పెట్టుబడులు పరార్‌!

ABN , First Publish Date - 2022-05-02T08:08:09+05:30 IST

పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలతో ఉపాధి కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుంది.

పెట్టుబడులు పరార్‌!

హ్యాపీ ఏపీ దశ నుంచి.. ‘వామ్మో ఏపీ’

రూ.24 వేల కోట్ల ఏపీపీ పేపర్‌ మిల్స్‌ వెనక్కి

ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, రిలయన్స్‌ సెజ్‌  గుడ్‌బై

అనుబంధ పరిశ్రమలకు ‘కియ’ సెలవు

విశాఖ నుంచి ఐటీ కంపెనీలూ గాయబ్‌

వైసీపీ సర్కారు వచ్చాక పెట్టుబడులకు గ్రహణం

టీడీపీ టైంలో 65 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు

మొత్తం 5 లక్షల కోట్ల పెట్టుబడులతో రికార్డు

పెట్టుబడుల ఆకర్షణలో నాడు అగ్రస్థానం

నాటి వెలుగులన్నీ నేడు మాయం

ప్రతికూల చర్యలతో భయం భయం


ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా విశాఖకు పరిపాలనా రాజధాని తీసుకొద్దామనుకుంటే... ఎవరో అడ్డుకున్నారట! మరి... విశాఖ నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందెవరు? కొత్త కంపెనీలు రాకుండా అడ్డుకున్నదెవరు? అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులకు మోకాలడ్డు పెట్టింది ఎవరు? మరింత దివ్యంగా వెలుగులీనాల్సిన అభివృద్ధిని బంగాళాఖాతంలో కలిపేసిందెవరు? ఉత్తరాంధ్ర వెనుకబడే ఉండాలన్నది మీ ఉద్దేశమా?



వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చీ రాగానే విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) రద్దు చేసి... జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఒక్క దెబ్బతో బెదరగొట్టారు. ‘రివర్స్‌ టెండరింగ్‌’ పేరుతో బడా కాంట్రాక్టు సంస్థలను భయపెట్టారు. అమరావతిని అటకెక్కించి... రాజధాని నగర నిర్మాణంలో భాగస్వాములైన అనేక బడా కంపెనీలకు చుక్కలు చూపించారు. ఇవన్నీ... జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీశాయి. పారిశ్రామిక వేత్తల్లో ఏపీపట్ల ప్రతికూల సంకేతాలు వెళ్లాయి. 


రాష్ట్ర విభజన జరిగింది! నవ్యాంధ్ర రాజధాని లేని రాష్ట్రంగా మిగిలింది. అన్నీ హైదరాబాద్‌లోనే! ‘సున్నా’ నుంచి ప్రయాణం! మన చిరునామా చెప్పుకోవాలి. మనకున్న అవకాశాలను వివరించాలి. పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పించాలి! అప్పటికే పారిశ్రామికంగా, సదుపాయాలపరంగా అభివృద్ధి చెందిన పొరుగు రాష్ట్రాలతో పోటీ పడాలి! ఇలాంటి పరిస్థితుల్లోనూ... 2014-19 టీడీపీ హయాంలో నవ్యాంధ్రకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రూ.65,327 కోట్లు! మరి... వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలి రెండేళ్లలో వచ్చిన ఎఫ్‌డీఐలు ఎన్నో తెలుసా? కేవలం రూ.2114 కోట్లు!


(అమరావతి - ఆంధ్రజ్యోతి): పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలతో ఉపాధి కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయం పెరుగుతుంది. ఆదాయంతో... అభివృద్ధి చేయవచ్చు. సంక్షేమ పథకాలూ అమలు చేయవచ్చు. కానీ... ఏపీ అంటేనే పెట్టుబడిదారులు పరారవుతున్నారు. సర్కారు పెద్దలు ఎంత గొప్ప ‘సంకేతాలు’ పంపారో తెలియదు కానీ... జాతీయ స్థాయిలో ‘అయ్యబాబోయ్‌... ఆ రాష్ట్రమా!’ అని వణికిపోతున్నారు. కొత్త పెట్టుబడులు, పరిశ్రమల సంగతి అటుంచితే... ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న వారూ పారిపోతున్నారు. పరిశ్రమలు పెట్టిన వారు విస్తరణ ప్రణాళికలను పక్కనపెట్టేశారు. టీడీపీ సర్కారు వరుసగా ఐదేళ్లు విశాఖపట్నంలో భాగస్వామ్య సదస్సులు నిర్వహించింది. రూ.15.45 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు జరిగాయి.


ఇవి సాకారమైతే 32లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు. ఇలాంటి సదస్సుల్లో  జరిగిన ఒప్పందాలలో 20 శాతం అమలులోకి వచ్చినా గొప్పే అని వాణిజ్యవర్గాలు చెబుతాయి. అయితే... తెలుగుదేశం హయాంలో రూ.5లక్షల కోట్ల విలువైన 39,450 పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయని.... ఫలితంగా 5,13,351 మందికి ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా చెప్పింది. ఐటీ పెట్టుబడులు, ఐటీ ఉద్యోగాలు వీటికి అదనం. 


