మోదీ యంగ్ పీపుల్‌ని ఎంకరేజ్ చేస్తారు.. అందుకే నన్ను వీసీగా ఎంపిక చేశారు

ABN , First Publish Date - 2020-02-07T22:44:05+05:30 IST

ఆర్కే: హైదరాబాద్‌ యూనివర్సిటీ కొంతకాలం క్రితం రగులుతున్న కుంపటిలా ఉంది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? అప్పారావు: చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు ఒక సంఘటన జరిగినపుడు పరిస్థితులు అలా ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడైతే ప్రశాతంగా ఉంది. హైదరాబాద్‌ యూనివర్సిటీకి దేశంలోనే బెస్ట్‌ యూనివర్సిటీగా పేరుంది.

మోదీ యంగ్ పీపుల్‌ని ఎంకరేజ్ చేస్తారు.. అందుకే నన్ను వీసీగా ఎంపిక చేశారు

రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం తర్వాతే నాకు గన్‌మెన్లు

విశ్వవిద్యాలయాల్లో ఆత్మహత్యలు ఇదే మొదటిది కాదు.. చివరిది కూడా కాదు

రూ.8 లక్షలు ఇస్తానని చెప్పాను.. తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ ఎన్నో జరిగాయి

ప్రత్యేక విమానంలో రాహూల్‌గాంధీ రావాల్సిన అవసరం ఏంటి..?

ప్రతిపక్షంలో బీజేపీ ఉన్నా ఇలానే చేసేది. ఎవరూ పునీతలు కాదు..

యూనివర్శిటీ క్యాంపస్‌లో మందుబాటిళ్లు.. అన్ని చోట్లా ఉంది

టీచర్లు, విద్యార్థులు కలిసి డ్యాన్సులు.. నేను మార్చలేను

పీహెచ్‌డీ విద్యార్థులను ప్రొఫెసర్లు వేధిస్తున్నారనడం వాస్తవమే

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో హైదరాబాద్ యూనివర్శిటీ వీసీ అప్పారావు


హైదరాబాద్ యూనివర్శిటీ వీసీ అప్పారావు.. ఎంతోమంది పోటీలో ఉన్నా కుల ప్రభావంతోనే ఆయన వీసీ అయ్యారని, వెంకయ్య నాయుడు వల్లే ఈ పదవిలో ఉన్నారని చాలా మంది నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న వ్యక్తి. రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ వీసీకి గన్‌మెన్లను ప్రభుత్వం కేటాయించడం కూడా తీవ్ర చర్చనీయాంశమయింది. రోహిత్ వేముల సంఘటనతో హైదరాబాద్ యూనివర్శిటీ రగులుతున్న కుంపటిలా ఉండేదనీ, ఇప్పుడు మాత్రం ప్రశాంతంగానే ఉందని అప్పారావు చెబుతున్నారు. బీజేపీ ప్రభుత్వంపై యూపీఏ తీవ్ర అసహనంతో ఉందంటున్నారు. ‘ఎవడు వీడు.. వీడెందుకు అసలు వచ్చాడు. మనం ఇన్నేళ్లు పాలించాం కదా.. ’ అని ప్రభుత్వం గురించి అసహనంతో రగిలిపోతున్నారన్నారు. ఒక ప్రధానమంత్రి అభ్యర్థి అయిన రాహూల్ గాంధీ.. ప్రత్యేక విమానం వేసుకుని మరీ హైదరాబాద్ యూనివర్శిటీకి రావడం దేనికనేది.. దేశానికి ఆయనే సమాధానం చెప్పాలంటున్నారు. ‘రోహిత్ నా విద్యార్థి అనీ, నేను ఎన్నో క్లాసులు చెప్పా. నాదీ అనుకున్న క్యాంపస్‌ను ఒక రెండు నెలల పాటు వదిలిపెట్టాల్సి వచ్చింద’నే రెండు అంశాలు తనను బాధపెట్టాయంటున్నారు. రాష్ట్రపతి స్వయంగా పిలిచి మరీ అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారని చాలామంది చెప్పుకుంటుంటారనీ, అది అంతా తప్పుడు ప్రచారమేనంటున్నారు. ఇంకా తన వ్యక్తిగత, వృత్తిపరమైన ఎన్నో విశేషాల గురించి ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ 10-09-2017న నిర్వహించినటువంటి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో పంచుకున్నారాయన... ఆ పూర్తి వివరాలు ఇవే....


ఆర్కే: హైదరాబాద్‌ యూనివర్సిటీ కొంతకాలం క్రితం రగులుతున్న కుంపటిలా ఉంది. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి? 

అప్పారావు: చాలా ప్రశాంతంగా ఉంది. అప్పుడు ఒక సంఘటన జరిగినపుడు పరిస్థితులు అలా ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడైతే ప్రశాతంగా ఉంది. హైదరాబాద్‌ యూనివర్సిటీకి దేశంలోనే బెస్ట్‌ యూనివర్సిటీగా పేరుంది. గత యాభై ఏళ్లలో వేగంగా అభివృద్ధి చెందిన విశ్వవిద్యాలయం ఇది. అదెలా చెబుతానంటే రకరకాల అసెస్‌మెంట్స్‌ చేస్తుంటారు. ఒక్కో యూనివర్సిటీ ఒక్కోదాంట్లో బెస్ట్‌గా ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ మాత్రం అన్నింట్లోనూ బెస్ట్‌గా ఉంటుంది.

 

ఆర్కే: ఇంత గుర్తింపు రావడానికి కారణం కోర్సులా లేక ఫ్యాకల్టీనా?

