AP News: ఏపీ సచివాలయంలో వెంకట్రామిరెడ్డికి ఎదురుదెబ్బ..

ABN , First Publish Date - 2022-09-29T16:25:57+05:30 IST

ఏపీ ప్రభుత్వ అనుకూల ముద్రపడిన సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది.

AP News: ఏపీ సచివాలయంలో వెంకట్రామిరెడ్డికి ఎదురుదెబ్బ..

అమరావతి (Amaravathi): ఏపీ ప్రభుత్వ అనుకూల ముద్రపడిన సచివాలయ సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి (Venkatrami Reddy)కి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్‌వోల సంఘం ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి బలపరిచిన అభ్యర్థులు ముగ్గురు ఓటమిపాలయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 8న సచివాలయ ఎస్‌వోల సంఘానికి ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో పోటీకి దరఖాస్తు చేసిన వ్యక్తి కోర్టుకు వెళ్లడంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేశారు. నిన్న (బుధవారం) కోర్టు విధించిన స్టే ఎత్తివేయడంతో కౌంటింగ్ నిర్వహించారు. అధ్యక్ష, కార్యదర్శి, వైస్ ప్రెసిడెంట్ రెండు పదవులకు మినహా మిగిలిన పదవులకు అప్పటికే ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన మూడు పదవులకు ఎన్నికలు జరిగాయి. వెంకట్రామిరెడ్డి వ్యతిరేక వర్గానికి చెందిన వారు ఎన్నికయ్యారు. ఇక అధ్యక్షుడిగా ఎం. రంగస్వామి, కార్యదర్శిగా జి. రాఘవేంద్రరావు, వైస్ ప్రెసిడెంట్‌ టూగా వై. భార్గవి ఎన్నికయ్యారు.


అధ్యక్షుడి స్థానానికి వెంకట్రామిరెడ్డి బలపరిచిన సుబ్బారెడ్డి బరిలో దిగారు. సుబ్బారెడ్డిపై రంగస్వామి 34 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలాగే కార్యదర్శి స్థానానికి అరవింద్‌పై రాఘవేంద్రరావు 99 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదే విధంగా వైస్ ప్రెసిడెంట్‌గా ఎం. రాజేశ్వరిపై వ్యతిరేక వర్గానికి చెందిన భార్గవి 7 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సచివాలయంలో ఎస్‌వోల సంఘం ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి వర్గం ఓటమిపాలవ్వడం జగన్ సర్కార్‌పై ఉద్యోగుల వ్యతిరేకతకు నిదర్శనమా? అన్న చర్చ సాగుతోంది. వెంకట్రామిరెడ్డి జగన్ సర్కార్ అధికారం రాకముందు నుంచి, వచ్చిన తర్వాత కూడా ప్రతి అంశంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2022-09-29T16:25:57+05:30 IST