రాజధానిపై రచ్చ ఎందుకు?

ABN , First Publish Date - 2022-03-09T08:07:12+05:30 IST

అమరావతిపై హైకోర్టు చెప్పిందేమిటి? సర్కారు వారు సాగిస్తున్న ‘గోబెల్స్‌’ ప్రచారం ఏమిటి? రైతుల విషయంలో న్యాయ, చట్ట, శాసన, రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు జరిగాయని 300....

రాజధానిపై రచ్చ ఎందుకు?

పార్లమెంటులో చేసిన చట్టం అమల్లో ఉండగా, అదే అంశంపై పోటీగా అసెంబ్లీలో చట్టం చేయాలని పాలక పెద్దలు కోరుకుంటున్నారా? అలాగైతే... అసెంబ్లీ చేసే చట్టాలను జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లు మార్చుకునేందుకు అనుమతిస్తారా?

‘రాజధాని రైతులకు న్యాయం చేస్తాం!’... అని ప్రభుత్వ పెద్దలు పదేపదే చెబుతున్నారు. ‘మాకు ఇచ్చిన మాట ప్రకారం... మాస్టర్‌ ప్లాన్‌ను యథాతథంగా అమలు చేస్తేనే న్యాయం జరుగుతుంది!’ అని రైతులు స్పష్టం చేస్తున్నారు! రైతులు ఇచ్చిన భూములను ఇప్పుడు యథాతథంగా తిరిగి ఇవ్వడం అసాధ్యం. వాటి స్వరూప స్వభావాలు మారిపోయాయి. మరి... రాజధాని నిర్మిస్తారా? లేక... పరిహారం చెల్లిస్తారా? ప్రభుత్వం చేసే ‘న్యాయం’ ఏమిటి?


అమరావతిపై తప్పుదారి పట్టించడమే లక్ష్యమా?

హైకోర్టు తీర్పునకు వక్రభాష్యాలతో సిద్ధం

ఈసారి శాసనసభ వేదికగానే ‘యుద్ధం’

‘శాసనాధికారం’పై హైకోర్టు పూర్తి వివరణ

‘ఒకే రాజధాని’పై విభజన చట్టంలో స్పష్టత

పార్లమెంటు చట్టానికి పోటీగా ఇక్కడ కుదరదు

సభలో బలం ఉందని ఇష్టారాజ్యం ఒప్పుకోం

రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమైతే జోక్యం

రాజ్యాంగ అధికరణలు, సుప్రీం తీర్పులను

ఉటంకిస్తూ హైకోర్టు విస్పష్ట తీర్పు

అయినా.. వైసీపీ పెద్దల అడ్డగోలు వాదన


అమరావతిపై హైకోర్టు చెప్పిందేమిటి? సర్కారు వారు సాగిస్తున్న ‘గోబెల్స్‌’ ప్రచారం ఏమిటి? రైతుల విషయంలో న్యాయ, చట్ట, శాసన, రాజ్యాంగపరమైన ఉల్లంఘనలు జరిగాయని 300 పేజీల తీర్పులో హైకోర్టు సవివరంగా పేర్కొంది. వీటన్నింటినీ వదిలేసి... ‘రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటారా!’ అని సర్కారు పెద్దలు తెగ ఆవేశ పడిపోతున్నారు. తీర్పునకు వక్రభాష్యం చెబుతూ... అసెంబ్లీ వేదికగా ‘చర్చ’కు సిద్ధమయ్యారు. అసలు కోర్టు చెప్పిందేమిటి, సర్కారు ఇస్తున్న వక్రీకరణ ఏమిటి? న్యాయ వ్యవస్థపై సోషల్‌ మీడియా వేదికగా దొంగచాటుగా దాడులు చేస్తున్న వైసీపీ.. ఇప్పుడు ఈ  తీర్పును ఎలా ఉపయోగించుకుంటోంది? ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న సవివర కథనం...


