ఉత్తుత్తి బడ్జెట్‌!

ABN , First Publish Date - 2022-03-01T07:50:15+05:30 IST

మార్చి వస్తోంది. ఏటా అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నారు. కానీ ఆ అంకెలకు ఏమైనా విలువ ఉందా? బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం కేటాయింపులు చేస్తున్నారా...

ఉత్తుత్తి బడ్జెట్‌!

2022-23పై వైసీపీ సర్కారు కసరత్తు 

శాఖల వారీగా మొక్కుబడి సమావేశాలు 

పేరుకే చర్చలు.. ప్రతిపాదనలకు చోటు లేదు

ఆర్థిక శాఖలోని ఇద్దరు సెక్రటరీలే కీలకం  

ఉద్యోగులను పక్కనపెట్టి కన్సల్టెంట్లతో ప్రక్రియ

‘అంకె’ కోసం ఇష్టమొచ్చినట్టుగా ప్రతిపాదనలు

మూడేళ్లుగా ఇదే తంతు.. ఆనవాయితీకి భిన్నం 

కాంట్రాక్టర్లకు 1.50 లక్షల కోట్ల బకాయిలు

తాజా బడ్జెట్‌లోనూ కేటాయింపులు డౌటే


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

మార్చి వస్తోంది. ఏటా అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్నారు. కానీ ఆ అంకెలకు ఏమైనా విలువ ఉందా? బడ్జెట్‌ ప్రతిపాదనల ప్రకారం కేటాయింపులు చేస్తున్నారా? చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తున్నారా? అంటే.. బడ్జెట్‌పై వైసీపీ సర్కారుకు ఏమాత్రం గౌరవం లేదనే విమర్శలు వస్తున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్‌ పెట్టిన మరుసటి రోజు నుంచే కొత్త ప్రతిపాదనలు తెరపైకి వస్తాయి. అసెంబ్లీ ఆమోదం లేకుండానే నిధులు కేటాయిస్తున్నారు. మూడేళ్లుగా ఇదే తంతు జరుగుతోంది. ఇప్పుడు పెట్టబోయే బడ్జెట్‌ కూడా ఇదే రీతిలో ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో ప్రతిపాదించిన బిల్లులు చెల్లించకుండానే మరో కొత్త బడ్జెట్‌ గారడీకి ఆర్థిక శాఖ సిద్ధమవుతోంది. శాఖల వారీగా మొక్కుబడి సమావేశాలు నిర్వహించడం తప్ప వారు చేసే ప్రతిపాదనలకు చోటు ఉండదనే విమర్శలు వస్తున్నాయి.


ఆర్థిక శాఖలోని ఇద్దరు సెక్రటరీలే మొత్తం తతంగం నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆనవాయితీ ప్రకారం బడ్జెట్‌ పెట్టాలని ఆర్థిక శాఖ.. తప్పనిసరి కాబట్టి ఇతర శాఖలు మొక్కుబడిగా బడ్జెట్‌కు సంబంధించిన ఉత్తుత్తి కసరత్తులో పాల్గొంటున్నాయి. ప్రభుత్వం ఇష్టారీతిన నిధులు వాడుకుంటున్నప్పుడు తాము ప్రతిపాదనలు ఇవ్వడం ఎందుకనే ధోరణిలో వివిధ శాఖల అధికారులు ఉంటున్నారు. కేవలం హాజ రు కోసం బడ్జెట్‌ సమావేశాలకు వస్తున్నారు. 


2 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్‌!

అసెంబ్లీలో బడ్జెట్‌ ఆమోదం పొందిన తర్వాత అందులో లేని ప్రతిపాదనలకు కోట్లాది నిధులు కేటాయించడం వైసీపీ ప్రభుత్వానికి   అలవాటుగా మారుతోంది. అసెంబ్లీ ఆమోదం లేకుండా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాటికి నిధులు కేటాయిస్తున్నారు. ఆర్థిక శాఖలోని ఇద్దరు అధికారులు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 205(1)(ఏ)కి విరుద్ధంగా ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఈ ప్రతిపాదనలకు పని పూర్తయ్యాక బిల్లులు చెల్లిస్తారా అంటే అదీ లేదు. బాధితులు కోర్టును ఆశ్రయించాక ఎంతో కొంత చెల్లిస్తారు. మూడేళ్లుగా రాష్ట్రంలో ఇదే తంతు జరుగుతోంది. పెండింగ్‌ బిల్లులకు, వెయిటింగ్‌ ఫర్‌ ఫండ్‌ క్లియరెన్సు బిల్లులకు పైసా కూడా కేటాయించకుండా, కనీసం వాటిని వచ్చే ఆర్థిక సంవత్సరంలోకి కొనసాగించకుండా మరో రూ.2 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్‌కు ఆర్థిక శాఖ సమాయత్తమవుతోంది. ఆర్టికల్‌ 205(1)(ఏ) ప్రకారం బడ్జెట్‌లో లేని అంశాలకు నిధులు కేటాయించాలంటే మొదట అసెంబ్లీ దృష్టికి తీసుకురావాలి. అంటే చట్టసభల ఆమోదం లేకుండా ప్రభుత్వం పైసా ఖర్చు చేయకూడదు. వరదలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రం ఆర్టికల్‌ 205(1)(బీ) ప్రకారం రాజ్యాంగం మినహాయింపునిచ్చింది.  ప్రభుత్వం దీరిని అడ్డం పెట్టుకుని బడ్జెట్‌లో లేని ప్రతిపాదనలకు నిత్యం కేటాయింపులు జరుపుతోంది.   


