సజ్జల హామీ ఇచ్చారు : ఏపీజేఎసీ ఛైర్మన్ బండి

ABN , First Publish Date - 2021-10-12T22:06:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో,...

సజ్జల హామీ ఇచ్చారు : ఏపీజేఎసీ ఛైర్మన్ బండి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఉద్యోగ సంఘాల నేతల కీలక సమావేశం ముగిసింది. అనంతరం ఏపీజేఎసీ ఛైర్మన్ బండి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ‘ఉద్యోగులు, ఉపాద్యాయులు ఎదుర్కొంటోన్న సమస్యలను సజ్జల దృష్టికి తెచ్చాం. మా సమస్యల పరిష్కారంపై సజ్జల సానుకూలంగా స్పందించారు. రెండు రోజుల్లో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహిస్తామని సజ్జల హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ఇవాల మధ్యాహ్నం సీఎస్ సమీర్ శర్మను కలుస్తాం. దసరా కానుకగా ప్రభుత్వం పీఆర్సీ ఇస్తుందని ఉద్యోగ, ఉపాద్యాయ, కార్మిక సంఘాలు ఆశిస్తున్నాయి. పీఆర్సీని అతి త్వరగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని సజ్జల చెప్పారు. ఉద్యోగులకు కింద స్థాయిలో చాలా బర్నింగ్ సమస్యలున్నాయి. 12వ తేదీ వచ్చినా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు రావడం లేదు. ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకూ డబ్బులు రావడం లేదు. ప్రతి నెలా 01 తారీఖున వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరాం. మెడికల్ అండ్ హెల్త్‌లో ప్రమోషన్లపై సజ్జల సానుకూలత వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి  ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం.. ఇంకా ఇవ్వలేమని చెప్పాం. మాపై ఉద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి. సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరాం. ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అయింది.. డెడ్ లైన్ దాక రాలేదు’ అని బండి మీడియాకు వెల్లడించారు.

Updated Date - 2021-10-12T22:06:40+05:30 IST