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభ ద్వారా చట్టాలు చేసే అధికారం లేదా? ‘లేదు’ అని హైకోర్టు చెప్పిందా? వైసీపీ నేతలు, పెద్దలను అడిగితే... ‘ఔను! ఇది ఘోరాతి ఘోరం! చట్టాలు అసెంబ్లీలో కాకుండా... కోర్టులో చేస్తారా? దీనిపై అసెంబ్లీలో చర్చించాల్సిందే’ అని ఆవేశపడుతున్నారు. నిజానికి... హైకోర్టు చెప్పింది వేరు! అమరావతి విషయంలో రాష్ట్రానికి శాసనాధికారం లేదని మాత్రమే హైకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు గల ప్రత్యేక కారణాలనూ వివరించింది. అంతేతప్ప... అసలు ఏ చట్టాలూ చేయకూడదని పేర్కొనలేదు. రాజ్యాంగ మౌలిక సూత్రాలు, ప్రాథమిక లక్ష్యాలు, హక్కులు, పార్లమెంటు చేసిన చట్టాల ప్రస్తావన తీసుకొచ్చి ఎవరి పరిధిలో ఏ చట్టం చేయాలి? ఎవరికి ఏ అధికారం ఉందో వివరించింది.  రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులు, 3రాజధానుల కేసుల్లో హైకోర్టు వెలువరించిన పలు తీర్పుల్లో రెండు కీలకమైన అంశాలను వెల్లడించింది. అందులో ఒకటి... పార్లమెంట్‌ చేసిన చట్టాలను మార్చకుండా, దానికి పూర్తి భిన్నమైన పద్ధతిలో మూడు రాజధానులు తీసుకురావడం! రెండు... పౌరుల ప్రాథమిక హక్కులకు సర్కారే తన చర్యల ద్వారా భంగం కలిగించడం. వాటిని వివరంగా పరిశీలిస్తే... 


ఎందుకీ వక్రభాష్యాలు

అమరావతి కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ‘బెంచ్‌ హంటింగ్‌’ (ధర్మాసనంలో ఫలానా జడ్జిలు ఉండొద్దని పిటిషన్లు వేయడం)కు పాల్పడిందని హైకోర్టు పేర్కొంది. ‘సిన్సియర్‌’, సీనియర్‌ మోస్ట్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి ఈ పిటిషన్‌ దాఖలు చేశారని చురకలు అంటిస్తూ... దానిని కొట్టివేసింది. ఈ పిటిషన్లపై విచారణ సవ్యంగా ముందుకు సాగకుండా బెంచ్‌ హంటింగ్‌కు పాల్పడటం, జడ్జిలను అభద్రతాభావానికి గురిచేసే వ్యాఖ్యానాలు చేయడం వంటివి జరిగాయని పరోక్షంగా చెబుతూ... వాటిని తాము పట్టించుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలోనూ... తమకు నచ్చని తీర్పులు రాగానే న్యాయమూర్తులను సోషల్‌ మీడియా వేదిక దూషించడం, కొందరు ప్రజా ప్రతినిధులు బహిరంగంగానే అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక... అమరావతి తీర్పుపైనా వైసీపీ నేతలు ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు... ఏకంగా శాసనసభ వేదికపైనే హైకోర్టు తీర్పుపై చర్చిస్తామంటున్నారు. ఇది కూడా ఒకరకంగా న్యాయ వ్యవస్థను ‘బ్లాక్‌ మెయిల్‌’ చేయడమేనని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.  


ఎవరి పరిధి 

ఏమిటో సుస్పష్టం

ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పరిధులు ఏమిటో స్పష్టంగా ఉన్నాయి. అయినా... నచ్చని తీర్పులు వచ్చినప్పుడు, తప్పులను ఎత్తిచూపినప్పుడల్లా ఎవరి పరిధి ఏమిటో తేల్చాలన్న డిమాండ్లు తలెత్తుతున్నాయి. కేంద్రమైనా, రాష్ట్రమైనా రాజ్యాంగానికి లోబడాల్సిందే. కోర్టు తీర్పులను గౌరవించాల్సిందే. వ్యక్తుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయి. 


అమరావతి ఎందుకు ‘స్పెషల్‌’?

ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలో ఎంపిక చేసుకునే అధికారం రాష్ట్రానికి ఉందని హైకోర్టు చెప్పింది. అయితే, ఏపీకి ఒకే రాజధాని ఉండాలని పార్లమెంట్‌ ఏపీ పునర్విభజన చట్టం ఆమోదించాక, మేం మూడు రాజధానులు తీసుకొస్తామంటూ రాష్ట్ర శాసనసభ చట్టం చేయజాలదని స్పష్టం చేసింది. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని మార్చాలంటే తిరిగి అక్కడికే వెళ్లాలని, ఈ విషయంపై  శాసనసభలో చట్టాలు చేయకూడదని రాజ్యాంగ నిబంధనలను గుర్తు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో ఏపీకి ఒకటే రాజధాని ఉంటుందనేలా ‘ది క్యాపిటల్‌’ అనే పదం వాడారు’ అని పేర్కొంది. ‘‘పార్లమెంటు ఆమోదించిన పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6లో పేర్కొన్న ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణకు హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి  రాజధానిగా ఉంటుంది. ఆ కాలపరిమితి దాటాక సబ్‌సెక్షన్‌ (1)లో చెప్పినట్లుగా హైదరాబాద్‌ తెలంగాణకే రాజధానిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త రాజధాని ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌కు ఒక కొత్త రాజధాని (ది క్యాపిటల్‌) ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి.


సెక్షన్‌ 94(3)లోని ప్రకారం ఏపీలో ఏర్పాటు చేసే కొత్త రాజధానిలో (ది క్యాపిటల్‌)  కనీస వసతులు రాజ్‌భవన్‌,  హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, మండలి, ఇతర తప్పనిసరి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రమే ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలి. ఇదే చట్టంలోని 13వ షెడ్యూల్‌లోని 11వ క్లాజులో పేర్కొన్న దాని ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌కు ఏర్పాటు చేసే రాజధాని (ది క్యాపిటల్‌) నుంచి హైదరాబాద్‌తోపాటు, తెలంగాణలోని ఇతర ముఖ్య నగరాలకు రాపిడ్‌ రైలు, రోడ్డు మార్గాలను ఏర్పాటు చేయాలి’’ అని ఉన్నట్లు విశదీకరించింది. ‘శ్రీ ఇషార్‌ అల్లాయ్‌ స్టీల్‌ లిమిటెడ్‌ వర్సెస్‌ జైస్వాల్‌ నెకో లిమిటెడ్‌’ కేసులో  సుప్రీం కోర్టు చెప్పిన దాని ప్రకారం... ప్రత్యేకించి, నిర్దిష్టమైన అంశాన్ని చెప్పడానికి నామవాచకాల (నౌన్స్‌) ముందు ‘ది’ అనేది ఉపయోగించారు. దాని పరమార్థం  అది ఒక్కదాని గురించి చెప్పిన ట్లే.  ‘ది క్యాపిటల్‌’ అని పార్లమెంటు చేసిన విభజన చట్టంలో స్పష్టంగా చెప్పినందున... ఆంధ్రప్రదేశ్‌కు ఒకే రాజధాని ఉండాలని, మూడు ముక్కలాట కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ‘3 రాజధానులు’ పెట్టాలనుకుంటే... ముందు పార్లమెంటులో విభజన చట్టాన్ని సవరించాలని.. సవరించే అధికారం రాష్ట్రానికి లేదని స్పష్టం చేసింది. అంతేతప్ప... వైసీపీ పెద్దలు చెబుతున్నట్లుగా, చట్టాలు చేసే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు చెప్పలేదు. విభజన చట్టం ఆధారంగానే కేంద్రం శివరామకృష్ణన్‌ కమిటీని ఏర్పాటు  చేసింది.  కేంద్రం కూడా అమరావతే రాజధాని అని ప్రకటించింది. ‘‘విభజన చట్టం చాలా స్పష్టంగా ఉంది. అలాంటప్పుడు అందులోని నిబంధనలు వివరించడానికి కోర్టులు వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు’’ అని ధర్మాసనం పేర్కొంది. 


