రొమ్ము క్యాన్సర్‌కు ఈజీ చెక్‌.. ముందస్తుగా తెలుసుకోవచ్చు ఇలా..

ABN , First Publish Date - 2022-06-23T16:07:34+05:30 IST

రొమ్ము(బ్రెస్ట్‌) క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు ‘ఈజీ చెక్‌’ అనే రక్తపరీక్షను అపోలో ఆస్పత్రుల్లో అందుబాటులోకి

రొమ్ము క్యాన్సర్‌కు ఈజీ చెక్‌.. ముందస్తుగా తెలుసుకోవచ్చు ఇలా..

ముందస్తుగా గుర్తించే రక్తపరీక్షను అందుబాటులోకి తెచ్చిన అపోలో ఆస్పత్రి


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రొమ్ము(బ్రెస్ట్‌) క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించేందుకు ‘ఈజీ చెక్‌’ అనే రక్తపరీక్షను అపోలో ఆస్పత్రుల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. దాతర్‌ క్యాన్సర్‌ జెనిటిక్స్‌ భాగస్వామ్యంతో ఈ రక్తపరీక్షలను నిర్వహించనున్నారు. ఈ వివరాలను అపోలో ఆస్పత్రుల వ్యవస్థాపక చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ సీ రెడ్డి బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా రక్త పరీక్ష ద్వారా బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను గుర్తించే ఈజీ చెక్‌ను అందుబాటులో తీసుకొచ్చిన ఘనత ఆపోలో ఆస్పత్రులదేనన్నారు. ఈజీ చెక్‌ ద్వారా కేవలం 5 మిల్లీలీటర్ల రక్తాన్ని పరీక్షించి, జీరో స్టేజ్‌లోనే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను గుర్తించవచ్చన్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను ముం దస్తుగా గుర్తించడం వల్ల చికిత్స సులభతరం అవుతుందని, వైద్య ఖర్చు కూడా తగ్గుతుందని వెల్లడించారు. ఈజీ చెక్‌ ద్వారా 99 శాతం కచ్చితమైన ఫలితాలు వస్తాయని తెలిపారు. ప్రతీ 22 మంది మహిళల్లో ఒకరికి బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశమున్నందున 40 ఏళ్లు దాటిన మహిళలంతా ఈ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. దేశంలో అన్ని అపోలో ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో ఈజీ చెక్‌ పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈజీ చెక్‌ను అపోలో మాస్టర్‌ హెల్త్‌ చెక్‌పలో కూడా చేర్చుతున్నామని ప్రకటించారు. అనంతరం దాతర్‌ క్యాన్సర్‌ జెనిటిక్స్‌ వ్యవస్థాపక చైర్మన్‌ రాజన్‌ దాతర్‌ మాట్లాడుతూ ఈజీ చెక్‌ పరీక్షను గుడ్‌ న్యూస్‌ టెస్ట్‌గా అభివర్ణించారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ పరీక్షకు యూఎ్‌సఎ్‌ఫడీఏ గుర్తింపు ఉందని తెలిపారు. ప్రస్తుతం ఈ పరీక్షలు 20 దేశాల్లో అందుబాటులో ఉన్నాయని, త్వరలో పలు ఇతర క్యాన్సర్లను గుర్తించే పరీక్షలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కాగా, అపోలోలో చేసే ఈజీ చెక్‌ పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని దాతర్‌ క్యాన్సర్‌ జెనిటిక్స్‌ క్లినికల్‌ సపోర్ట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధా మూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ టీపీఎస్‌ భండారి, దినేష్‌ మాధవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-23T16:07:34+05:30 IST