గూడుకు గ్రహణం

ABN , First Publish Date - 2021-04-22T05:41:21+05:30 IST

పట్టణ ప్రజలకు సొంతగూడు కల్పించాలని నిర్మిస్తున్న ఏపీ టిడ్కో ఇళ్లకు గ్రహణం పట్టుకుంది.

గూడుకు గ్రహణం
అర్బన్‌ హౌసింగ్‌

టిడ్కో ఇళ్లలో మౌలిక వసతులు మృగ్యం 

గాలికొదిలేసిన ఎస్టీపీల నిర్మాణం 

భీమవరంలోనే అమృత్‌ పథకంలో ఏర్పాటు

పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో టెండర్‌లు రద్దు

స్వచ్ఛ ఆంధ్రమిషన్‌ ద్వారా నిర్మాణానికి చర్యలు

ఇప్పటికే ఆచరణ శూన్యం.. రుణాలపై బ్యాంకుల విముఖత

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):

పట్టణ ప్రజలకు సొంతగూడు కల్పించాలని నిర్మిస్తున్న ఏపీ టిడ్కో ఇళ్లకు గ్రహణం పట్టుకుంది. లబ్ధిదారుల చేతికి అంత త్వరగా వచ్చే అవకాశం కనిపిం చడం లేదు. బ్యాంకులు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం లబ్ధిదారులకు అర్హత పత్రాలను మంజూరుచేసింది. కానీ అర్బన్‌ హౌసింగ్‌ ఇళ్లల్లో మౌలిక వసతులు కల్పించాలన్న విషయాన్ని మరిచింది. ప్రధానంగా సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎస్టీపీ) నిర్మించాలి. అప్పుడే టిడ్కో ఇళ్లలో బాత్‌రూమ్‌లు, మరుగుదొడ్లు విని యోగించే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలోనే వీటికి టెండర్లు ఖరారుచేశారు. పనులు ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభుత్వం మారిపోయిం ది. వైసీపీ అధికారంలో రావడంతోనే పనులన్నీ రద్దు చేశారు. ఇళ్లు నిర్మిస్తున్న సంస్థలే ఎస్టీపీల నిర్మాణానికి టెండర్లు వేశాయి. పనులు రద్దు కావడంతో కొత్త టెండర్లు పిలవాల్సి ఉంది. రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిం చడం లేదు. తాత్కాలిక ప్రాతిపదికన ఏపీ టిడ్కో ప్రతి పట్టణంలోని అర్బన్‌ హౌసింగ్‌ సముదాయంలో సెప్టిక్‌ ట్యాంకులు నిర్మించారు. వాటి సామర్థ్యం కొంత మేరే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు సెప్టిక్‌ ట్యాంక్‌లను శుభ్రపరచాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనికాదని అధికా రులే తేల్చి చెబుతున్నారు. సీవే జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ల నిర్మాణంతోనే శాశ్వత పరిష్కారం ఉంటుంది. 

జిల్లాలో ఏపీ టిడ్కో నిర్మిస్తున్న అర్బన్‌ హౌసింగ్‌ సముదాయాల్లో ఒక్క భీమవరంలోనే ప్లాంట్‌ నిర్మాణానికి నోచుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్‌ పథకంలో భాగంగా భీమవరం పురపాలక సంఘం టిడ్కో భూముల్లోని ఐదు ఎకరాల్లో ఎస్టీపీ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే సగం పనులు పూర్తయ్యాయి. మరి కొద్ది నెలల్లో ప్లాంట్‌ అందుబాటులోకి వస్తుంది. అధికంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్న తాడేపల్లిగూడెం, పాలకొల్లు పట్టణాల్లో ఎస్టీపీ ప్లాంట్‌ల నిర్మాణం అటకెక్కింది. రెండో విడత టిడ్కో నిర్మిస్తున్న పట్టణాల్లో అదే దుస్థితి నెలకొంది.   


రుణాలు ఇస్తే సరిపోతుందా ?

లబ్ధిదారులకు రుణాలు ఇచ్చే క్రమంలో అర్హత పత్రాలను మంజూరుచేశారు. బ్యాంకులు మాత్రం రుణాలు కల్పించే విషయంలో అంతగా ఆసక్తి చూపడం లేదు. గతంలో సుమారు వెయ్యి మందికి రుణాలు ఇచ్చారు. వారికి ఇళ్లు కేటాయించక పోవడంతో వాయిదాలు చెల్లించలేదు. దీంతో వారందరినీ బ్లాక్‌ లిస్టులో పెట్టేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. నిరర్ధక ఆస్తులు కింద చూపాలని భావిస్తున్నాయి. వాయిదాలు చెల్లించకపోవడంలో లబ్ధిదారుల తప్పేమీ లేదు. సొంతింటికి వెళ్లిన తర్వాత వాయిదాలు చెల్లిస్తామని లబ్ధిదారులు మిన్నకుండిపోయారు. ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. మరోవైపు 300 చదరపు అడుగుల కేటగిరీ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులకు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో రుణాలు మంజూరైన వారిలో 300 చదరపు అడుగుల కేటగిరీ లబ్ధిదారులు ఉన్నారు. అటువంటి వారి రుణాలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది.  365, 430 చదరపు అడుగుల కేటగిరీల్లో ఇప్పటికే ఇచ్చిన రుణాలపై ప్రభుత్వం హామీ ఇస్తే తప్ప మిగిలిన లవ్ధిదారులకు బ్యాంకుల నుంచి రుణాలు అందే సూచనలు కనిపించడం లేదు. మొత్తంగా ప్రభుత్వ చొరవతో బ్యాంకు రుణాలు అందజేసినా సరే సొంతింటికి వెళితెనే రుణ గ్రహీతలు వాయిదాలు చెల్లించనున్నారు. అది నెరవేరాలంటే అర్బన్‌ హౌసింగ్‌ సముదాయాల్లో ముందుగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎస్టీపీ నిర్మాణాలు చేపట్టాలి. స్వచ్ఛ ఆంధ్ర మిషన్‌ వాటిని చేపట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అధికారులు చెబుతున్నారు. అదికూడా వేగవంతంగా ప్రారంభించాలి. ఎలా లేదన్నా ఎస్టీపీల నిర్మాణానికి ఏడాది పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం త్వరతిగతిన మౌలిక వసతులను పూర్తి చేయాలి. అప్పుడే పట్టణాల్లోని లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేరనుంది. 


Updated Date - 2021-04-22T05:41:21+05:30 IST