పెరుగుతున్న అపార్ట్‌మెంట్‌ కల్చర్‌

ABN , First Publish Date - 2022-01-18T17:17:04+05:30 IST

ఒకప్పుడు వ్యక్తిగత ఇళ్లను నిర్మించుకోవడంపైనే ఆసక్తి చూపే ప్రజలు నేడు అపార్ట్‌మెంట్లలో నివసించడానికి ఆసక్తి చూపుతున్నారు. అల్వాల్‌ సర్కిల్‌ ప్రాంతం చాలా వరకు గ్రామీణ

పెరుగుతున్న అపార్ట్‌మెంట్‌ కల్చర్‌

ఆర్థిక భారంతో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణంపై విముఖత 

కలిసివచ్చే సెక్యూరిటీ 

అల్వాల్‌లో మారుతున్న ప్రజల అభిరుచి 


హైదరాబాద్/అల్వాల్‌: ఒకప్పుడు వ్యక్తిగత ఇళ్లను నిర్మించుకోవడంపైనే ఆసక్తి చూపే ప్రజలు నేడు అపార్ట్‌మెంట్లలో నివసించడానికి ఆసక్తి చూపుతున్నారు. అల్వాల్‌ సర్కిల్‌ ప్రాంతం చాలా వరకు గ్రామీణ వాతావరణానికి దగ్గరగా ఉండటంతో స్థానికులు 1988కు ముందు ఎక్కువగా ఇండిపెండెంట్‌ గృహాలనే నిర్మించుకునే వారు. క్రమంగా స్థలాలు దొరకకపోవడం, దొరికినా ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌లు కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపుతున్నారు. అల్వాల్‌కు కంటోన్మెంట్‌ ప్రాంతం దగ్గరగా ఉండటంతో త్రివిధ దళాలకు చెందిన మిలటరీ అధికారులు, మాజీ అధికారులు వ్యక్తిగత ఇళ్లను నిర్మించుకుని ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. అల్వాల్‌లో ఖాళీ ప్లాట్లు తగ్గిపోతున్న కారణంగా అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి బిల్డర్లు మొగ్గు చూపుతున్నారు. మధ్యతరగతి ప్రజలతో పాటు ఉన్నత వర్గాలు సైతం అపార్ట్‌మెంట్లలో నివసించడానికి ఆసిక్తి చూపుతున్నారు. యాప్రాల్‌ ప్రాంతంలో గేటెడ్‌ కమ్యూనిటీతో పాటు పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు, విల్లాలు వెలుస్తున్నాయి. దీంతో ఉద్యోగులు, వ్యాపారస్తులు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. 


అల్వాల్‌లో ఉమా అపార్ట్‌మెంట్‌ మొదటిది..

అల్వాల్‌లోని రామ్‌నగర్‌ కాలనీలో 1988లో ఉమా అపార్ట్‌మెంట్‌ను రణధీర్‌సింగ్‌, ప్రతాప్‌ రెడ్డి నిర్మించారు. అనంతరం ఈశ్వరీ అపార్ట్‌మెంట్‌ను 1992-93లో నిర్మించారు. సీఎల్‌ఎన్‌ అపార్ట్‌మెంట్‌ను 1992లో నిర్మించారు. ఇలా సంవత్సరానికి ఒకటి, రెండు అపార్ట్‌మెంట్‌లు మాత్రమే అల్వాల్‌లో ఉండేవి. కాలక్రమేణా డిమాండ్‌ను బట్టి బిల్డర్లు సంవత్సరానికి 30 నుంచి 50 వరకు అపార్ట్‌మెంట్లను నిర్మిస్తున్నారు. ఒక్కో ఫ్లాట్‌ను రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల లోపు విక్రయిస్తుండగా లగ్జరీ ఫ్లాట్‌లను రూ.75 లక్షల నుంచి కోటి వరకు అమ్ముతున్నారు. 


వ్యక్తిగత ఇళ్ల నిర్మాణంతో ఆర్థిక భారం..

వ్యక్తిగత గృహాలను నిర్మించుకోవాలంటే మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. 150 గజాల ఇంటి అనుమతి కోసం, అందులో బోర్‌ వేయడానికి, ఎల్‌ఆర్‌ఎస్‌ క్లియరెన్స్‌ కోసం రూ.3 లక్షల వరకు ఖర్చవుతోంది. దానికి తోడు గృహాల నిర్వహణ, సెక్యూరిటీ తదితర ఖర్చుల భారం తగ్గించుకునేందుకు అపార్ట్‌మెంట్లలో నివసించడానికే ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంతో అపార్ట్‌మెంట్‌ అయితేనే భద్రత ఉంటుందని అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ను ఇష్టపడుతున్నారు. 


ఐక్యతతో ఉంటాం..

అపార్ట్‌మెంట్లలో వివిధ ప్రాంతాల ప్రజలు కలిసి మెలిసి ఉండేందుకు అవకాశం ఉంది. పండుగలు, స్వాతం త్య్ర దినోత్సవాలు, ఇతర వేడుకలను ఐక్యంగా నిర్వహించుకోవడానికి అపార్ట్‌మెంట్‌ సంస్కృతి దోహదపడుతుంది. 

- స్వర్ణలత, అపార్ట్‌మెంట్‌ వాసి


పెరుగుతున్న బహుళ అంతస్థుల భవనాలు.. 

నేడు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అభిరుచిలో మార్పులు వస్తున్నాయి. అల్వాల్‌లో ఒకప్పుడు వ్యక్తిగత ఇళ్లనే ఇష్టపడే ప్రజలు.. ఇప్పుడు చాలా వరకు అపార్ట్‌మెంట్లలో నివాసం ఉండేందుకు ముందుకు వస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు భద్రత పరమైన చర్యలు కూడా అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ను ఇష్టపడేందుకు దోహదం చేస్తున్నాయి. 

- తరుణ్‌ రెడ్డి, బిల్డర్‌

Updated Date - 2022-01-18T17:17:04+05:30 IST