కేంద్ర పథకాలు ఎత్తేద్దాం!

ABN , First Publish Date - 2022-03-02T07:36:30+05:30 IST

అప్పులే తప్ప అభివృద్ధి ఎరుగని సర్కారు... రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను వదులుకోవడానికి సిద్ధమవుతోంది.......

కేంద్ర పథకాలు ఎత్తేద్దాం!

తమ వాటా నిధులు ఇవ్వలేని అసహాయత

కేంద్ర నిధులు మళ్లించే అవకాశంలేక ‘నిరాశ’

130 కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు

ఏటా రూ.20 వేల కోట్ల వరకు గ్రాంటు

మొత్తం మళ్లిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం

నిబంధనలు కఠిన తరం చేసిన కేంద్రం

ప్రతి పథకానికీ ఖాతా తెరవాల్సిందే

రాష్ట్ర నిధులు పడ్డాకే పథకం అమలు

షరతులతో సర్కారు చేతికి సంకెళ్లు

పథకాలు వదులుకునేందుకు సిద్ధం

మిగిలేది ఐదారు పథకాలు మాత్రమే!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అప్పులే తప్ప అభివృద్ధి ఎరుగని సర్కారు... రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను వదులుకోవడానికి సిద్ధమవుతోంది. కేవలం తన వంతు వాటా నిధులు (మ్యాచింగ్‌ గ్రాంట్‌) చెల్లించే పరిస్థితిలేక చేతులు ఎత్తేస్తోంది. ఇన్నాళ్లూ కేంద్రం విడుదల చేసిన నిధులను ఇతర అవసరాలకు మళ్లిస్తూ... ఇక అది కుదరదని తెలిసి సుమారు రూ.15 వేల కోట్లు వదులుకుంటోంది. వివిధ పథకాల కింద కేంద్రం రాష్ట్రానికి ఏటా రూ.20 వేల కోట్లు గ్రాంటు ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.12వేల కోట్లు ఖర్చు చేసి ఆయా పథకాలను అమలు చేయాలి. కానీ... కేంద్ర నిధుల మళ్లింపునకు అలవాటుపడ్డ జగనన్న ప్రభుత్వం.. తన వాటా నిధులను విడుదల చేయడంలేదు. దీనిపై కేంద్రానికి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో కేంద్రం కొన్ని కఠినమైన షరతులు విధించింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పథకానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని, లాగిన్‌ వివరాలు తమకూ ఇవ్వాలని స్పష్టం చేసింది. రాష్ట్రం తన మ్యాచింగ్‌ గ్రాంటు మొత్తాన్ని అదే ఖాతాలో జమ చేసి... సంబంధిత పథకాన్ని నిక్కచ్చిగా అమలు చేయాలని ఆదేశించింది.


దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి దిక్కు తోచలేదు. అప్పులకోసం రకరకాల గిమ్మిక్కులు చేసినట్లుగానే.. మ్యాచింగ్‌ గ్రాంటు విషయంలోనూ ఒక మాయ చేయాలనుకుంది. ఎస్‌బీఐలో ఖాతాలు తెరిచి... కేంద్ర వాటా నిధులు అందులో జమ చేస్తామని, రాష్ట్ర మ్యాచింగ్‌ గ్రాంటును మాత్రం ఓడీ రూపంలో అప్పుగా బ్యాంకే సమకూర్చాలని కోరింది. దీనికి ఎస్‌బీఐ ససేమిరా అంది. దీంతో... ప్రభుత్వం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను ఆశ్రయించింది. ఈ బ్యాంకు కూడా ఓడీ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు. కానీ 130 కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి 130 సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ బ్యాంకు ఖాతాలు తెరిచారు. విజయవాడలోని రింగురోడ్డు యూనియన్‌ బ్యాంకు బ్రాంచ్‌లో గత సెప్టెంబరు నుంచి ఈ ఖాతాలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్రం తన పథకాలకు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ రాష్ట్ర మాత్రం ఆ బ్యాంకు ఖాతాల్లో తన వాటా నిధులు జమ చేయడం లేదు. ఖాతాల లాగిన్‌ వివరాలు కేంద్రం వద్ద కూడా ఉండడంతో బ్యాంకులో నిధులు జమ అవుతున్నాయో, లేదో ఎప్పటికప్పుడు కేంద్ర అధికారులు తెలుసుకుంటున్నారు. సెప్టెంబరు నుంచి ఇప్పటిదాకా చూసీ చూడనట్లుగా వదిలేశారు. ఇప్పుడు... ‘మీ వాటా నిధులు జమ చేస్తారా... లేదా’ అని కేంద్ర అధికారులు పీకలమీద కూర్చున్నారు. 


వదిలేసుకుందాం... 

మ్యాచింగ్‌ గ్రాంట్‌ మొత్తం సమకూర్చలేని సర్కారు కేంద్ర పథకాలనే వదులుకునేందుకు సిద్ధమైంది. 130 కేంద్ర పథకాలు అన్నీ కాకుండా... రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా భావిస్తూ అమలుచేస్తున్న వాటితో సరిపోలే పథకాలకు మాత్రమే తన వాటా నిధులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. మిగిలిన కేంద్ర పథకాలను వదులుకోవాలని తీర్మానించింది. ఆ 130 పథకాల్లో రాష్ట్రంలో అమలయ్యే ప్రముఖ పథకాలతో సరిపోయేవి ఐదారు మాత్రమే ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వాటికి కేంద్రం నుంచి రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లు అందుతాయని తెలుస్తోంది. అంటే... ఏటా రూ.15వేల కోట్ల కేంద్ర నిధులను వదులుకున్నట్లే!


అన్ని శాఖలు తమ పరిధిలో అమలయ్యే కేంద్ర ప్రభుత్వ పథకాలు, అందులో ఏయే పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రముఖ పథకాలతో సరిపోలుతున్నాయో చూసి శుక్రవారానికల్లా  నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సొంతంగా ఢిల్లీకి ప్రతిపాదనలు పంపకూడదని స్పష్టం చేసింది. కాగా.. 130 కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రాష్ట్రంలో వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం వాటిని ఎత్తేస్తే ఆ ఉద్యోగుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతు...

Updated Date - 2022-03-02T07:36:30+05:30 IST