అప్పారావు: ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. ఫ్యాకల్టీ ఎంపికలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటాం. ఈ యూనివర్సిటీలో చదువుకోవడానికి దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థులు వస్తారు. ఏ యూనివర్సిటీలోనూ ఇంత కాంపిటీషన్‌ కనిపించదు. ఢిల్లీ జెఎన్‌టీయూ కన్నా హైదరాబాద్‌ యూనివర్సిటీలో సీటు సంపాదించడం కష్టం. లాస్ట్‌ ఇయర్‌ 66 వేల అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం సీట్ల సంఖ్య 1900 నుంచి 2 వేల వరకు ఉంటుంది. మొత్తం విద్యార్థులను చూస్తే 55 నుంచి 60 శాతం వరకు తెలుగు విద్యార్థులుంటారు. మిగతా 40 శాతం దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఉంటారు.

 

ఆర్కే: ప్రశాంతంగా ఉందని అంటున్నారు కానీ ఒక వీసీకి కూడా ప్రభుత్వం గన్‌మెన్‌లను కేటాయించింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? 

అప్పారావు: ఆ సంఘటన జరిగిన తరువాత గన్‌మెన్‌లను ఇచ్చారు. దాన్ని అలానే కంటిన్యూ చేస్తున్నారు.

 

ఆర్కే: టీచింగ్‌ వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు?

అప్పారావు: ఒకేసారి నాకు రెండు ఉద్యోగాలొచ్చాయి. ఒకటి నాన్‌కన్వెన్షనల్‌ ఎనర్జీస్‌లో సైంటిఫిక్‌ ఆఫీసర్‌గా, రెండోది యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీగా. నేను కావాలని టీచింగ్‌ ప్రొఫెషన్‌ను ఎంచుకున్నాను. అందుకు కొన్ని కారణాలున్నాయి. చదువులో నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఇద్దరున్నారు. ఒకరు ఉస్మానియా యూనివర్సిటీలో కామర్స్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన సత్యనారాయణగారు. ఆయన నా మేనమామ. ఇంకొకరు మా ఊరికే చెందిన వ్యక్తి డా.వి.ఎస్‌ రావు. తను బిట్స్‌ పిలానీలో డైరెక్టర్‌గా చేశారు. వీరిద్దరూ నాకు స్ఫూర్తి. ప్రతిరోజూ క్లాస్‌కు వెళ్లి బయటకు వచ్చేటప్పుడు ఉండే సంతృప్తి ఇతర ఏ ఉద్యోగంలోనూ దొరకదు.

 

ఆర్కే: మీకు స్ఫూర్తినిచ్చిన వాళ్లతో పోల్చుకుంటే టీచింగ్‌ వృత్తిలో మీకు ఎన్ని మార్కులు వేసుకుంటారు?

అప్పారావు: వాళ్ల క్లాసులు వినలేదు కాబట్టి నేను చెప్పలేను. నా విషయానికొస్తే మాత్రం 90 శాతం శాటిస్‌ఫాక్షన్‌తో ఉంటాను.

 

ఆర్కే: మీ దగ్గర చదువు నేర్చుకుని పైకొచ్చిన వాళ్ల పేర్లు చెప్పండి?

అప్పారావు: చాలా మంది ఉన్నారు. దాదాపు నా దగ్గర 20 మంది పిహెచ్‌డి చేశారు. వీళ్లలో సిసిఎంబిలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న వారున్నారు. యూఎస్‌ఎ, కెనడాలో స్థిరపడిన వారున్నారు.

 

ఆర్కే: కుటుంబ నేపథ్యం ఏంటి?

అప్పారావు: మాది చిన్న గ్రామం. నాన్న వ్యవసాయం చేసే వారు. స్కూల్‌కెళ్లాలంటే మా ఊరి నుంచి ఐదారు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. చిన్నప్పుడు రోజూ స్కూల్‌కు నడిచి వెళ్లడం, ఆ సమయంలో మొక్కలు, పశువులు, గొర్రెలు...ఇలా ప్రకృతిని దగ్గరగా చూడటం వల్ల సైన్స్‌పై ఇష్టం పెరిగింది. 8 నుంచి 10వ తరగతి వరకు సైన్స్‌ టీచర్‌ ఒక్కరే ఉన్నారు. ఆ టీచర్‌ పాఠాలను మనస్సుకు హత్తుకుపోయేలా చెప్పే వారు. నేను రోజూ చూస్తున్నవి అవే... తరగతి గదిలో టీచర్‌ చెబుతున్నవి అవే. అప్పుడే అనిపించింది. చదివితే ఇలాంటి న్యాచురల్‌ సైన్సే చదవాలి అని. అలా ఇంటర్‌లో బైపీసీ, డిగ్రీలో బాటనీ తీసుకున్నాను. రీసెర్చ్‌కు ఉపయోగపడుతుందని ఎంఎస్సీలో తెగుళ్లు, వాటి నివారణ అనే సబ్జెక్ట్‌ను తీసుకున్నాను.

 

ఆర్కే: తెగుళ్లు, వాటి నివారణ గురించి చదివానని అంటున్నారు కదా. ప్రస్తుతం రైతులు విపరీతంగా క్రిమిసంహారక మందులు వాడి నష్టపోతున్నారు. మీలాంటి వారు వీటిపై ఏం చేయలేరా?

