భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) పై వెబ్ సిరీస్ రాబోతుంది. ఈ షోను అనేక సీజన్లుగా తెరకెక్కించబోతున్నారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ (Applause Entertainment) నిర్మించనుంది. గాంధీ పాత్రను ‘స్కామ్: 1992’ ఫేం ప్రతీక్ గాంధీ (Pratik Gandhi) పోషించనున్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్రగుహ (Ramachandra Guha) రచించిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’, ‘గాంధీ: ద ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ద వరల్డ్’ పుస్తకాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొదించనున్నారు. యువకుడిగా గాంధీ దక్షణాఫ్రికాలో గడిపిన రోజులతో పాటు, భారత స్వాతంత్ర్య పోరాటాన్ని ఈ షోలో చూపించబోతున్నారు. గాంధీ జీవితంలోని మనకు తెలియని కోణాలు కూడా ఈ వెబ్ సిరీస్‌లో ఉంటాయట. ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ లోకేషన్స్‌లో చిత్రీకరిస్తారట.
గాంధీ పాత్రలో కనిపించనుండటంతో ప్రతీక్ గాంధీ సంతోషంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘గాంధీ ఫిలాసఫీపై నాకు నమ్మకముంది. ఆయన విలువలు చాలా సరళంగా ఉంటాయి. నా వ్యక్తిగత జీవితంలోను గాంధీ చెప్పిన మాటలను అనుసరిస్తాను. గాంధీ పాత్ర నా మనస్సుకు ఎంతో దగ్గరైంది. ప్రతిష్ఠాత్మక నాయకుడి పాత్రను పోషిస్తున్నందుకు ఎంతో గర్వకారణంగా ఉంది’’ అని ప్రతీక్ గాంధీ తెలిపారు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ సీఈవో సమీర్ నాయర్ కూడా మీడియాతో ముచ్చటించారు. ‘‘రామచంద్ర గుహ గొప్ప చరిత్రకారుడు, కథకుడు. ఆయన పుస్తకాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్‌ను రూపొదించడం గర్వంగా ఉంది. మహాత్మా గాంధీ పాత్రను పోషించడానికీ ప్రతీక్ గాంధీ కంటే గొప్ప నటుడు మాకు దొరకరు’’ అని సమీర్ స్పష్టం చేశారు.