1.50 లక్షల కోట్ల పెండింగ్‌ బిల్లులు

వైసీపీ ప్రవేశపెట్టిన గత 3 బడ్జెట్ల తాలూకు పెండింగ్‌ బకాయిలు లక్షా 50 వేల కోట్లున్నాయి. ప్రస్తుతం ఏపీ వార్షిక ఆదాయం, జీఎస్డీపీ ప్రకారం వచ్చే అప్పులకు ఇవి సమానం. అంటే రాష్ట్ర బడ్జెట్‌ రూ 1,50,000 కోట్లకు దాటకూడదు. కానీ, ప్రభుత్వం గత రెండేళ్లుగా రూ.2.25 లక్షల కోట్ల పైచిలుకు బడ్జెట్లు ప్రవేశ పెడుతోంది. ఆర్థిక సంవత్సరం ముగింపునకు నెలన్నర ముందుగానే బిల్లుల సైటును మూసేసింది. పెండింగ్‌ బిల్లులను కనీసం వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొనసాగిస్తుందన్న ఆశలు లేవని బిల్లు బాధితులు చెబుతున్నారు.  

గతంలో ఇలా.. 

గత ప్రభుత్వాలు బడ్జెట్‌ను పక్కాగా రాష్ట్ర అవసరాల మేరకు రూపొందించేవి. శాఖల వారీగా సమావేశమై బడ్జెట్‌ ప్రతిపాదనల గురించి చర్చించేవారు. ఈ సమావేశాలు రెండు దశల్లో జరిగేవి. ప్రతిపాదనలు ఓ కొలిక్కి వచ్చాక ఆర్థిక శాఖ మంత్రితో ఆయా శాఖల మంత్రులు విడివిడిగా సమావేశమై వాటిపై చర్చించేవారు. మంత్రుల సమావేశంలో నిర్ణయించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను దాదాపుగా మార్చేవారు కాదు. బడ్జెట్‌ పరిమాణం పెరుగుతుందని భావిం చి, నిధులు సమకూర్చలేని పరిస్థితుల్లో... సీఎంతో ఆర్థిక మంత్రి, కార్యదర్శులు సమావేశమై చర్చించి, ఆయన ఆదేశాలతో ప్రతిపాదనలకు కోత పెట్టేవారు. వాటిని సవరించి బడ్జెట్‌ను ఖరారు చేసేవారు. 


ఇప్పుడు ఇలా..   

వైసీపీ సర్కారులో పేరుకు మాత్రం శాఖల వారీగా బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ కొత్త ప్రతిపాదనలకు చోటు ఉండ దు. సరఫరాదారులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని, వస్తువులు సరఫరా చేయడానికి నిరాకరిస్తున్నారంటూ వివిధ శాఖల అధికారులు చెప్పడం.. త్వరలో బిల్లులు ఇస్తామని, వాళ్లను ఒప్పించి సరఫరా ఆగకుండా చూడాలని ఆర్థిక శాఖ అధికారులు చెప్పడం మినహా ఆ సమావేశాల్లో చర్చించేదేమీ లేదని తెలుస్తోంది. ఈ సమావేశాలు మొక్కుబడిగా ముగిశాక ఆర్థిక శాఖ సెక్రటరీలు ఇద్దరు, వారి వెనుక ల్యాప్‌టా్‌పలు పట్టుకుని తిరిగే ఇద్దరు కన్సల్టెంట్లు మా త్రమే బడ్జెట్‌ తయారీ ప్రక్రియలో పాల్గొంటారని, గత మూడేళ్లుగా ఇదే తంతు జరుగుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఆ ఇద్దరు సెక్రటరీలు అనుకున్నవిధంగా బడ్జెట్‌లో అంకెల గారడీకి సరిపోయే లా అంకెలు మార్చేందుకు ప్రైవేటు కన్సల్టెంట్లపై ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. సంవత్సరాలుగా బడ్జెట్‌ తయారీలో అనుభవమున్న ఉద్యోగులను దరిదాపులకు కూడా రానివ్వడం లేదు. 

Updated Date - 2022-03-01T07:50:15+05:30 IST