చ

మైకులో వినిపించినవి చాలా తక్కువ

ఎవరూ భరించలేనంతటి అసభ్య వ్యాఖ్యలు

సతీమణిపై తీవ్ర స్థాయిలో దుర్భాషలు

సభంతా వినిపించేలా కావాలనే దాడి

మామూలు మనిషైతే కొట్టేవాడే

ప్రజానాయకుడు కాబట్టి దిగజారలేదు

విలేకరుల సమావేశంలో

హృదయ వేదన బయటికొచ్చింది

సన్నిహిత వర్గాలు, తమ్ముళ్ల విశ్లేషణ

ఈ అవమానంపై ప్రజల్లోకి వెళ్లాలని

టీడీపీ యంత్రాంగం యోచన

అసెంబ్లీ ఘటన దురదృష్టకరం.. బాబుకు సోనూసూద్‌ ఫోన్‌

కలత చెంది మెప్మా కోఆర్డినేటర్‌ రాజీనామా

బాబు సీఎం అయ్యేందుకు పనిచేస్తానని శపథం

వ్యక్తిత్వ హననాన్ని సహించం.. నారావారిపల్లెలో రోహిత్‌

ఆరోజు ఆడియో, వీడియోలను ప్రజల ముందుంచండి!

ఎడిటింగ్‌ లేకుండా ఇవ్వండి.. స్పీకర్‌కు టీడీపీ ఎమ్మెల్యే లేఖ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)


అలిపిరిలో క్లెమోర్‌ మైన్స్‌తో దాడి జరిగి.. ఒళ్లంతా గాయాలైనప్పుడు కూడా బాధ బయటకు  కనిపించకుండా గంభీరంగా నిలిచిన తమ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఎందుకిలా చలించిపోయారు.. చూస్తున్నవారంతా నిర్ఘాంతపోయేలా ఎందుకు విలపించారు..? టీడీపీ శ్రేణులు మొదలుకొని సామాన్య ప్రజానీకం వరకూ ఇప్పుడు దీనిపైనే చర్చించుకుంటున్నారు. ఇందుకు కారణాలపై రకరకాల కోణాల నుంచి లోతైన శోధన జరుగుతోంది. నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో.. పవిత్ర శాసనసభలో ఎన్నడూ వినని తిట్లు వినాల్సి వచ్చిందని.. అందునా తన భార్యను కించపరిచేలా తూలనాడడం ఆయన తట్టుకోలేకపోయారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.


‘అసెంబ్లీలో మైకులో వినిపించినవి చాలా తక్కువ. కావాలని ఆయనకు దగ్గరగా వచ్చి దారుణమైన దుర్భాషలాడారు. ఆయన సతీమణిని కించపరుస్తూ బూతులు తిట్టారు. ఒరేయ్‌ చంద్రబాబూ.. నీ కొడుకు ఎవరికి పుట్టాడో తెలుసారా అని ఒక వైసీపీ ఎమ్మెల్యే అరుస్తుంటే.. నీ కొడుక్కి డీఎన్‌ఏ పరీక్ష చేయించాలిరా అని మరో ఎమ్మెల్యే పక్కనే నిలబడి కేకలు వేశారు. సభంతా వినిపించేలా కావాలని ఈ మాటల దాడి చేశారు. సాధారణ మనిషి అయితే అలా మాట్లాడినవాడిని లాగి రెండు చెంపలూ పగలగొడతారు. మూడు సార్లు సీఎంగా చేసిన వ్యక్తి కాబట్టి ఆ స్థాయికి దిగజారలేకపోయారు. ఆ బాధంతా విలేకరుల సమావేశంలో పొంగుకొని వచ్చింది’ అని ఆయన పక్కన ఆ రోజు ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వివరించారు. చంద్రబాబు ఫ్యాక్షనిస్టు అయితే హత్యలు జరిగేవని, ఆయన ప్రజా నేత కాబట్టి.. వేరే రూపంలో బయటకు వచ్చిందని మరో ఎమ్మెల్యే అన్నారు.


ఎన్నో ఎత్తుపల్లాలు..

40 ఏళ్లుగా రాజకీ యాల్లో ఉన్న చంద్రబాబు అనేక ఎత్తుపల్లాలు చూశారు. తన నాయకత్వంలో విజయాలు సాధించారు.. ఓటమినీ చవిచూశారు. దిగ్గజ ప్రత్యర్థులను ఎదుర్కొన్నారు. 1989లో టీడీపీ మొదటిసారి ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఆయనకు తిరుపతిలో ఎక్కడా ప్రభుత్వ అతిథి గృహం దొరక్కుండా చేశారు. రోడ్డుపైనే నిలబడ్డారు గానీ చలించలేదు. అలిపిరిలో నక్సల్స్‌ దాడిలో గాయాలతో బయటపడిన తర్వాత ఆయనను చూసేందుకు అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం వచ్చారు. ‘చంద్రబాబులో ఏ కోశానా భయం కనిపించలేదు. మంచంపై పడుకుని కూడా రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడుతున్నారు’ అని ఆయన తర్వాత వ్యాఖ్యానించారు. నిజానికి సంతోషాన్ని, బాధను నియంత్రించుకోవడాన్ని ఆయన సాధన చేశారు. ఎప్పుడైనా ఆగ్రహం ప్రదర్శించడం తప్ప మిగిలిన భావాలు ఆయన వద్ద కనిపించవు. తనను ఎంత విమర్శించినా దానికి తగిన సమాధానం సిద్ధం చేసుకోవడం తప్ప బాధపడడం.. ఆవేదన చెందడం చేసేవారు కాదు. అలాంటి వ్యక్తి విలేకరుల సమావేశంలో వెక్కి వెక్కి విలపించడం టీడీపీలో అనేక మందికి మనసు దేవేలా చేసింది. ‘ఆ దృశ్యాన్ని నేను రెండోసారి టీవీలో చూడలేకపోయాను.


