పడకేసిన పర్యాటకం!

ABN , First Publish Date - 2021-04-23T06:40:10+05:30 IST

కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ దెబ్బకు పర్యాటకం విలవిల్లాడుతోంది! పర్యాటక ప్రాంతాలు నిర్జీవం గా మారిపోయాయి.

పడకేసిన పర్యాటకం!

విజయవాడ డివిజన్‌లో పర్యాటక ప్రాంతాలకు తగ్గిన సందర్శకులు  

హరిత బెర్మ్‌ పార్క్‌, భవానీ ఐల్యాండ్‌కు  70 శాతానికి పైగా తగ్గిన పర్యాటకులు  

90 శాతం వరకు తగ్గిన కాటేజీల బుకింగ్‌ 

ఆంధ్ర జ్యోతి, విజయవాడ : కొవిడ్‌ సెకండ్‌వేవ్‌ దెబ్బకు పర్యాటకం విలవిల్లాడుతోంది! పర్యాటక ప్రాంతాలు నిర్జీవం గా మారిపోయాయి. కేవలం రెండు వారాల వ్యవధిలోనే 70 శాతానికి పైగా పర్యాటకులు తగ్గిపోయారు. నగరంలోని హరిత బెర్మ్‌పార్క్‌, భవానీ ఐల్యాండ్‌లో సందర్శకులు లేక  వెలవెలబోతున్నాయి. ఈ 2ప్రాంతాలకు సగటున రోజుకు 500 మంది, వారాంతాల్లో వెయ్యి, ముఖ్యమైన సందర్భాల్లో 2వేలకు పైగానే వస్తుంటారు. అలాంటిది ఏప్రిల్‌ నెల రెండో వారం నుంచి సగటున 100కు మంచి రావటం లేదు. నాలుగు రోజులుగా ఆ సగటు 70లోపే. రానున్న రోజుల్లో సున్నాకు పడిపోయే అవకాశాలున్నాయని ఏపీటీడీసీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. 

పాయింట్లకే బోట్లు పరిమితం

పర్యాటకులు తగ్గిపోవటంతో బోటింగ్‌ యూనిట్‌ విభాగం కార్యకలాపాలు తగ్గిపోయాయి. కృష్ణవేణి, ఆమరపాలి,భవానీ వంటి మెకనైజ్డ్‌ బోట్లతో పాటు ఫాంటూన్‌ బోట్లు, పల్నాడు బోటు, స్పీడ్‌ బోట్లు దాదాపుగా ఖాళీగా ఉంటున్నాయి. వాటర్‌ స్కూటర్‌ అయిన జెట్‌ స్కీయింగ్‌ అయితే పూర్తిగా ప్లాట్‌ఫామ్‌ దగ్గరే వదిలేశారు.

రెస్టారెంట్స్‌ ఖాళీ

పర్యాటక శాఖ రెస్టారెంట్లు ఖాళీగా ఉన్నాయి. హరిత బెర్మ్‌పార్క్‌లో ఉన్న ఫ్యామిలీ రెస్టారెంట్‌ కిటకిటలాడుతుంది. ఇప్పుడు ఇద్దరు, ముగ్గురు తప్ప ఎవరూ రావట్లేదు. ఇక్కనే ఉన్న బార్‌కు మోస్తరుగానే వస్తున్నారు. ఐల్యాండ్‌లోని రెస్టారెంట్స్‌ వెలవెలబోతున్నాయి. ఇక పర్యాటక కాటేజీలకు బుకింగ్‌ దాదాపుగా నిలిచిపోయింది. 2 లేదా 3శాతం మేర బుకింగ్స్‌ జరుగుతున్నాయి. భవానీ ఐల్యాండ్‌లో అయితే వారం రోజులుగా ఒక్క కాటేజీ కూడా బుక్‌ అవలేదు.

Updated Date - 2021-04-23T06:40:10+05:30 IST