అప్పారావు: రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పురుగుల వల్ల పంటకు నష్టం. రెండో రకం పంటకు తెగుళ్లు సోకుతాయి. అవి ఆకుమచ్చ, బూజు తెగుళ్లు అని ఉంటాయి. తెగుళ్ల నివారణకు వాడే వాటిని ఫంగీసైడ్స్‌ అంటాం. పురుగుల నివారణకు వాడే వాటిని పెస్టిసైడ్స్‌ అంటాం. వీటిని వాడటం వల్ల పంటకు హాని చేసే పురుగులతో పాటు మేలు చేసే పురుగులు కూడా చనిపోతున్నాయి. అంతేకాకుండా దీర్ఘకాలంలో హానిచేసే పురుగులు రెసిస్టెన్స్‌ను పెంచుకుంటున్నాయి. ఒక పంట ఆరోగ్యంగా ఉందీ అంటే ఆ పంట చుట్టుపక్కల సహాయపడే కారకాలు ఎవో ఉన్నాయి అర్థం. పీహెచ్‌డీలో నేను ఆ అంశంపైనే పరిశోధన చేశాను. నేను చేసిన ఆ పరిశోధన ఆ తరువాత ఎంతో మందికి బేసిక్‌గా ఉపయోగపడింది. మొక్క వేర్ల చుట్టూ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియాను మొక్కకు తెగుళ్లు సోకకుండా ఎలా ఉపయోగించాలి? ఆ కాన్సెప్ట్‌పై పనిచేస్తున్నాం. గత పదేళ్లుగా చాలా వర్క్‌ జరుగుతోంది.

 

ఆర్కే: కొందరు ప్రొఫెసర్లు తమ దగ్గర పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులను వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తుంటాయి. వీటిలో ఎంత వరకు వాస్తవం ఉంది?

అప్పారావు: వాస్తవం లేదని అనను. వార్తలు మనం వింటూనే ఉన్నాం. వాటికి ఆధారాలుంటున్నాయి. వాళ్లమీద చర్యలు తీసుకున్న సంఘటనలున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అవాస్తవం అనలేము. టీచర్‌ విద్యార్థులకు రోల్‌మోడల్‌గా ఉండాలి. మా టీచర్ల దగ్గర నుంచి మేం అది నేర్చుకున్నాం.

 

ఆర్కే: వేరే గ్రంథం నుంచి కొంత సమాచారాన్ని చౌర్యం చేశారని వార్త ఎందుకొచ్చింది?

అప్పారావు: ఒక ఆర్టికల్‌ రాసేటప్పుడు పూర్వ విద్యార్థులు రాసిన ఇంట్రడక్షన్‌లో నుంచి ఒక వాక్యం తీసేసుకుందాం అని అనుకుంటారు. నేను ప్రతి లైన్‌ చూడలేను కదా! అది మీ పేపర్‌లోనే పబ్లిష్‌ అయింది. ఇతరుల పరిశోధనలు తీసుకుని మన పరిశోధన అని చెప్పుకున్నప్పుడు చౌర్యం అనొచ్చు. ఒక వాక్యం కూడా తీసుకోవద్దు కానీ, తెలియక తీసుకున్నారు. మేం రాసిన రెండు లైన్ల అపాలజీని కూడా పబ్లిష్‌ చేశారు.

 

ఆర్కే: గతంలో వైస్‌ చాన్స్‌లర్‌ అంటే ఒక గౌరవం ఉండేది. ఇప్పుడు వైస్‌ చాన్స్‌లర్‌ హోదా కోసం దిగజారిపోయి పైరవీలు చేసుకుంటున్నారు. దీన్ని మీరు ఎలా జస్టిఫై చేస్తారు?

అప్పారావు: మీరు చెప్పిన దాంట్లో నిజం ఉంది. గతంలో వైస్‌ చాన్స్‌లర్‌ ఎంపిక వరకే ప్రభుత్వం కలుగజేసుకునేది. తరువాత బాధ్యతలు అతనికే అప్పజెప్పేది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఎన్ని యూనివర్సిటీలున్నాయి. ఎన్ని కులాల వారిని ఎంపిక చేశాం. ఎంత మంది మహిళలకు ఇచ్చాం. ఈ లెక్కలు చూసుకోవడానికే సరిపోతోంది. ఈ లెక్కలు సరిచేసే క్రమంలో మెరిట్‌ లేని వాళ్లు కూడా ఎంపికవుతారు. వాళ్లు ప్రతి పనికీ ప్రభుత్వంపై ఆధారపడతారు.


ఆర్కే: వేముల రోహిత్‌ ఎపిసోడ్‌ గురించి మీరేం చెబుతారు?

అప్పారావు: అది చాలా దురదృష్టకరమైన సంఘటన. అండర్‌స్టాండింగ్‌ లోపం ఎక్కడో ఉంది. ఆ సంఘటనకు నాకు సంబంధం లేదు. అది రాజకీయ రంగు పులుముకుంది. హెచ్‌సీయు మీద లేదు. అప్పారావు మీద లేదు. ఆ సమయంలో ఇన్‌టాలరెన్స్‌ అని దేశవ్యాప్తంగా ఒక పదం వినపడుతోంది. బీజేపీ ప్రభుత్వం పట్ల యూపీఎకు ఉన్న ఇన్‌టాలరెన్స్‌ అది. మాలాంటి వాళ్లకు అర్థమయిన విషయం అది. రాహుల్‌గాంధీ ప్రత్యేక విమానం వేసుకుని యూనివర్సిటీకి రావాల్సిన అవసరం ఏమిటో దేశానికి ఆయనే చెప్పాలి. విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యలు అదే మొదటిది కాదు, చివరిది కాదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న సమయంలోనూ జరిగాయి.

