మీ చెవిలో చెప్పిందెవరు?

ABN , First Publish Date - 2022-03-23T08:06:10+05:30 IST

పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చెవిలో చెప్పారా?.....

మీ చెవిలో చెప్పిందెవరు?

పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తున్నామని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చెవిలో చెప్పారా?... ఇది మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌ చేసిన వ్యంగ్య వ్యాఖ్య! మరి... 41.15 కాంటూరుతోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని ముఖ్యమంత్రి జగన్‌కు ఎవరైనా చెవిలో చెప్పారా? 45.72 కాంటూరు వరకు నిర్వాసితులకు పునరావాసం అమలు చేయకుండానే ప్రాజెక్టు కట్టవచ్చునని చెప్పారా? 41.15 కాంటూరు వరకు మాత్రమే పునరావాసం అమలు చేసి... మిగిలిన వాళ్లను ముంచేసినా ఫర్వాలేదని ఎవరైనా ఆయన చెవిలో గుసగుసలాడారా? పోలవరం ప్రాజెక్టుపై ఎందుకీ ఎత్తుగడలు?


పోలవరంపై చెల్లుబాటుకాని ‘ఎత్తు’గడలు

ఎత్తు తగ్గించం... అంటే 45.72 మీటర్లకు నీరు నిల్వ చేస్తారా?

41.15 కాంటూరు వరకే నిర్వాసితులకు పునరావాసం ఎందుకు?

పునరావాసం లేకుండానే 

‘పూర్తి స్థాయి’ పోలవరం సాధ్యమా?

అలా కూడా చేయొచ్చని 

జగన్‌ చెవిలో ఎవరు చెప్పారు?

కొత్తగా ఎత్తిపోతలను ఎందుకు తెరపైకి తెచ్చారు?

అసలు విషయం దాటేసి అసెంబ్లీలో వెకిలి మాటలు

తగ్గించేది ప్రాజెక్టు ఎత్తు కాదు.. నీటి నిల్వను

45.72 మీటర్ల నుంచి 41.15కు కుదింపు

నిర్వాసితుల తరలింపునకూ అదే ప్రాతిపదిక

అదే జరిగితే బ్యారేజీ స్థాయికి పోలవరం

గ్రావిటీ ద్వారా నీరు అందదు.. ఎత్తిపోతలే దిక్కు


(అమరావతి -  ఆంధ్రజ్యోతి) 

‘పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంగుళం కూడా తగ్గదు!’

‘41.15 మీటర్ల కాంటూరులోని నిర్వాసిత కుటుంబాలను తరలించే ప్రక్రియ చేపట్టాం!’


ఈ రెండు ప్రకటనలూ మంగళవారం అసెంబ్లీ వేదికపై ముఖ్యమంత్రి జగన్‌ చేసినవే. నిజానికి... పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 45.72 మీటర్లు! ‘ఎత్తు అంగుళం కూడా తగ్గదు’ అంటున్న జగన్‌... 41.15 మీటర్ల కాంటూరు నిర్వాసితులను మాత్రమే తరలిస్తామని ఎందుకు చెబుతున్నారు? ఆపైన నాలుగు మీటర్ల పరిధిలోని నిర్వాసితులను నీటికి వదిలేస్తారా? ఇదీ అసలు ప్రశ్న! నిర్మాణ పరంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించరు. కానీ... నీటి నిల్వను 41.15 మీటర్లకు పరిమితం చేస్తారని ప్రభుత్వమే పలుమార్లు పరోక్షంగా అంగీకరించింది. అప్పుడు ఆంధ్రుల జీవనాడిగా భావిస్తున్న పోలవరం ఒక ‘బ్యారేజీ’ స్థాయికి మారుతుంది. 194.6 టీఎంసీల బదులు... 120 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటాయి. ఇది పునరావాస వ్యయం తగ్గించుకోవడానికి ప్రభుత్వం వేసిన ‘ఎత్తు’గడ అని నిపుణులు చెబుతున్నారు.


అసలు విషయం ఇది! కానీ... ముఖ్యమంత్రి జగన్‌ దీనికి మసిపూసి మారేడుకాయ చేసేలా మాట్లాడారు. తన సహజ ధోరణిలో ‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు ప్రదర్శించారు.  సభలోలేని వ్యక్తుల ప్రస్తావన తేకూడదనే నిబంధనను మరిచి... ‘ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ, ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావుల పేర్లను ప్రస్తావిస్తూ వెకిలిగా మాట్లాడారు. ‘‘పోలవరం ఎత్తు తగ్గిస్తున్నామని, బ్యారేజీగా మారుస్తున్నామని ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ-5లలో పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఎత్తు తగ్గిస్తున్నట్లుగా ఈనాడు రామోజీరావును ప్రధాని మోదీ బెడ్‌రూమ్‌కు పిలిచి చెవిలో చెప్పారా? కేంద్రజలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ బెడ్‌రూమ్‌కు పిలిచి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు చెవిలో చెప్పారా? ఎత్తు తగ్గిస్తున్నట్లు ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ-5లకు నేను చెప్పలేదు. ఆ సంస్థలు నన్ను కలవవు’’ అని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంటే.. ప్రాజెక్టు స్పిల్‌వే ఎత్తు కాదు! రేడియల్‌ గేట్ల పొడవూ కాదు. ప్రాజెక్టులో ఎంత సామర్థ్యం మేరకు జలాలను నిల్వ చేస్తున్నారన్నదే ముఖ్యం. అసలు ప్రణాళిక ప్రకారం... 45.72 మీటర్ల వరకు నీటిని నిల్వ చేయాలి. కానీ... ముఖ్యమంత్రి 41.15 మీటర్ల కాంటూరు లెక్కలే చెబుతున్నారు. 45.72 మీటర్ల కాంటూరులో 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేయాలంటే లక్షా ఆరు వేల కుటుంబాలను తరలించాలి. వారికి సహాయ పునరావాసం కల్పించాలి. 41.15 మీటర్ల కాంటూరునే లెక్కిస్తే... 20,496 కుటుంబాలను తరలిస్తే చాలు.  సహాయ, పునరావాస వ్యయం దాదాపు 30వేల కోట్లు తగ్గుతుంది. 