వెంటనే ఆఫ్‌ చేశాను. అంతటి మహానేత ఆ స్థాయిలో విలపించడం చూసి ఆ రాత్రి నిద్రపట్టలేదు’ అని బీసీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో ఏ ఇద్దరు కలిసినా.. అలాంటి నాయకుడు ఎందుకింత తీవ్రంగా ప్రతిస్పందించారన్నదానిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ‘మా మధ్యే కాదు.. ఇళ్లలో, హోటళ్లలోనూ ఇవే చర్చలు జరుగుతున్నాయి’ అని మరో టీడీపీ నేత చెప్పారు. రాజకీయాలు అథమ స్థాయికి చేరిన పరిణామాలే ఆయనలో ఇంత హృదయ వేదన కలిగించాయని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చంద్ర బాబును ఎవరూ ఏమీ అనలేదని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇస్తున్న వివరణలను టీడీపీ ఎమ్మెల్యేలు కొట్టివేస్తున్నారు. ‘అధికార పక్షం ఏం మాట్లాడినా అడ్డుకోని సభాపతి తమ్మినేని సీతారాం కూడా ఒక దశలో ఆపుకోలేక.. కాకినాడ వైసీపీ ఎమ్మెల్యేను పేరు పెట్టి పిలుస్తూ మాట్లాడవద్దని చెప్పాల్సి వచ్చింది. ఫోన్లలో రికార్డయిన వాటిలో వారి వ్యాఖ్యలు వినిపిస్తూనే ఉన్నాయి’ అని టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు.


వారిని వదిలేది లేదు..!

తమ అధినేత ఇంతలా బాధపడటానికి కారణమైన వారిని వదిలేది లేదని టీడీపీ నేతలు కనిపించిన ప్రతి చోటా వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పార్టీలో స్తబ్దుగా ఉన్నవారిలో కూడా ఈ సంఘటన కదలిక తెచ్చింది. ‘నా నియోజకవర్గంలో కొందరితో నాకు విభేదాలున్నాయి. కొద్ది రోజుల్లో నేనే వారి ఇళ్లకు వెళ్లి కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ అరాచకాన్ని ఎదుర్కొందామని వారిని కోరతాను’అని ఒక నియోజకవర్గ నేత చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటంతోపాటు చంద్రబాబు సతీమణిని దారుణంగా దుర్భాషలాడి ఆయన విలపించడానికి కారణమైన పరిస్థితులనూ ఇంటింటికీ తిరిగి వివరించాలని టీడీపీ నేతలు యోచిస్తున్నారు. ‘ఇంతవరకూ వచ్చాక చేతులు ముడుచుకుని కూర్చో లేం. కష్టాల్లో ఉన్న ప్రజల కోసం నిలబడడం మా మొదటి లక్ష్యం. అలాగే, రాష్ట్రం కోసం రాత్రింబవళ్లూ పనిచేసిన నేత కుటుంబ సభ్యుల గురించి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో కూడా చెబుతాం. చంద్రబాబు కూడా బాధను దిగమింగుకుని మళ్లీ ప్రతిపక్ష పాత్రలోకి వస్తున్నారు. అందుకే వరద ప్రాంతాల ప్రజలను పరామర్శకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు’ అని ఆ పార్టీ ముఖ్యుడు చెప్పారు.


రేపు, ఎల్లుండి 

వరద జిల్లాలకు బాబు 

ఖరారైన కార్యక్రమం ప్రకారం.. చంద్రబాబు 23న మంగళవారం కడప, చిత్తూరు జిల్లాల్లో,  బుధవారం నెల్లూరు జిల్లాలో వరదపీడిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మ నసు సర్దుకునే  వరకూ ఆగాలని, ఇప్పు డే పర్యటనలు వద్దని ఒకరిద్దరు నేతలు ఆయనకు సూచించారు. అందుకు ఆయన అంగీకరించలేదు. ‘ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వారిని పలకరించడం కనీస ధర్మం. ప్రతిపక్షం క్షేత్ర స్థాయిలోకి వెళ్తేనే ప్రభుత్వంలో కదలిక వస్తుంది. బాధితులకు న్యాయం జరుగుతుంది’ అని వారితో అన్నారు.

Updated Date - 2021-11-22T08:12:42+05:30 IST