 

ఆర్కే: ‘మమ్మల్ని సాంఘిక బహిష్కరించారు. వెలేశారు. మీరు విత్‌డ్రా చేసుకోండి. లేకుంటే విషమో, ఉరితాడో వేసుకుని చచ్చిపోతాను’ అని వీసీకి ఉత్తరం రాశాడు కదా. అప్పుడు ఏదో ఒకటి సెటిల్డ్‌ చేసి ఉంటే సరిపోయేదా?

అప్పారావు: అప్పుడు డీన్‌ స్టూడెంట్స్‌ ఆఫ్‌ వెల్ఫేర్‌గారు వారితో కొందరు మాట్లాడుతూనే ఉన్నారు. ఎలా చేయవచ్చు, యూనివర్శిటీ ఎలా చేసే అవకాశముందని చెబుతూనే ఉన్నారు. దురదృష్టమేంటంటే ఒక వైపు వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇంకో వైపు మరో ఒత్తిడి గురించి ఆలోచించారు. ఎలాగూ న్యాయస్థానం ఆశ్రయించారు కదా..తీర్పు చెప్పేదాకా చూద్దామని మేం చెబుతూ వచ్చాం. మధ్యలో వేలు పెట్టడం మంచిది కాదనుకున్నాం.

 

ఆర్కే: మూడో వ్యక్తిగా అడుగుతున్నా.. ఆ రోజున ఇరువర్గాలు పంతానికి వెళ్లారా?

అప్పారావు: అదేం లేదు. డీన్‌ స్టూడెంట్స్‌ వెల్ఫేర్‌గారు చాలా రకాలుగా చెప్పి చూశారు.

 

ఆర్కే: ఆ అబ్బాయి పోకముందే పిల్లోడు కదా అని ఏదోటి చేసి ఉండాల్సింది. ఉపాధ్యాయుడు- విద్యార్థి అనుబంధం గొప్పది కదా. వ్యక్తిగతంగా తీసుకోకూడదు. టీచర్లపై పిల్లలకు గౌరవం ఉండాలి. అదేవిధంగా పిల్లలపై టీచర్లకు వాత్సల్యం ఉండాలి. అదేమైన లోపించిందా?

అప్పారావు: ఇద్దరూ వ్యక్తిగతంగా తీసుకోకూడదు. లోపించటం మిగతా చోట్లకన్నా తక్కువేం కాదు. సమాజంలో మనస్పర్థలు, అభిప్రాయబేధాలున్నట్లే యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో కూడా ఉన్నాయి. అది మినీ ఇండియా. అలాగే అన్నీ రెఫ్లెక్ట్‌ అవుతున్నారు. అక్కడ తక్కువగా, ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అనకూడదు. మాదగ్గర ఇలాంటివి తక్కువగా ఉంటాయి. అయితే ఇది ఐసోలేటెడ్‌ కేస్‌. ఐదువేల మంది విద్యార్థులు ఉంటే ఎక్కడో ఒకటి ఇలా జరిగి యూనివర్శిటీకి ఇలా జరగటం బాధాకరం. నేను వీసీ కాకముందు, అయ్యిన తర్వాత కూడా టీచర్లతో నేను మాట్లాడే విధానం చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. స్టూడెంట్స్‌కి చాలా దగ్గరగా టీచర్లు ఉండాలంటాను. ఒక్కో విద్యార్థిని ఒక్కో విధంగా చూడాలి. వారితో ఫ్రెండ్లీగా ఉండాలని చెబుతాను. పర్సనల్‌గా నా ల్యాబ్‌లో 20 మంది విద్యార్థులు పని చేస్తారు. ఏ విద్యార్థితో సమస్య రాలేదు. మా టీచర్లు విద్యార్థులను దూరం పెట్టలేదు. దూరం పెట్టిన చోటే ఈ సమస్యలు వస్తున్నాయి.

 

ఆర్కే: ఫ్యాకల్టీలోనే రెండు కులాల గ్రూప్‌లు ఏర్పడ్డాయి కదా.. పత్రికల్లో కూడా వచ్చింది...

అప్పారావు: కొంతమంది బయటనుంచి అలాగే అనుకుంటారు. మీకు డీటైల్డ్‌గా చెబుతాను. 400 మందిలో 20 మంది, మరో 380 మందిని కలిపి రెండు గ్రూపులు అందామా. టెక్నికల్‌గా రెండు గ్రూపులు అవుతాయి కానీ అలాకాదు. వాళ్లు కూడా నాతో పని చేశారు. అంతకుముందు నేను టీచర్స్‌ అసోషియేషన్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. ఎవరైతే ఆ నంబర్స్‌ ఉన్నారో అందరూ నాతో కలిసి ఆరేడేళ్లు పని చేశారు. ప్రయాణం చేశారు. అలాంటి యాక్టివిటీలో పని చేసినపుడు ఆ రోజున వారికి నేను తప్పు కనపడలేదు. దీన్ని కూడా వివరంగా చూద్దామనకుండా.. అప్పారావు తప్పు చేశాడనుకున్నారు. ఆ ఆలోచన లేకుండా రాహుల్‌ గాంధీ, సీతారామయ్య ఏచూరిగారు వచ్చారని వారు ఆ ప్రభావంలో పడిపోయారు. దానికి పొలిటికల్‌ వచ్చింది. యూపీఏకి ఇన్‌టోలరెన్స్‌ ఎన్డీఏ. కేజ్రీవాల్‌, రాహుల్‌ గాంధీ, సీతారామయ్య ఏచూరి గారు వస్తారు. వాళ్లే వస్తారు. విశ్వవిద్యాలయంలోకి వచ్చి వేరేవి చేయకూడదు. ఏదో పబ్లిక్‌ ఫిగర్‌, ఎవరైనా అయి ఉండచ్చు.. నాతో మాట్లాడి ఉంటే మాట్లాడేవాణ్ణి. అలా కాకుండా దాంతో లబ్ధిపొందాలని ఆలోచిస్తే ఎలా.. దాంతోనే అలా అయ్యింది. ఇది పొలిటికల్‌ యాంగిల్‌. నేను రాసిన ఆర్టికల్‌లో రాహుల్‌గాంధీ రావటం తనస్థాయిని తగ్గించుకోవటమే అని రాశాను. ఇలా జరగకూడదు. జరిగాక అందరూ చలిమంటలు కాచుకునే వాళ్లు ఉంటారు. అపోజిషన్‌లో బిజెపి ఉన్నా ఇలా చేసేది. ఎవరూ పునీతలు కాదు.