మాయమైన వాటిలో మచ్చుకు కొన్ని...

ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపర్‌మిల్స్‌ రూ.24వేల కోట్లతో ప్రకాశం జిల్లాలో కాగితపు పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కానీ... రాష్ట్రంలో అధికారంతోపాటు మారిన పరిస్థితుల నేపథ్యంలో... మనసు మార్చుకుని మరో చోటికి తరలిపోయింది. ఈ విషయాన్ని అప్పట్లోనే ‘ఆంధ్రజ్యోతి’ చెప్పగా... ‘అదేం లేదు. పేపర్‌ పరిశ్రమ వస్తోంది’ అని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. కానీ... దాని జాడే లేదు.

అనేక రాష్ట్రాలు పోటీపడినా రాష్ట్రానికే వచ్చిన భారీ పరిశ్రమ కియ. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో రూ.20వేల కోట్ల పెట్టుబడి పెట్టింది. అనతి కాలంలోనే అక్కడ ఉత్పత్తి ప్రారంభమైంది. సుమారు రూ.5వేల కోట్ల పెట్టుబడులతో తన అనుబంధ యూనిట్లను పెడతామని ‘కియ’ అంతకుముందే ప్రకటించింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో ‘కియ’ తన మనసు మార్చుకుంది.

అనంతపురం జిల్లాలో ప్రఖ్యాత దుస్తుల కంపెనీ ‘జాకీ’  పరిశ్రమకు గత ప్రభుత్వ హయాంలోనే భూమి కేటాయించారు. ఆ సంస్థ భూమి చుట్టూ ప్రహరీ కూడా నిర్మించుకుంది. ఇప్పుడు... గోడ మాత్రమే మిగిలింది.

విశాఖలో లులూ గ్రూప్‌ రూ.2,200కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌, మెగా షాపింగ్‌ మాల్‌ నిర్మించేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా ఏడువేలమందికి ఉపాధి లభిస్తుందని ఒప్పందంలో పేర్కొన్నారు. ప్రభుత్వం మారాక  తెరవెనక ఏం జరిగిందో కానీ... స్థలం లీజు రద్దయిపోయింది.

అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఆర్థిక సేవల సంస్థ ‘ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌’ విశాఖకు రావాలనుకుంది. సర్కారు మారగానే... బైబై చెప్పింది.

కర్నూలులో మెగా సీడ్‌ పార్క్‌ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది.

తిరుపతిలో ఫాక్స్‌కాన్‌, సెల్‌కాన్‌ లాంటి సెల్‌ఫోన్‌ కంపెనీలు అనేకం గత ప్రభుత్వ హయాంలో వచ్చాయి. వాటికి తోడుగా రావాల్సిన, గత ప్రభుత్వంలోనే ఒప్పందం చేసుకున్న రిలయన్స్‌ ఎలకా్ట్రనిక్‌ సెజ్‌ వెనక్కివెళ్లిపోయింది. రూ.15వేల కోట్ల పెట్టుబడి గాయబ్‌!

అమరావతిలో కూడా అతి పెద్ద సెజ్‌ ఏర్పాటుకు రిలయన్స్‌ సుముఖత వ్యక్తం చేసింది. జగనన్న అమరావతిని అటకెక్కించారు. ఇక... సెజ్‌ ఎక్కడ?


ఇదీ ఏపీ గతి...:

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి మైన్‌సలో నమోదవుతోంది. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 8.3 శాతం. ఇది దక్షిణాదిలోనే ఎక్కువ. 


విశాఖ ఉక్కుకు నీళ్లు.. కడప ఉక్కు తుక్కు 

సీఎం పదే పదే హామీ ఇచ్చి, కొత్తగా మళ్లీ శంకుస్థాపన చేసిన కడప ఉక్కు కర్మాగారానికి ఇప్పటివరకూ అతీగతీలేదు. ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా ప్రైవేటుపరమవుతోంది.


అబ్బ ఛా....

