కొత్త పీఆర్‌సీతో అధిక జీతం

ABN , First Publish Date - 2022-02-02T08:20:28+05:30 IST

కొత్త పీఆర్‌సీతో ప్రభుత్వోద్యోగులందరికీ గౌరవప్రదమైన అధిక వేతనమే అందుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ చెప్పారు..

కొత్త పీఆర్‌సీతో అధిక జీతం

 పే స్లిప్‌ చూస్తే మీకే తెలుస్తుంది: సీఎస్‌ సమీర్‌ శర్మ 

 చాలా మందికి వేతనాలు జమ: రావత్‌


అమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): కొత్త పీఆర్‌సీతో ప్రభుత్వోద్యోగులందరికీ గౌరవప్రదమైన అధిక వేతనమే అందుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ చెప్పారు. కొత్త పీఆర్‌సీ ప్రకారమే వారికి మంగళవారం రాత్రి 11 గంటలకల్లా జీతం జమవుతుందని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో ఆయన ఆర్థికశాఖ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘జీతం పెరుగుతుందే తప్ప తగ్గదు. అందువల్ల ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు విరమించి మంత్రుల కమిటీతో చర్చలకు రావాలి. ప్రతి ఉద్యోగికీ జీతం స్లిప్‌లో ఈ నెలతోపాటు గత నెల జీతభత్యాల వివరాలతో కూడిన సమాచారం అందజేస్తాం. దీంతో మొత్తంగా జీతం ఎంత పెరిగిందో తెలుసుకునే వీలుంది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళనలు విరమించాలి. సాధారణ పరిస్థితుల్లో రాష్ట్ర ఆదాయం రూ.62000 కోట్ల మేర ఉండాలి. ఏటా 15 శాతం మేర ఆదాయం పెరగాలి. కానీ గత రెండేళ్లుగా రూ.15000 కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల మేర ఆదాయం కోల్పోయాం. అయినప్పటికీ 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాం. దీనివల్ల లక్ష రూపాయలు జీతం తీసుకునే ఉద్యోగికి రెండేళ్లలో 24 లక్షల రూపాయల జీతం అదనంగా రావడం సహా .. గ్యాట్యుటీ  వంటి అదనపు సదుపాయాలు దక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎంఐజీ ఇళ్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం రాయితీ కూడా లభించనుంది. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే’ అని తెలిపారు. ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ ఉద్ఘాటించారు. అందుకే డీడీవోలు, ఎస్‌సీవోల సహకారంతో జీతాల చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే సుమారు 3,53,000 మంది పెన్షనర్లకు, 3,97,000 మంది శాశ్వత ఉద్యోగులకు సంబంధించిన జీతాల చెల్లింపునకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలోని 3,10,000 మంది గ్రామ వార్డు సచివాలయ  ఉద్యోగులకు, 1,75,000 మంది ఆశావర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్లు, మరో 96000 మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకూ జీతాలు చెల్లించామన్నారు. ఉద్యోగులకు జీతాలు పెరిగాయంటూ జీఏడీ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌  ద్వారా వెల్లడించారు. సమావేశంలో సమాచారం శాఖ కమిషనర్‌ టి.విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-02-02T08:20:28+05:30 IST