 

ఆర్కే: దళత వ్యతిరేకి అనే ముద్ర అంతకుముందే మీపై ఎందుకు పడింది?

అప్పారావు: ఎందుకేశారో తెలీదు.

 

ఆర్కే: మీరు హాస్టల్‌ వార్డెన్‌గా ఉన్నపుడు రస్టికేట్‌ చేశారని అంటారు..

అప్పారావు: చీఫ్‌ వార్డెన్‌కి అటువంటి వాటిల్లో ఎలాంటి అధికారాలు లేదు. ఆయనేమీ చేయలేడు. మహా అయితే కంప్లయింట్‌ ఇవ్వగలడు. రస్టికేషన్‌ అనేది మరీ పెద్దది. అలా చేసే అధికారం చీఫ్‌ వార్డెన్‌కు లేదు. వెళ్లాలంటే ముందు ఎంక్వయిరీ కమీషన్‌ ద్వారా, ఎగ్జిక్యూషన్‌ కమిటీకి వెళ్లాలి. అవన్నీ అయ్యాకే రస్టికేషన్‌ అవుతుంది. ఆ రోజున ఏమి జరిగిందో జనాలకు గుర్తు లేదు. ఎవరో ఒకరినుంచి ఒకరికి సమాచారం వచ్చింది. ఆ రోజున హైకోర్టు జడ్జిమెంట్‌ను లింక్‌ ఇస్తాను. సమాచారం పేపర్స్‌ ఇస్తాను. జడ్జిగారు ఏమి  చెప్పారో అది చదువుకుని పేపర్లలో రాయండి దయచేసి. మీ నిర్ణయం మీరు తీసుకోండి. ఆ రోజున హైకోర్టు జడ్జిమెంట్‌ క్లియర్‌గా చెప్పింది. ఇటువంటి యూనివర్శిటీలో వైస్‌ చాన్సలర్‌ ఫలానా నిర్ణయం తీసుకోకుంటే విశ్వవిద్యాలయాలు పాడైపోతాయని జడ్జి తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత ఎవరూ మాట్లాడలేదు. హాస్టల్స్‌లో పరిస్థితి ఏంటంటే.. ఆ రోజున 1500 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 1400 మంది హ్యాపీగా ఉన్నారు.

 

ఆర్కే: వారిలో దళితులు కూడా హ్యాపీగా ఉన్నారా?

అప్పారావు: ఉన్నారు చాలా మంది. సారుంటే మెస్‌ క్వాలిటీగా, స్ట్రిక్ట్‌గా పనులు చేయిస్తాడు. మెస్‌బిల్‌ పెరగకుండా చేయిస్తాడనుకున్నారు. బేసిక్‌ ఫెసిలిటీస్‌ మీద దృష్టి పెడతాడు అని 1400 మంది అనుకున్నారు. ఇరవై మంది వేరే అభిప్రాయంతో ఉంటే ఏం చేయాలి? ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయగలిగిందేమీ లేదు. కొందరు అగ్రెసివ్‌గా ఉండటం, వారు తోచిన పద్ధతిలో ఏదైనా బయటికి వస్తాయి. అలా కాకుండా చీఫ్‌ వార్డెన్‌గారు స్కాలర్‌షిప్‌ అమౌంట్‌లో బేసిక్‌ వచ్చేందుకు ఆయన కృషి చేశాడని క్యాంపస్‌ అప్రీషియేషన్‌ చేసింది. అదెవరికీ తెలీదు.

 

ఆర్కే: రోహిత్‌ ఇష్యూ వచ్చినపుడు దత్తాత్రేయ లెటరే ఇలా చేసిందంటారా?

అప్పారావు: ఆయన ఉత్తరం రాసిన మాట మాత్రం వాస్తవం. యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లో అలాంటి ఉత్తరాలు వస్తే చూసి పక్కన పెడతాం. నేను వీసీ అయ్యాక ఆ ఇన్సిడెంట్‌ జరిగిన తర్వాత ఎమ్‌హెచ్‌ఆర్‌డీ నుంచి మాకు ఫోన్‌ రాలేదు. ఒత్తిడి రాలేదు. ఎవరైనా ఉత్తరం రాస్తే వెంటనే ఫార్వర్డ్‌ చేస్తారు. అలాగే మా మంత్రిగారు కవర్‌లో పంపి ఉంటారు. ఇలాంటిదేదో ఉంది చూడండి అని ఆమె రాశారు. ఆయన కూడా చూడండి అన్నారు. అయితే ఫోన్‌ చేయకుండా ఒత్తిడి చేస్తారని అంటే ఎలా.. ఏమైందో చెప్పండి అంటున్నారు.

 

ఆర్కే: రిమైండర్‌లో ఎందుకు పంపించారు. ఇవాళ.. ఓ పిఎమ్‌ చూడండి అంటారు. దాని అర్థం ఏమిటి.. అసలు పొలిటీషియన్లు చేయమని చెప్పరు..