గత ఏడాది చివరిలో సీఎం జగన్‌ ‘వాణిజ్య ఉత్సవ్‌’ ప్రారంభించారు. ‘‘మా ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 68 మెగా ప్రాజెక్టులు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించాయి. రూ.30,175కోట్ల పెట్టుబడులు... 46,119మందికి ఉద్యోగాలు లభించాయి. అదే సమయంలో మరో 62 భారీ ప్రాజెక్టులు రూ.36,384కోట్ల పెట్టుబడితో ప్రారంభమయ్యాయి. ఫలితంగా 76,960మందికి ఉపాధి లభించింది’’ అని చెప్పారు. హమ్మో... వైసీపీ సర్కారు ఇన్ని ఘనతలు సాధించిందా అని ఆంధ్ర జనులు ఆశ్చర్యపోయారు. అసలు విషయం ఏమిటంటే... టీడీపీ హయాంలో ఒప్పందాలు కుదిరి, పనులు కూడా ప్రారంభించిన మెగా పరిశ్రమలు కియ, అపోలో టైర్స్‌, హీరో మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌, హెచ్‌సీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇసుజు మోటార్స్‌ తదితర కంపెనీలన్నింటినీ జగన్‌ తన ఖాతాలో వేసుకున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి ప్రకటించిన రెండు జాబితాల్లోని 90శాతం పైగా పెట్టుబడులు గత ప్రభుత్వ హయాంలో వచ్చినవే. అప్పుడు ఒప్పందాలు చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించినవే!


నాడు, నేడు... ఎంత తేడా..

2014-19లో రూ.7,03,103 కోట్ల విలువైన 2112 విదేశీ ప్రాజెక్టులు దేశానికి వచ్చాయి. అందులో రూ.70వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏపీకే వచ్చాయి. ఆ ఐదేళ్ల కాలంలో మహారాష్ట్ర, గుజరాత్‌ల తర్వాత అత్యధిక పెట్టుబడులు ఆకర్షించిన రాష్ట్రం మనదే. 2018-19 సంవత్సరంలో పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ ఏడాదిలో దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 11.8శాతం ఏపీకే వచ్చాయని రిజర్వు బ్యాంకు తెలిపింది. 2018-19 (ఏప్రిల్‌-డిసెంబరు మధ్య) రాష్ట్రం రూ.19,671కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం 13వ స్థానానికి పడిపోయింది.  2019 అక్టోబరు నుంచి 2021 జూన్‌ వరకు కేవలం రూ.2,577కోట్ల పెట్టుబడులు వచ్చాయి.


ఐటీ వెలుగులు మాయం

అప్పటికే నవ్యాంధ్ర ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖను... ఐటీ హబ్‌గా, ఆర్థిక సేవల కేంద్రంగా మార్చాలని గత ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. కొన్ని పదుల కంపెనీలు విశాఖకు వచ్చాయి. సెరియమ్‌ సిస్టమ్స్‌, కాండ్యుయెంట్‌, ఇన్‌స్పైర్‌ ఎడ్జ్‌ ఐటీ సొల్యూషన్స్‌లాంటి 8ఐటీ కంపెనీలను ఒకేరోజు ప్రారంభించారు. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌, అదానీ డేటా సెంటర్‌ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. విశాఖ అంటే ఐటీ అన్నట్లుగా ఉధృతంగా పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నాలు జరిగాయి.


తిరుపతిలో జోహో, ఏజీఎస్‌ హెల్త్‌, ఎక్స్‌ఫ్లూయన్స్‌, నేస్‌టెక్‌లాంటి పలు ఐటీ కంపెనీలను ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో రూ.500కోట్ల విలువైన పైడేటా సెంటర్‌ తన కార్యకలాపాలు గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించింది. అక్కడ ఒకేరోజు 10 కంపెనీలకు పైగా ప్రారంభమయ్యాయి. పెద్ద పెద్ద నగరాలను మాత్రమే ఎంచుకునే హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కంపెనీ గన్నవరంలో అడుగుపెట్టింది. ఈ జోరు కొనసాగి ఉంటే... మరెన్నో సంస్థలు తిరుపతి, విశాఖ, విజయవాడ చుట్టుపక్కల ఏర్పాటయ్యేవి. కానీ... సీన్‌ మొత్తం మారిపోయింది. ప్రత్యేక ప్రోత్సాహకాలు, ప్రభుత్వం వైపు నుంచి చొరవ ఆగిపోయింది. అప్పట్లో వచ్చిన అనేక ఐటీ కంపెనీలు ఏపీ విడిచి వెళ్లిపోయాయి.


ఈడీబీ జాడేదీ?

టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడీబీ) చురుగ్గా పని చేసింది. క్లిష్టమైన పరిస్థితుల మధ్య, తక్కువ వనరులతోనే... నవ్యాంధ్ర పేరును జాతీయ, అంతర్జాతీయస్థాయి పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళ్లింది. పెట్టుబడులను రాబట్టింది. ఇప్పుడు... ఈడీబీ జాడే లేదు. లక్షలకొద్దీ జీతాలు తీసుకునేందుకు పదులకొద్దీ సలహాదారులు మాత్రం ఉన్నారు. అందులో... ఐటీ కోసమే ముగ్గురు ప్రత్యేకం! మరి... వీరంతా ఏం చేస్తున్నారు, ఎన్ని కంపెనీలను తెచ్చారు? ఆ ఒక్కటీ అడక్కు! 

Updated Date - 2022-05-02T08:08:09+05:30 IST