కొలువుల్లేవ్ కొతలే!

ABN , First Publish Date - 2022-03-10T08:05:54+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014లో 11వేలు, 2018లో 7900 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేశారు....

కొలువుల్లేవ్ కొతలే!

తెలంగాణలో జోష్‌.. సీమాంధ్రలో తుస్‌

ఏటా 6500 పోలీసు ఉద్యోగాలు ఇస్తాం

జనవరి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తాం

మేం వస్తే... మెగా డీఎస్సీలే వేస్తాం

నిరుద్యోగుల్ని ఊరించి జగన్‌ అధికారంలోకి

మూడేళ్లయినా ఒక్క ఉద్యోగమూ లేదు

వేలలో రిటైర్‌ అవుతున్నా జరగని భర్తీ 

బడుల విలీనం.. ప్రపంచ బ్యాంకు షరతులు

ఇక ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మంగళమే!

3 ఏళ్లుగా నోటిఫికేషన్లకై ఎదురుచూపులే

వయోపరిమితి ముగిసి శాశ్వత ‘నిరుద్యోగం’


తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2014లో 11వేలు, 2018లో 7900 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేశారు. కానీ... ‘అంతేనా! ఆ మాత్రమేనా! మేం వచ్చాక మెగా డీఎస్సీ ప్రకటిస్తాం’ అని జగన్‌ చెప్పారు. కానీ... ఇప్పటిదాకా నో డీఎస్సీ! ఇకపైనా... నో డీఎస్సీ!


రాష్ట్రంలో దాదాపు 30లక్షల మందికిపైగా నిరుద్యోగులున్నారు. కాలం గడిచిపోతుండటంతో అనేక మందికి వయోపరిమితి దాటిపోతోంది. మూడేళ్లుగా ఎదురు చూపులే... తప్ప నోటిఫికేషన్లు లేవు!


తెలంగాణ ప్రభుత్వం 80,039 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేసింది. అక్కడి నిరుద్యోగ యువతకు తీపి కబురు వినిపించింది.  ఈ వార్త విన్న తర్వాత... ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. అదే సమయంలో... మన సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి జగన్‌ ముద్దుముద్దుగా... మురిపించేలా చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘మాట తప్పం. మడమ తిప్పం’... ఇది వైసీపీ వాళ్లు గొప్పగా చెప్పుకొనే మాట! చేతల్లోకి వచ్చేసరికి... అంతా రివర్స్‌! ఎన్నికల ముందు ఉద్యోగ నియామకాలపై ఎన్నెన్నో మాటలు చెప్పారు. నిరుద్యోగ యువతను ఊరించారు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వెయ్యి రోజులైంది. కానీ... నియామకాల ఊసే లేదు. ‘‘దేవుడి దయ వల్ల మేం అధికారంలోకి వస్తే... ఇప్పటికే ఖాళీగా ఉన్న 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, రిటైర్‌మెంట్‌తో ఖాళీ కాబోతున్న 90వేల ఉద్యోగాలు... కలిపి 2.32లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం’’... ఇది ముఖ్యమంత్రి కాకముందు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట! అప్పటికే 23వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్క తేల్చారు.


‘‘23వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే... ఈ పెద్దమనిషి చంద్రబాబు నోటిఫికేషన్‌ ఇచ్చిందెంత?  కేవలం 7,900 ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారు’’ అని నాటి సర్కారుపై విరుచుకుపడ్డారు. దేవుడి దయవల్ల అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ పెడతామని హామీ ఇచ్చారు. అంతేకాదు... పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏటా 6,500 కానిస్టేబుళ్ల పోస్టులను భర్తీ చేస్తామన్నారు. విపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని మాటలు చెప్పారు! అధికారంలోకి వచ్చాక జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామన్నారు. ‘‘ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడా ఖాళీ లేకుండా భర్తీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఉద్యోగాలు రానివాళ్లు ఎవరైనా ఉంటే బాధపడొద్దు. జనవరి అనేది ఎంతో దూరంలో లేదు. ఒక జనవరి పోతే మళ్లీ జనవరి వస్తుంది. ఆ తర్వాత ఏడాది మళ్లీ జనవరి వస్తుందని గుర్తుపెట్టుకోమని మాత్రం చెబుతున్నాం’’ అని సీఎం హోదాలో ప్రకటించారు. నిజమే! జగన్‌ అధికారంలోకి వచ్చి... వెయ్యి రోజులైంది. మూడు జనవరులు వచ్చి... పోయాయి! కానీ... విపక్ష నేత హోదాలో, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ చెప్పిన తియ్యటి మాటలు... మాటలుగానే మిగిలిపోయాయి. చేతల్లేవ్‌! కొలువుల్లేవ్‌! వలంటీర్లు, సచివాలయ పోస్టులు మినహా ఇతర నియామకాలు దాదాపుగా శూన్యం! అదే తమ గొప్పగా చెప్పుకోవడం తప్పితే... ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లే లేవు!