అప్పారావు: ఆ రోజు మేం ప్రొసీజర్‌ ప్రకారం వెళ్లాం. లెటర్‌ వచ్చిందని కాదు. ఏదో చేయాలని అలా చేయలేదు. మాకు వేరే చోటనుంచి ఒత్తిడి వచ్చింది. అది కోర్టునుంచి వచ్చింది. ఆ కుర్రాడి అమ్మ కోర్టులో ఫైల్‌ చేశారు. సమాధానం చెప్పమని అడిగారు. దీంతో ఒత్తిడి పెరిగింది. ఆ టైంలోనే ఈ ఉత్తరాలు వచ్చాయి. అప్పుడు కూడా తొందరపడలేదు. కమిటీ వేశాం. ఇన్స్‌డెంట్‌ జరిగినపుడు నేను వీసీ కాదు. వీసీ అయ్యాక ఎగ్జిక్యూషన్‌ కమీటీ, డేట్స్‌తో కొంచెం ఆలస్యం జరిగింది. మమ్మల్ని ఎప్పుడూ చెప్పే అవకాశం లేదు. ఎవరు పడితే వారు యాక్షన్‌ తీసుకోకూడదు. మాకు కూడా సీరియస్‌, భోగస్‌ కంప్లయింట్స్‌ వస్తుంటాయి. ఏం చేస్తామని మేం అడుగుతుంటాం. అదే సిస్టమ్‌లో ఉంటుంది.. లేకుంటే జస్ట్‌ ఫార్వర్డ్‌ చేసి నాన్‌ సీరియస్‌ అయితే మర్చిపోతాం. మా యూనివర్శిటీలో వారెవరో లెటర్లు రాశారని పట్టించుకోం. యూజీసీ రాస్తే, వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని భయపడతాం.

 

ఆర్కే: మీరు అప్పాయింట్‌మెంట్‌ అయితే ఐదేళ్లు ఉంటారా?

అప్పారావు: ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి. తప్పు చేశారనే ఎవిడెన్స్‌ ఉంటే తీసేస్తారు.


ఆర్కే: ఇన్సిడెంట్‌ తర్వాత ఆ అబ్బాయి అమ్మను మీరు కలిశారా.. మీ మీదున్న అభిప్రాయాన్ని తొలగించుకోవటానికి ప్రయత్నించారా?

అప్పారావు: అలా చేసినా ఫలితం లేదు. ఇన్సిడెంట్‌ జరిగిన మరుసటి రోజే నేను వెళ్లాను. మాట్లాడతానని చెప్పింది. తీరా వెళ్లాక ఎవరో చెప్పారని ఆమె నాతో మాట్లాడలేదు. క్యాంపస్‌కు వచ్చినపుడు నేను లేనప్పుడు. ఆ సమయంలో ఆమె వచ్చారు. ఆ తర్వాత షెడ్యూల్‌ క్యాస్ట్‌ కమీషనర్‌గారిని కలిసినపుడు ఆయనతో ఎనిమిది లక్షలు ఇస్తానని చెప్పాను. అది తీసుకోవటానికి వారు ఆసక్తి చూపలేదు. వారి సర్కిల్‌లో వీసీ శత్రువు అని చెప్పారు. వారదే అనుకున్నారు. మేం అన్ని రకాలుగా చెక్‌ ఇవ్వడానికి ప్రయత్నించాం. టీచింగ్‌ ఫ్యాకల్టీలో అనుకూలంగా ఉన్నవారూ తీసుకోలేదు. తనతో సఖ్యతతో ఉన్నవారు కూడా తీసుకోలేదు. షెడ్యూల్‌ క్యాస్ట్‌ కమీషనర్‌గారితో డీడీ ఇస్తాను. మీరే వారికి ఇవ్వడం అని అడిగాను. తీసుకుంటారు. నేనే చెప్పాను అన్నారు. డీడీ వ్యాలిడిటీ అయిపోయాక. మళ్లీ కొత్తది తయారు చేశాం. ఈ చెక్‌ వ్యాలిడిటీ అయిపోతోంది. ఎప్పుడు వచ్చినా ఇస్తాం.


ఆర్కే: మీరు ఆ సమయంలో కేసు కొలిక్కి రాలేదని సెలవులో వెళ్లారా?

అప్పారావు: కేసు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. అప్పటి వరకూ నేనెక్కడ ఉండాలి. సెలవులో వెళ్లమని ఎవరూ చెప్పలేదు. మా కమీషనర్‌గారు ‘పరిస్థితులు ఏమీ బాగా లేవు.దూరంగా ఉండటం మంచిది’ అని సలహా ఇచ్చారు. ఆ మాటను నేను గౌరవించాల్సి వచ్చింది. అదే చేశానంతే. వేరే ఏమీ కాదు.

 

ఆర్కే: యూనివర్శిటీ క్యాంపస్‌లో మందుబాటిళ్లు, అన్ని ఛండాలాలు ఉన్నాయి. అది ఓ రకంగా మీకు సమస్యే కదా?

