బీజేపీతో మంతనాలు..36 సీట్లు కోరుతున్న అప్నాదళ్

ABN , First Publish Date - 2022-01-18T22:22:43+05:30 IST

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సీట్ల పంపకాల విషయంలో..

బీజేపీతో మంతనాలు..36 సీట్లు కోరుతున్న అప్నాదళ్

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో సీట్ల పంపకాల విషయంలో భాగస్వామ్య పార్టీలతో బీజేపీ మంతనాలు సాగిస్తోంది. బీజేపీ కీలక భాగస్వామ్య పక్షమైన అప్నాదళ్‌‌, నిషద్ పార్టీ నేతలతో మంగళవారం ఉదయం తొలి రౌండ్ చర్చలు సాగిస్తోంది. అప్నాదళ్ 36 సీట్లు ఆశిస్తుండగా, ఎన్ని సీట్లు ఖారారవుతాయనేది సాయంత్రానికి తేలే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.


సీట్ల పంపకాల విషయమై నిషద్ పార్టీ నేతలు, అప్నాదళ్ అధ్యక్షుడు అనుప్రియ పటేల్‌ ఇవాళ ఉదయం బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాని, యూపీ ఎలక్షన్ ఇన్‌చార్చి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆప్నాదళ్ 36 సీట్లు కోరుతోంది. గతంలో ఆ పార్టీ 11 స్థానాల్లో పోటీ చేసి 9 స్థానాలు గెలుచుకుంది.


ఎన్ని సీట్లు అనేది కాదు, గెలుపే ముఖ్యం

కాగా, తాము 36 సీట్లు కోరుతున్నట్టు అప్నాదళ్ వర్గాలు తెలిపారు. సీట్ల సంఖ్య కన్నా, గెలుపే ముఖ్యమని, ఈసారి పూర్వాంచల్ సీటు చాలా కీలకమని ఆ పార్టీ నేత ఒకరు చెప్పారు. తాము అడిగిన ప్రతి సీటు గురించి 30 నుంచి 45 నిమిషాలు చర్చిస్తున్నట్టు తెలిపారు. ఈసారి అప్నాదళ్ 100 శాతం సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అప్నాదళ్ కోరుతున్న సీట్లలో కాన్పూర్, మౌరనిపూర్, ఝాన్సీ, నాన్‌పర, బహ్‌రిచ్, బనారస్‌లోని సేవాపురి రోహనియా పిండ్ర, అలహాబాద్‌లోని సొరావు హండియా, గోరఖ్‌పూర్‌లోని షోహ్రత్‌గఢ్, నౌతన్వా, కుషీనగర్, లక్నో, మోహన్‌లాల్ గంజ్‌లోని మరికొన్ని సీట్లు ఉన్నాయి. యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏడు విడతలుగా పోలింగ్ జరుగనుంది. ఫిబ్రవరి 10న ప్రారంభమై మార్చి 7వ తేదీలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-01-18T22:22:43+05:30 IST