జల విద్యుత్తుకు ఏపీ టెండర్‌!

ABN , First Publish Date - 2022-06-28T07:44:18+05:30 IST

కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల మీద తెలంగాణకు కేటాయించిన జల విద్యుత్‌ కేంద్రాల్లో తనకు...

జల విద్యుత్తుకు ఏపీ టెండర్‌!

తెలంగాణ కేటాయింపుల్లోని 700 మెగావాట్లు తమకు రావాలంటూ సరికొత్త వివాదం

శ్రీశైలంలో చెరి సగం ఇవ్వాలంటూ పేచీ.. సాగర్‌లో రెండొంతులు తమకేనని వాదన

ఎడమ కాలువలోనూ వాటాకు ఎసరు.. పులిచింతలలోనూ 50% డిమాండ్‌

ఆర్‌ఎంసీ సమావేశాల్లో మినిట్స్‌ నమోదు.. మీటింగ్‌కు మొహం చాటేసిన తెలంగాణ


హైదరాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిపై శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల మీద తెలంగాణకు కేటాయించిన జల విద్యుత్‌ కేంద్రాల్లో తనకు కూడా వాటా కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త డిమాండ్లు చేస్తోంది. శ్రీశైలంలో కుడి, ఎడమ విద్యుత్‌ కేంద్రాలను కలిపి, అందులో సగం విద్యుత్‌ తనకు కేటాయించాలని కోరుతోంది. నాగార్జున సాగర్‌ ప్రధాన జలాశయం మీద ఉన్న విద్యుత్‌ కేంద్రం మొత్తం విద్యుత్తును తెలంగాణ తీసుకుంటోందని, కృష్ణా జలాలను పంచిన విధంగానే సాగర్‌ విద్యుత్తులో రెండు వంతులు తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అలాగే, సాగర్‌ ఎడమ కాలువ నీటిలో ఏపీకి వాటా ఉందని, ఆ వాటా మేరకు ఎడమ కాలువ మీద జల విద్యుత్‌లో వాటా ఇవ్వాలని అడుగుతోంది. పులిచింతల మీద విద్యుత్‌ కేంద్రం మొత్తం తెలంగాణ ఆధీనంలో ఉందని, అందులో సగం తనకు ఇవ్వాలని కోరుతోంది. మొత్తం మీద రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు కేటాయించిన జల విద్యుత్తులో దాదాపు 700 మెగావాట్లకు ఏపీ ఎసరు పెడుతోంది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన రిజర్వాయర్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఆర్‌ఎంసీ) సమావేశాలకు హాజరై ఈ డిమాండ్లతో తన వాదనను రికార్డు చేస్తోంది. కృష్ణా యాజమాన్య హక్కులపై సరికొత్త వివాదాలకు తెర తీస్తోంది. తెలంగాణ సర్కారు మాత్రం ఈ సమావేశాలకే దూరంగా ఉంటూ తన వాదనను గట్టిగా వినిపించే అవకాశాన్ని వదులుకుంటోంది. గత రెండు సమావేశాలకు తెలంగాణ గైర్హాజరైంది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిధిలో జల విద్యుత్‌, వరద జలాలు, రూల్‌కర్వ్‌కు తుదిరూపు ఇవ్వడానికి వీలుగా కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాల అధికారులతో, బోర్డు సభ్యులతో ఆర్‌ఎంసీని వేసింది. జల విద్యుత్‌పై 15 రోజుల్లోగా, రూల్‌కర్వ్‌, వరద జలాలపై నెల రోజుల్లోగా చర్చించి, నిర్ణయం తీసుకోవాలని కేఆర్‌ఎంబీ నిర్దేశించింది. ఇప్పటిదాకా ఆర్‌ఎంసీ రెండు దఫాలుగా సమావేశమయింది. ఆ రెండు సమావేశాల్లో రూల్‌కర్వ్‌, జల విద్యుత్‌పై స్పష్టతకు వచ్చామని, తదుపరి బోర్డు సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకుంటామని కృష్ణా బోర్డు ఇటీవలే స్పష్టం చేసింది. స్పష్టతకు వచ్చామని బోర్డు ప్రకటించడంపై తెలంగాణ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఆర్‌ఎంసీ సమావేశం మినట్స్‌లో జల విద్యుత్‌పై ఏపీ వాదన రికార్డు కావడంతో భవిష్యతులో ఈ వివరాలన్నీ రెఫరెన్స్‌గా చలామణి అవుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొంతకాలం స్తబ్ధుగా ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలు 2020-21 నుంచి తారస్థాయికి చేరాయి.


ఎక్కడెంత అడిగారు?

శ్రీశైలం జలాశయానికి ఇరువైపులా తెలుగు రాష్ట్రాలకు జల విద్యుత్‌ కేంద్రాలున్నాయి. కుడిగట్టులో ఏపీ జెన్‌కోకు చెందిన 770 మెగావాట్ల ప్లాంట్‌ ఉండగా... ఎడమ గట్టున శ్రీశైలం భూగర్భ జల విద్యుత్‌ కేంద్రం 900 మెగావాట్లతో ఉంది. ఈ జలాశయానికి ఇరు వైపులా ఉన్న రెండు ప్లాంట్ల విద్యుదుత్పత్తిని కలిపి చెరిసగం పంచాలని ఏపీ పట్టుబడుతోంది. ఈ లెక్కన శ్రీశైలంలో తనకు మరో 65 మెగావాట్లు వస్తుందని చెబుతోంది. నాగార్జునసాగర్‌ ప్రధాన జలాశయంపై 815.6 మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రం తెలంగాణకు ఉంది. కృష్ణా జలాలను 66:34 నిష్పత్తితో ఏపీ, తెలంగాణ పంచుకోవడానికి నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ జలాలతో ఉత్పత్తయ్యే కరెంట్‌ను కూడా అదే నిష్పత్తితో పంచాలని పట్టుబడుతోంది. 66:34 శాతం నిష్పత్తిలో పంచితే సాగర్‌ మీదున్న విద్యుత్‌ కేంద్రంలో తమకు 538.2 మెగావాట్లు వస్తుందని లెక్కలు వేస్తోంది. నాగార్జునసాగర్‌ ఎడమ కాలువపై కూడా తెలంగాణకు 60 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఉందని, ఈ కాలువ కింద 132 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, అందులో 32 టీఎంసీలు ఏపీకి సంబంధించిన ఆయకట్టుకు కేటాయించారని ప్రస్తావించింది. ఏపీ వాటా 32 టీఎంసీల నీటితో జల విద్యుత్‌ చేస్తున్నందున ఆ మేరకు ఎడమ కాలువ విద్యుత్‌ కేంద్రంలో వాటా ఇవ్వాలని అడుగుతోంది. పులిచింతల ప్రాజెక్టులో 120 మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రం తెలంగాణకు ఉంది. ఈ ప్రాజెక్టు ఏపీ ఆధీనంలో ఉంది. జల విద్యుత్కేంద్రాన్ని పూర్తిగా తెలంగాణకు కేటాయించారు. 120 మెగావాట్లలో చెరి సగం చొప్పున 60 మెగావాట్ల విద్యుత్‌ తమకు ఇవ్వాలని ఏపీ అడుగుతోంది. ఇవన్నీ వివాదాల నేపథ్యంలో ఆర్‌ఎంసీ మూడో దఫా సమావేశం జూలై 1న జరుగనుంది. ఈ సమావేశానికైనా తెలంగాణ హాజరు అవుతుందా? లేక దూరంగా ఉంటుందా తేలాల్సి ఉంది. 

Updated Date - 2022-06-28T07:44:18+05:30 IST