అప్పారావు: నేను డిఫైన్‌ చేయను. ఈ విశృంఖలత్వం సమాజంలో అన్ని చోట్లా ఉంది. మా యూనివర్శిటీ తక్కువేం కాదు. ఆ కల్చర్‌ను ఉన్నది పెరగకుండా, తగ్గించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా. నేను ఒకప్పుడు వీసీ కాకముందు, అయిన తర్వాత ఇప్పటి వరకూ ఈ కల్చర్‌ చాలా తగ్గింది. నేను సిగరెట్‌, బీర్‌ తాగనని మా పిల్లలకు తెలుసు. అలాంటివి ఉంటే సహించడని వారికి తెలుసు. నా టీమ్‌లో వాళ్లు కూడా ఇటువంటి విషయాలు నా దృష్టికి వస్తే స్ట్రిక్ట్‌గా ఉంటానని తెలుసు. వార్డెన్స్‌, సెక్యూరిటీలు స్ట్రిక్ట్‌గా ఉన్నారు. ఏమీ జరగలేదని మాత్రం అనను.


ఆర్కే: టీచర్లు, విద్యార్థులు కలిసి డ్యాన్సులు వేస్తున్నారు కదా!

అప్పారావు: ఆ కల్చర్‌ ఉన్న వారిని నేను మార్చలేను. నా ఇంట్లో నేను చేస్తే నీకెందుకు అంటే ఎవరూ సమాధానం చెప్పలేరు. అది వారి వ్యక్తిగతం. మా క్యాంపస్‌లో ఏదైనా చేస్తే ఊరుకోను కదా. పిల్లలు హాస్టల్‌ రూమ్స్‌లో, పబ్లిక్‌ ప్లేస్‌లో ఏమైనా చేస్తే మేం కంట్రోల్‌ చేస్తున్నాం. డ్రగ్స్‌ విషయంలో కూడా చాలా కంట్రోల్‌ చేశాం. మా దగ్గర జీరో అని చెప్పను. అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నామంతే. మా యూనివర్శిటీలో అన్నింటికంటే ఎక్కువ ఉందని నేను ఉన్నంత వరకూ అనిపించను. కంట్రోల్‌ చేస్తాను. నేను ఎవరితో మాట్లాడినా గ్రాంట్స్‌ గురించి, అకడమిక్‌ గురించి, టీచింగ్‌, రీసెర్చ్‌లు, పేటెంట్‌ ఫైలింగ్‌ గురించే మాట్లాడతాను.


ఆర్కే: ఎన్డీఏ గవర్నమెంట్‌ తర్వాత యూనివర్శిటీలో కాషాయం పెరిగిపోతోందనే వాదన ఉంది అంటున్నారు. నిజమేనా?

అప్పారావు: నాకర్థం కాదు. మన్మోహన్‌ సింగ్‌ ఉన్నపుడు కాంగ్రేస్‌ వాదం పెరిగిందా. పరిస్థితుల్లో నాకు డిఫరెన్స్‌ లేవు. ఇరవై ఏడు సంవత్సరాలనుంచి పని చేస్తున్నా. నాకేం పెద్ద తేడా కనిపించటం లేదు. ఆ టెర్మినాలజీ ఎటునుంచి వస్తాయో అని ఆశ్చర్యమేస్తుంది. నాకు తెలిసిందేంటంటే.. ఓర్చుకోలేకపోతున్నారు. మన్మోహన్‌ సింగ్‌గారు టాప్‌ ఆఫ్‌ ది ఎఫైర్స్‌లో పది ఏళ్లు ఉన్నారు. మన లెఫ్ట్‌ పార్టీలు అన్ని రకాలుగా వాడుకున్నారు. ఆ రోజుల్లో వారు వామపక్షభావజాలాలతో నడిచాయని ఒప్పుకుంటే.. వీళ్లు ఈ భావజాలాలు నడిచాయని వొప్పుకుంటారు. యూనివర్శిటీలో ఎలాంటి మార్పులేదు. ఇరవై మంది రిటైర్డ్‌ అయి ఉంటారు. అందరం అలాగే ఉన్నాం. అప్పుడు సెక్యూర్డ్‌ ఫీలింగ్‌ ఉండేది.


ఆర్కే: మీరు చదువుకునేప్పుడు యూనివర్శిటీలో మీరు కొన్ని భావజాలాలపై వెళ్లారా?

అప్పారావు: మా స్నేహితులు వామభావజాలంపై ఆసక్తి ఉండేది. నాది ఇండిపెండెంట్‌ పాత్‌ ఉండేది. ఓ స్టేజ్‌లో ఓ క్లాస్‌కి లీడర్‌గా ఉండేవాణ్ణి. చిన్నపుడు క్రమశిక్షణగా చదువుకున్నా. హిందూ కాలేజీలో చదువుకునే అవకాశం వచ్చింది. మా నాన్న టీచర్‌. ఆయన అక్కడే చదువుకున్నారు కాబట్టి అలా వెళ్లాను. నాకు పదోతరగతిలో తక్కువ

మార్కులు వచ్చాయి. ఇంగ్లీష్‌ మీడియం అడ్మిషన్‌ ఇస్తే నువ్వు చదవలేవని ఇవ్వలేదు. మా నాన్న వాళ్ల టీచర్‌ను అడిగితే ప్రిన్సిపాల్‌ దగ్గరికి వెళ్లి సంతకాలు పెట్టించి, కరస్పాండెంట్‌ దగ్గర డబ్బులు కట్టండని చెప్పి పంపించారు. మా పెదనాన్న అడ్వకేట్‌. ఆయన క్రమశిక్షణతో ఉండేవారు. వారి ఇంట్లోనే చదువుకున్నా. అలా ఇంట్లోనూ, కాలేజ్‌లో అలాగే ఉండటం వల్ల మంచి మార్గంలో వెళ్లే అవకాశం వచ్చింది.


ఆర్కే: కొత్తగా చేరే పిల్లల దగ్గర హామీపత్రాలు తీసుకుంటున్నారట!

