కూతురే టాపర్‌ కావాలని వైసీపీ నేత ఆగడం.. చదువుల తల్లినీ ‘చంపేశారు!’

Published: Thu, 24 Mar 2022 02:40:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కూతురే టాపర్‌ కావాలని వైసీపీ నేత ఆగడం.. చదువుల తల్లినీ  చంపేశారు!

వేధింపులకు సహకరించిన స్కూలు ప్రిన్సిపల్‌

ఇష్టం లేకున్నా మరో స్కూలుకు మారిన మిస్బా

2 పేజీల లేఖ రాసి ఆత్మహత్య.. మరణం తర్వాతా వదలని అధికారబలం

సూసైడ్‌నోట్‌ కోసం అర్ధరాత్రి సోదాలు.. పోలీసులపై స్థానికుల ఆగ్రహం

చిత్తూరు జిల్లా పలమనేరులో తీవ్ర నిరసనలు


పలమనేరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ నేతల ఆగడాలు పిల్లలు చదువుకునే బడినీ వదలలేదు. ‘నా కూతురే టాపర్‌గా ఉండాలి’ అంటూ చక్కగా చదువుకునే పేదింటి ముస్లిం బాలికను వెంటాడి వేధించారు. స్కూల్‌ ప్రిన్సిపల్‌ కూడా వారికి సహకరించారు. చివరికి... ఆ బాలిక మరో పాఠశాలకు మారింది. కానీ... మనసు మాత్రం వికలమైపోయింది. తన బాధను వివరిస్తూ లేఖ రాసి మంగళవారం ప్రాణాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన పదో తరగతి విద్యార్థిని మిస్బా బలవన్మరణం వెనుక సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇంగ్లి్‌షలో మిస్బా రాసిన రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ సంచలనంగా మారి బుధవారం పలమనేరును నిరసనలతో ముంచెత్తింది. ‘పేదలుగా పుట్టడమే ముస్లిం పిల్లలు చేసుకున్న పాపమా?’ అని ముస్లిం సంఘాల నేతలు ప్రశ్నించారు.


మరోవైపు ‘‘బాగా చదువుకోవడమే నాబిడ్డ ప్రాణాలు తీసిందయ్యా’’ అంటూ మిస్బా తల్లి నసీమా పెట్టిన కన్నీరు ప్రతివారినీ చలింపజేసింది. ‘మార్కుల కోసం కొట్లాడద్దు. వాళ్లు వైసీపీవాళ్లు. మీరు సోడా అమ్ముకునే కూలోళ్లు. ఎక్కువ మాట్లాడితే టీసీ ఇచ్చేస్తా. జిల్లాలో ఎక్కడా చదువుకోకుండా చేస్తా. మీ అమ్మానాయనా అందరూ ఉరేసుకునేట్టుగా చేస్తా’ అంటూ ప్రిన్సిపాల్‌ బెదిరించారని ఆమె ఫిర్యాదు చేశారు. అందరూ కలిసి తన బిడ్డని తనకు కాకుండా చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 


నువ్వు స్కూలుకు రావొద్దు..: తల్లి నసీమా, ముస్లిం సంఘాల కథనం ప్రకారం.. మిస్బా తల్లిదండ్రులు నజీర్‌ అహ్మద్‌, నసీమా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. సోడాల బండి కూడా నడుపుతారు. మిస్బా పలమనేరు పట్టణంలో బ్రహ్మర్షి హైస్కూలులో పదో తరగతి చదువుతోంది. క్లాసులో టాప్‌ స్టూడెంట్‌. ఇదే క్లాసులో చదువుతున్న స్థానిక వైసీపీ నేత సునీల్‌ కుమార్తె పూజిత చదువులో మిస్బాతో పోటీపడేది. ఆ పోటీ ముదిరి ఇటీవల మిస్బాను ఆ అమ్మాయి తీవ్రస్థాయిలో బెదిరించింది. ‘మా నాన్న వైసీపీ నాయకుడు తెలుసా? క్లాసులో నేనే టాపర్‌గా ఉండాలి. నువ్వు స్కూలుకు రావొద్దు’ అంటూ ఒత్తిడి తెచ్చింది. ఈ ఘటన జరిగిన కొద్దిరోజులకు ప్రిన్సిపాల్‌ రమేశ్‌ పిలిపించి.. అదేస్థాయిలో వార్నింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత రెండురోజులకు మిస్బా తండ్రిని ప్రిన్సిపాల్‌ పిలిపించారు. ‘‘మీ అమ్మాయి సరిగా చదవడం లేదు. వేరే స్కూలులో చేర్చుకోండి’ అంటూ టీసీ ఇచ్చారు. పలమనేరులోని మరో స్కూలులో మిస్బాను చేర్చారు. రోజూ కొత్త స్కూలుకు వెళ్లి వస్తున్నా మునుపటి ఉత్సాహం మిస్బాలో కొరవడింది. ఎప్పుడూ ముభావంగా ఉండేది. మంగళవారం ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. 

లేఖ కోసం అర్ధరాత్రి సోదాలు..: గదిలో మిస్బా ఇంగ్లీషులో రాసిన లెటర్‌ దొరికింది. తనకు స్నేహితులు ఎవరూ లేరంటూ బాధపడుతూ, తను స్నేహితులు అనుకున్నవాళ్లు గొడవ పడుతున్నారని ఆ లేఖలో వాపోయింది. తన చావుకు కారణమంటూ ఒక విద్యార్థిని పేరును పదేపదే ప్రస్తావించింది. తండ్రిని బాధపడవద్దంటూ ‘‘నీ ముఖంలో నేను నవ్వుగా ఉంటా నాన్నా’’ అని పేర్కొంది.  ఆ లేఖ వాట్సప్‌ గ్రూపుల్లో సంచలనం సృష్టించింది. లేఖ ఎక్కడ అంటూ మంగళవారం అర్ధరాత్రి పోలీసులు హడావుడి చేశారు. ఆమె కుటుంబసభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకుని  లేఖ కోసం ఇల్లంతా గాలించారు.

  

ఆందోళన... ఆగ్రహం: మిస్బా ఆత్మహత్య వెనుక వైసీపీ నాయకులు ఉన్నారని వార్తలు రావడం... పోలీసుల హడావుడిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్బా ఆత్మహత్యకు కారణమైన వైసీపీ నేత సునీల్‌, ప్రిన్సిపాల్‌ రమేశ్‌పై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్‌ షిబ్లీ డిమాండ్‌ చేశారు. సోడాలు అమ్ముకునే ముస్లిం కుటుంబంలో పుట్టిన అమ్మాయి కావటమే ఈ వివక్షకు కారణం అని ఆయన మండిపడ్డారు. ‘‘ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులను కనీసం ప్రశ్నించకుండా బాధిత కుటుంబాన్ని మరింత బాధకు క్షోభకు గురి చెయ్యటం భావ్యమా?న్యాయమా? ఇదేనా ముస్లింలకు ఈ ప్రభుత్వం ఇచ్చే భరోసా?’’ అని ఆయన ప్రశ్నించారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.