మరి ఎత్తిపోతల ఎందుకు?

పోలవరంలో గరిష్ఠ స్థాయిలో... అంటే 45.72 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తేనే గ్రావిటీ ద్వారా కాల్వలకు నీరు అందుతుంది.  ఎలాంటి ఎత్తిపోతలతో అవసరం ఉండదు. కానీ జగన్‌ సర్కారు  కొత్తగా ఎత్తిపోతలను తెరపైకి తెచ్చింది. అంటే... గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వలేమని చెప్పకనే చెప్పింది. 41.15 మీటర్ల కాంటూరుకు పరిమితమైతే... ఎత్తిపోతలే గతి. జనవరి నుంచి ఏప్రిల్‌ దాకా గ్రావిటీ ద్వారా కాకుండా ఎత్తిపోతల ద్వారానే గోదావరి జలాలను పంపింగ్‌ చేయాలనే యోచనకు ఇదే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. నీటి నిల్వను 41.15 కాంటూరుకు పరిమితం చేస్తే జలవిద్యుదుత్పత్తి కూడా సాధ్యం కాదు. అందుకే... రివర్స్‌ పంపింగ్‌ విధానంలో పోలవరం ఎత్తిపోతల పథకం ద్వారా విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. ‘‘ఎత్తు తగ్గించం... అంటున్నారు సరే! మరి నీటిని 45.72 మీటర్ల కాంటూరువరకు నిల్వ చేస్తా రా? లేక 41.15కే పరిమితమవుతారా? ముఖ్యమంత్రి సభలో చెప్పినట్లుగా 41.15 కాంటూరుకే పరిమితమైతే... పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు కాబోదు. ఒక బ్యారేజీ స్థాయికి మిగిలిపోతుంది. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి’’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


అంచెలంచెలుగా ముంచుతారా?

పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ విషయంలో ప్రభుత్వం వింత వాదన చేస్తోంది. ప్రాజెక్టులో ఒక్కసారిగా గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వ చేయడం సాధ్యం కాదని.. అంచెలంచెలుగా నీటిని నిల్వ చేస్తారని చెబుతోంది ముందుగా 35 మీటర్ల కాంటూరులో నీటిని నిల్వ చేస్తూ, తర్వాత 15 రోజులకోసారి మూడు మీటర్ల చొప్పున పెంచుకుంటూ పోతారని శాసనసభలో ప్రభుత్వం వెల్లడించింది. అంటే.. ముందుగా 35 మీటర్ల ఎత్తులో గోదావరి జలాలను నిల్వ చేసినా... నెలకు ఆరు మీటర్ల చొప్పున రెండు నెల్లోగా నీటిమట్టం 10 మీటర్లు పెంచాలి. అంటే... 60 రోజుల్లోనే గరిష్ఠ స్థాయికి నీటి నిల్వ 45.72 మీటర్లకు చేరుకునే వీలుంది. కానీ... ప్రభుత్వం ఎంత కాంటూరు మేర నీటిని నిల్వను చేస్తుందో బహిర్గతం చేయడం లేదు. 


ఎప్పటికప్పుడు ‘ఏడాది’

పనులు పూర్తి చేసేందుకు పెట్టుకునే గడువు ‘డెడ్‌లైన్‌’! కానీ... జగన్‌ సర్కారు దృష్టిలో డెడ్‌లైన్‌ అంటే... ఏటికేడాడీ పొడిగించేది అని అర్థం. పోలవరం విషయంలో జరుగుతున్నది ఇదే. 2019లో అధికారం చేపట్టిన వెంటనే... ‘2020 ఖరీఫ్‌ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్‌, జలవనరుల మంత్రి అనిల్‌కుమార్‌ ప్రకటించారు. ఆ ఖరీఫ్‌ వెళ్లిపోయింది. తర్వాత మరో డెడ్‌లైన్‌ వచ్చింది. 2021 ఖరీ్‌ఫకు పూర్తి అని ప్రభుత్వం ప్రకటించింది. అదీ ముగిసింది. ఈసారి పక్కా... 2022 జూన్‌ నాటికి పోలవరం నిర్మించి తీరుతామని 2021 డిసెంబరు 14వ తేదీన జగన్‌ మరో ప్రకటన చేశారు. ఆ పుణ్యకాలం కూడా గడిచిపోయింది. ఇప్పుడు... మంగళవారం అసెంబ్లీ వేదికగా డెడ్‌లైన్‌ను మరోసారి పొడిగించారు. 2023 ఖరీ్‌ఫకు పూర్తిచేస్తామని చెప్పారు. నిజానికి... 2022-23లో బడ్జెట్‌ కేటాయింపులను చూస్తే వచ్చే ఏడాది ఖరీఫ్‌ నాటికి పనులు పూర్తి కావడం కూడా కష్టమే అని చెప్పవచ్చు. ఎందుకంటే...  అనుబంధ ప్రాజెక్టులతో కలిపి పోలవరానికి రూ.4600 కోట్లు మాత్రమే కేటాయించారు. అవి ఏ మూలకూ సరిపోవు!

Updated Date - 2022-03-23T08:06:10+05:30 IST