అప్పారావు: కొంతమంది యంగర్స్‌ ఎవరో వారు వెళ్తున్నారని వాళ్ల వెనకాల వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివి చేయకండి అని వారితో హామీ తీసుకున్నాం. వాళ్లు ఎలాంటి తప్పులు చేయలేదు. ఓవరాల్‌గా పదిహేను మంది రకరకాల ఆలోచనలతో నాయకులు అవ్వాలనుకుంటున్నారు. ఆ పదిహేనువందల మందిలో వారు నాయకులుగా ఎదగాలనుకుంటారు. చేసే ప్రతి పనిని గొప్పది చేస్తున్నామనుకుంటే ఎలా.. మంచి పనులు చేసి, యూనివర్శిటీలో నాయకులుగా ఎదగటం తప్పు కాదు. వేరే దారిలో వెళ్లకూడదు.

 

ఆర్కే: మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏది?

అప్పారావు: ఈ సంఘటన. రోహిత్‌ నా స్టూడెంట్‌. నేను క్లాసులు చెప్పాను ఆ అబ్బాయికి. తను ఆత్మహత్య చేసుకున్నాడన్న బాధ. నాది అనుకున్న నా క్యాంపస్‌ను వదిలి దూరంగా ఉన్న విషయాలు పిండేశాయి.


ఆర్కే: మీ భార్యపిల్లలు ఆ సమయంలో ఎలా రియాక్టరయ్యారు?

అప్పారావు: నా భార్య ఆ సమయంలో లేరు. ఆమె 2010లో పోయారు. ఆ అప్పుడు పిల్లలు సఫర్‌ అయ్యారు. క్యాంపస్‌లో మా పిల్లలు కలిసి జోవియల్‌గా సోషల్‌గా అందరితో కలిసేవారు. నా అన్న ఇలా మాట్లాడుతున్నాడు. మా డాడీ ఇలా చేయడని వారు అనుకున్నారు. పెద్దబ్బాయి ఎంబీఎ అయిపోయింది. పిడబ్ల్యుసిలో పని చేస్తున్నాడు. పుల్లల గోపీచంద్‌ గారి దగ్గర రెండో అబ్బాయి బ్యాడ్మింటన్‌ నేర్చుకుంటున్నాడు. ఈ ఇన్సిడెంట్‌ తర్వాత నేను మళ్లీ పెళ్లి చేసుకున్నా.

 

ఆర్కే: మీ జీవితంలో హ్యాపియస్ట్‌ మూమెంట్‌ ఏది?

అప్పారావు: అదేం కాదు. మంచి రిసెర్చ్‌ పేపర్‌ పబ్లిష్‌ చేసినపుడు హ్యాపీగా ఉంటుంది. మేం సంవత్సరానికి ఐదు పబ్లిష్‌ చేస్తుంటాం. అందులో మంచివి, సాటిస్‌ఫ్యాక్షన్‌గా ఈ

ఇరవై ఏడు ఏళ్లలో 12 సార్లు ఇలాంటి హ్యాపీ మూమెంట్స్‌ ఉన్నాయి.

 

ఆర్కే: రిటైర్‌ అయ్యాక ఏం చేస్తారు?

అప్పారావు: నా వయసు యాభై ఆరు. 2020లో వీసీగా రిటైర్‌ అవుతాను. ఆ తర్వాత మరో ఏడేళ్లు ప్రొఫెసర్‌గా పని చేస్తా. ఏమీ ఫీలవ్వను. నాలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారికి వేరే చోటకి వెళ్లమని కొందరు సలహాలు ఇస్తారు. కానీ యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌ గోడ దాటికి బయటికి వెళ్లను. ప్రొఫెసర్‌ ఉద్యోగం చేయటం సంతృప్తినిస్తుంది. నాకు రీసెర్చ్‌ ల్యాబ్‌ ఉంది. కోట్లరూపాయలు పెట్టి తయారు చేశాం. ఇవన్నీ వదులుకోని ఎక్కడికి వెళ్లాలి. నా అచీవ్‌మెంట్‌ రీసెర్చ్‌లో చేయాలి. అందుకే యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌కి మాత్రమే అప్లై చేశాను. వేరే యూనివర్శిటీకి చేయలేదు. ఆ రెన్నెళ్ల కాలంలోనూ వీసీ కుర్చీకోసం బాధపడలేదు. నా ల్యాబ్‌కి వెళ్లలేదు. నా విద్యార్థులతో మాట్లాడుకోవటం మిస్‌ అయ్యానని బాధపడ్డా. అంతేకానీ వీసీ ఉద్యోగం గురించి కేర్‌ చేయలేదు. యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వైస్‌ చాన్స్‌లర్‌ కుర్చీ కోసం 200 మంది దరఖాస్తు చేస్తున్నారు. మా యూనివర్సిటీ నుంచి 16 మంది అప్లై చేశారు. అందులో 17 మందిని షార్ట్‌లిస్ట్‌ చేశారు. అందులో మా యూనివర్సిటీ వాళ్లం ఆరుగురం ఉన్నాం. అందులో నుంచి చివరకు ముగ్గురు పేర్లు ఎంహెచ్‌ఆర్‌డీకి రికమెండ్‌ చేశారు. అందులో ఇద్దరం హెచ్‌సీయు ప్రొఫెసర్స్‌మే. ఆయన నాకంటే సీనియర్‌. మోదీ వచ్చాక మీకు తెలుసు, యంగ్‌ పీపుల్‌ని ఎంకరేజ్‌ చేస్తారని అలా నన్ను ఎంపిక చేశారు.

Updated Date - 2020-02-07T22:44:05+05:30 IST