మాటలతో నమ్మించి... 

లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగులు విపక్ష నేతగా జగన్‌ చెప్పిన మాటలను నమ్మారు. కానీ... ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం వైపు నుంచి కార్యాచరణే లేదు. పదవీ విరమణలతో  ఖాళీ అవుతున్న ఉద్యోగాల్లో ఒక్కటీ భర్తీ చేయలేదు. ఏవో అరకొరగా అప్పుడప్పుడు మొక్కుబడిగా కొన్ని పోస్టులకు నోటిఫికేషన్లు వేయడం తప్ప... ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనల అమలు ప్రస్తావనే లేదు. మరోవైపు ఉద్యోగాల ప్రకటనలు లేక... వయోపరిమితి దాటిపోతూ శాశ్వతంగా నిరుద్యోగులవుతున్నారు. 


అసెంబ్లీ ముట్టడే... 

ఈ సమావేశాల్లోనే ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేయాలని.. లేని పక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిక్‌ పేర్కొన్నారు. జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగాల భర్తీ చేయాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ చిత్రానికి పాలాభిషేకం చేశారు.


అన్నిటిపైనా మడమ తిప్పుడే!

జగన్‌ విపక్షంలో ఉండగా చెప్పిన ప్రకారమే... 1.42 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా యి. రిటైర్మెంట్ల వల్ల మరో 90వేల ఖాళీలు! అంటే... 2.32 లక్షల ఉద్యోగాలు! ఈ మూడేళ్లలో లక్షమంది వరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు పదవీ విరమణ చేసి ఉంటారని అంచనా. మరి... వీటిలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య వందల్లో కూడా లేదు. రెవెన్యూ శాఖలో 670 క్లర్క్‌ కమ్‌ కంప్యూటర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి గతంలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ప్రకటించింది. ఈ పోస్టులు కూడా గత ప్రభుత్వ హయాంలోనే గుర్తించి... భర్తీ కోసం ఆర్థిక శాఖ ఆమోదం తీసుకుని, ఎన్నికల కారణంగా ఆగిపోయినవే. మరోవైపు గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ జారీ చేసినా... అందులో చూపించిన ఖాళీల సంఖ్య చూసి నిరుద్యోగులు ఉసూరుమన్నారు. మరోవైపు... పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచి యువత ఆశలపై మరిన్ని నీళ్లు చల్లారు.


మెగా డీఎస్సీ ఎక్కడ?

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే... 2014లో 11వేల ఉపాధ్యాయ పోస్టులతో డీఎస్సీ వేశారు. ఆ తర్వాత 2018లో మరో 7,900 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. ‘అబ్బే అంతేనా! నేనొస్తే మెగా డీఎస్సీనే’ అని జగన్‌ ఊరించి అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతోంది. మెగాకాదుకదా... అసలు డీఎస్సీయే లేదు. ఆ సంగతి పక్కనపెడితే... మున్ముందు ఉపాధ్యాయ కొలువుల ఊసే లేకుండా ‘విలీన’ మాయలు మొదలుపెట్టారు. ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం, ప్రాథమిక పాఠశాలల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం, పోస్టుల రద్దుతో కొలువులకు కోత పెడుతున్నారు. మరోవైపు... జగన్‌ ప్రభుత్వం ‘సాల్ట్‌’ పథకం అమలుకు ప్రపంచబ్యాంకు నుంచి రూ.1875 కోట్లు రుణం తీసుకుంది. ‘ఇక ఉపాధ్యాయ కొలువుల భర్తీ ఉండదు’ అనే షరతుకు అంగీకరించి, రుణ ఒప్పందంపై సంతకం చేసింది. వెరసి... రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకే మంగళం పలికే దిశగా అడుగులు వేస్తున్నారు.

Updated Date - 2022-03-10T08:05:54+05:30 IST