ఇది ‘సుప్రీం’ మాట

‘అధికారంలో బలంగా ఉన్నాం. మూడు రాజధానులపై ముందుకే వెళతాం. పకడ్బందీగా చట్టం తెస్తాం’ అని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. కానీ... చట్టసభలో బలం ఉందంటూ ఇష్టారీతిన చట్టాలు చేస్తే ఊరుకోబోమని సుప్రీంకోర్టు ఎప్పుడో చెప్పింది. ‘‘చట్టసభలో బలం ఉందని ఇష్టారీతిన చట్టాలు చేస్తూ...  ప్రాథమిక హక్కులు, రాజ్యాంగం స్వతంత్ర, లక్ష్యాలు దెబ్బతీస్తామంటే ఊరుకోం. రాజ్యాంగమే సర్వోన్నతం! దానికి లోబడే చట్టాలు, నిబంధనలు ఉండాలి’’ అని కేశవానంద భారతి వర్సెస్‌ కేరళ ప్రభుత్వం కేసులో స్పష్టంగా చెప్పింది.   అప్పట్లో కేరళ సర్కారు భూసంస్కరణల చట్టం తీసుకొచ్చింది. ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘‘భూ సంస్కరణలు మంచివే. కానీ, ఎవరికి ఎంత భూమి ఉండాలి? పరిమితి ఎంతో రాజ్యాంగంలో పేర్కొనలేదు. భూమి అనేది ఆస్తి. సర్కారు తీసుకొచ్చిన చట్టం రైతుల ప్రాథమిక హక్కులను దెబ్బతీసేలా ఉంది’’ అని కేరళ చట్టాన్ని కొట్టివేసింది. 13 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఒక కేసును విచారించి తీర్పు ఇవ్వడం దేశ చరిత్రలో అదే ప్రథమం. ఈ కేసులో 9 మంది మెజారిటీ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు తర్వాత రాజ్యాంగ సవరణ చేసి భూ సంస్కరణలు అమలు చేసేలా చట్టాలు తీసుకొచ్చారు. అంతకుముందు... భారత తొలి ప్రధాని నెహ్రూకూ ఇదే అనుభవం ఎదురైంది. ఆయన హయాంలో చేసిన భూ సంస్కరణల చట్టం ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని సుప్రీం కోర్టు నిలిపివేసింది. ‘అమరావతిపై రాష్ట్రానికి శాసనాధికారం లేదు’ అని హైకోర్టు చెప్పడం వెనుక ఇంత నేపథ్యం ఉంది. అంతేతప్ప ఇది ఆషామాషీగా ఇచ్చిన తీర్పు కాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.


హక్కుల మాటేమిటి?

అమరావతి అంశం 30వేల మందికిపైగా రైతుల ప్రాథమిక హక్కులతో ముడిపడి ఉంది. ఈ అంశంపై హైకోర్టు తన తీర్పులో సవివరంగా చర్చించింది. ‘మీరిచ్చే భూముల్లో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తాం. దీనివల్ల మీకు ఇచ్చే ప్లాట్లకు ధరలు బాగా పెరుగుతాయి’’ అని ప్రభుత్వం చట్టబద్ధమైన ‘గ్యారంటీ’ ఇచ్చింది. దీనిని నమ్మి... రైతులు తరతరాలుగా తమకు తిండి పెడుతున్న భూములను రాజధానికి అప్పగించారు. అంటే... జీవనోపాధిని కోల్పోయారు. ప్రభుత్వం తాను ఇచ్చిన మాట ప్రకారం... అక్కడ రాజధాని నిర్మించాలి. అభివృద్ధి చేయాలి. లేదంటే... రైతుల ‘జీవించే హక్కు’ను హరించినట్లే! ‘ఆస్తి హక్కు’నూ లాక్కున్నట్లే! అని స్పష్టం చేసింది. ‘‘ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌లో భాగంగా రాజధాని కోసం  రైతులు ఇచ్చిన భూములను ఒప్పందంలో (ఫామ్‌ 9.14లో)  పొందుపరిచినట్లుగా అభివృద్ధి చేయకపోవడం వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లే. వ్యవసాయంపైనే ఆధారపడ్డ రైతులు రాజధానికోసం పంట భూములిచ్చాక వాటిని  అభివృద్ధి చేయకపోవడం, ఇటు వ్యవసాయం లేకపోవడంతో తమ జీవ నోపాధిని కూడా కోల్పోయారు. కాబట్టి... ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 (జీవించే హక్కు), ఆర్టికల్‌ 330ఏ (ఆస్తి హక్కు)లను ఉల్లంఘించింది’’ అని హైకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి... తుకారామ్‌ కానా జోషి వర్సెస్‌ ఎంఐడీసీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది.

Updated Date - 2022-03-09T08:07:12+05:30 IST