‘టాప్‌ అచీవర్స్‌’లో ఏపీ, తెలంగాణ

ABN , First Publish Date - 2022-07-01T09:23:44+05:30 IST

‘టాప్‌ అచీవర్స్‌’లో ఏపీ, తెలంగాణ

‘టాప్‌ అచీవర్స్‌’లో ఏపీ, తెలంగాణ

వ్యాపార సంస్కరణల అమలుపై పోటీ

మదింపు నివేదిక విడుదల చేసిన కేంద్రం

సంస్కరణల సంఖ్యాపరంగా తెలంగాణ టాప్‌

ఫీడ్‌ బ్యాక్‌ మార్కుల్లో  ఏపీ ముందంజ


న్యూఢిల్లీ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): సులభతర వ్యాపారం కోసం ప్రతిపాదించిన సంస్కరణల అమలులో ఏపీ, తెలంగాణ సహా ఏడు రాష్ట్రాలు ‘టాప్‌’లో నిలిచాయి. వ్యాపార నిర్వహణలో సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను (బీఆర్‌ఏపీ) కేంద్రం 2020లో ప్రతిపాదించింది. దీని అమలును మదింపు చేసి రూపొందించిన నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌,  వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌   గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈసారి రాష్ట్రాలకు విడివిడిగా ర్యాంకులు ఇవ్వకుండా... సంస్కరణల అమలు తీరును బట్టి టాప్‌ అచీవర్స్‌, అచీవర్స్‌, ఆస్పైరర్స్‌, ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఎకోసిస్టమ్స్‌ అనే నాలుగు కేటగిరీలుగా విభజించారు. సింగిల్‌ విండో వ్యవస్థ, కార్మికులు, వాతావరణం, భూపరిపాలన, భూ హక్కుల బదిలీ, ఆయా సేవలకు అనుమతులు వంటి 15 వ్యాపార నియంత్రణలతో 301 సంస్కరణలను కేంద్రం బీఆర్‌ఏపీలో చేర్చింది. 95 శాతంకంటే ఎక్కువ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు టాప్‌ అచీవర్స్‌గా, 90 -95 శాతం అమలు చేసిన రాష్ట్రాలను అచీవర్స్‌గా, 80-90 శాతం సంస్కరణలు అమలు చేసిన వారిని ఆస్పైరర్స్‌గా, 80 శాతంలోపు అమలు చేసిన రాష్ట్రాలను ‘ఎమర్జింగ్‌’గా గుర్తించారు. 95శాతానికిపైగా సంస్కరణలు అమలు చేసిన రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు  గుజరాత్‌, హరియాణా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు టాప్‌ అచీవర్స్‌ హోదా సాధించాయి. అయితే... అమలైన సంస్కరణల సంఖ్యను చూసుకుంటే ఏపీకంటే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.... 301 సంస్కరణలకుగాను తెలంగాణ 281 అమలు చేసింది. 20 సంస్కరణలు ఆ రాష్ట్రానికి వర్తించవు. అంటే... పూర్తిస్థాయి సంస్కరణలను అమలు చేసినట్లే. ఇక... ఆంధ్ర ప్రదేశ్‌ 262 సంస్కరణలను అమలు చేసింది. రాష్ట్రానికి వర్తించే సంస్కరణల్లో ఒకటి మాత్రమే అమలు చేయలేదు. మరోవైపు... సంస్కరణల అమలుపై వ్యాపార, పారిశ్రామిక వర్గాలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ స్కోర్‌ ఏపీకి 97.89శాతం రాగా, తెలంగాణకు 94.86 శాతం మాత్రమే వచ్చింది. ‘టాప్‌ అచీవర్స్‌’లో అత్యధిక సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ (281) అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత... కర్ణాటక (279), ఏపీ (262), కర్ణాటక (262), పంజాబ్‌ (258), తమిళనాడు (257), గుజరాత్‌ (243)లు టాప్‌ అచీవర్స్‌గా నిలిచాయి. కేంద్రం విడుదల చేసిన ప్రకటన ప్రకారం చూస్తే... అక్షర క్రమంలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్లు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకులు ప్రకటిస్తోంది. తొలి ఏడాది రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చింది.


అచీవర్స్‌: హిమాచల్‌ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌

ఆస్పైరర్స్‌: అసోం, ఛత్తీ్‌సగఢ్‌, గోవా, జార్ఖండ్‌, కేరళ, రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌

ఎమర్జింగ్‌: అండమాన్‌, బిహార్‌, చండీగఢ్‌, డయ్యూ డామన్‌, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌, మణిపూర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, పుదుచ్చేరి, త్రిపుర.

Updated Date - 2022-07-01T09:23:44+05:30 IST