కన్నుల పండువగా అప్పన్న కల్యాణం

ABN , First Publish Date - 2021-04-24T04:32:05+05:30 IST

చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి సందర్భంగా ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. కరోనా నిబంధనల నేపథ్యంలో భక్తులు, ప్రజాప్రతినిధులు, అతిథులు లేకుండా ఏకాంతసేవగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.

కన్నుల పండువగా అప్పన్న కల్యాణం
వేదికపై ఉభయ దేవేరులతో స్వామివారు

కరోనా నేపథ్యంలో ఏకాంత సేవగా నిర్వహణ 

సింహాచలం, ఏప్రిల్‌ 23: చైత్రమాస శుక్లపక్ష ఏకాదశి సందర్భంగా ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచల వరాహలక్ష్మీనృసింహస్వామి వార్షిక తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం నిరాడంబరంగా జరిగింది. కరోనా నిబంధనల నేపథ్యంలో భక్తులు, ప్రజాప్రతినిధులు, అతిథులు లేకుండా ఏకాంతసేవగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కనీసం విద్యుత్‌ దీపాల కాంతులు ఏర్పాటు చేయకపోవడం నిరాశపరచింది. ఉత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఆలయ ఆస్థాన మండపంలో స్థానాచార్యులు డా.టీపీ రాజగోపాల్‌, ఇన్‌చార్జి ప్రధానార్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, పురోహితులు కరి సీతారామాచార్యులు, గొడవర్తి శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో కొట్నాల ఉత్సవం చేపట్టారు.  అనంతరం అష్టదిక్పాలకులకు ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన రాజగోపురానికి ఎదురుగా అన్నప్రసాదాన్ని పెద్దపోగులా వేసి గ్రామబలిహరణ గావించారు. ప్రహ్లాద వరదుడైన వరాహలక్ష్మీనృసింహస్వామిని తిరుకల్యాణోత్సవంలో పాల్గొనేందుకు  ఆహ్వానం పలుకుతూ సంప్రదాయరీతిలో గరుడ ధ్వజారోహణం జరిపించారు. గరుడ మండపం వద్ద స్వామివారిని పల్లకిలో ఉంచి ధ్వజస్తంభానికి గరుఢ ధ్వజాన్ని ఉంచి షోడశోపచారాలు సమర్పించి శిఖరానికి ఎగురవేశారు. అనంతరం సంప్రదాయాన్ని అనుసరించి ఎదురుసన్నాహం జరిపారు.  తూర్పు మాడవీధుల్లోని జోడుభద్రాల వద్ద స్వామి, అమ్మవార్లను ఎదురెదురుగా ఉంచి అర్చకులు వధూవరుల గుణగణాలను, గోత్ర, ప్రవరలను చెప్పి కల్యాణానికి అంగీకృతులను చేశారు. కల్యాణోత్సవంలో ప్రధాన వేడుక రథోత్సవం  సాదాసీదాగా  జరిగింది.  గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన సర్వజన మనోరంజని వాహనంపై అధిష్ఠింపజేశారు. ఈవో ఎంవీ సూర్యకళ పర్యవేక్షణలో ఆచారం ప్రకారం మత్స్యకారులు కదిరి లక్ష్మణరావు రథోత్సవాన్ని ప్రారంభించారు. కల్యాణ మండపంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక పుష్పవేదికపై అప్పన్నస్వామి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని, ఉభయదేవేరులను బుగ్గన చుక్కతో అలంకరించి అధిష్ఠింపజేశారు. వైదికులు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనములు చేసిన శుద్ధజలాలతో  సంప్రోక్షణ గావించారు. వధూవరులకు కంకణధారణ, వరుడికి నూతన యజ్ఞోపవీత సమర్పణ చేశారు. మహాసంకల్పం చెప్పి శుభముహూర్తవేళ జీలకర్రా బెల్లం పెట్టారు. తర్వాత లక్ష్మీఅష్టోత్తర శతనామావళితో మాంగళ్య దేవతారాధన చేసి ఇద్దరు అమ్మవార్ల మెడలో మాంగళ్యధారణ జరిపించారు. ముత్యాలు కలిపిన అక్షతలతో  తలంబ్రాలు  కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ పాలకమండలి సభ్యులు సూరిశెట్టి సూరిబాబు, సిరిపురపు ఆశాకుమారి, కేవీ  నాగేశ్వరరావు, గరుడ మాధవి, దాడి దేవి, రాగాల నరసింగరావునాయుడు, ఏఈఓలు, పర్యవేక్షణాధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-24T04:32:05+05:30 IST