ఆంధ్రాలో 10 శాతం థియేటర్లే తెరుచుకున్నాయి!

Jul 30 2021 @ 19:43PM

ఆంధ్రాలో 10 శాతం థియేటర్లే తెరుచుకున్నాయి! 

తెలంగాణలో 30 శాతం ఆక్యుపెన్సీ

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. తెలంగాణలో మేజర్‌ థియేటర్లు అన్నీ తెరుచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అనుమతి మేరకు 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లను తెరిచారు. ‘ఇష్క్‌’, ‘తిమ్మరుసు’ చిత్రాలు థియేటర్‌లలో విడుదలయ్యాయి. అనుమతి దక్కినప్పటికీ ఏపీలో పూర్తి స్థాయులో థియేటర్లు తెరుచుకోలేదు. కేవలం 10 శాతం థియేటర్లే మొదలయ్యాయి. కరోనా కేసులు అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క థియేటర్‌ కూడా తెరుచుకోలేదు. బీసీ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. ఆగస్ట్‌ 6, 13 తేదిల్లో మరికొన్ని సినిమాల విడుదల ఉండడంతో అప్పటికి థియేటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ఏపీ ఛాంబర్‌ జాయింట్‌ సెక్రటరీ వీరనారాయణ బాబు మాట్లాడారు.  ‘‘ఈరోజు రెండు సినిమాలే విడుదల కావడం వల్ల 10 శాతం థియేటర్లే తెరుచుకున్నాయి. జనాల్లో కరోనా భయం ఇంకా ఉంది. అయినప్పటికీ ఆడియన్స్‌ నుంచి ఆదరణ బావుంది.  రానున్న రెండు వారాల్లో 80 శాతం థియేటర్లు అందుబాటులోకి వస్తాయి’’ అని తెలిపారు. తెలంగాణాలోనూ మేజర్‌ థియేటర్లు తెరుచుకున్నాయని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రెసిడెంట్‌ సునీల్‌ నారంగ్‌ తెలిపారు. 30 శాతం ఆక్యుపెన్సీ ఉందని ఆయన అన్నారు. ఆగస్ట్‌ 20 వరకూ పరిస్థితులు గమనించి థియేటర్‌లను ఎలా నడపాలి అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని సునీల్‌ తెలిపారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.